(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

స్వస్థి ప్రార్ధన



దేవా! యేసుక్రీస్తు ప్రభువా! నీవు దేవుడవైనను మా మానవులకు కనబడుటకును, మోక్షలోక బోధలు వినిపించుటకును, వారితో కలసి మెలసి యుండుటకును నరుడుగా జన్మించినావు. గనుక నీకనేక నమస్కారములు.


తండ్రీ! నీవీలోకములో నున్నప్పుడు, ఒకనాడొక పక్షవాత రోగిని చూచి నీ పాపములు క్షమింపబడినవని చెప్పి, మొట్టమొదట అతని పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రములు. తర్వాత అతడు తన జబ్బును గురించి ఏమియు చెప్పుకొనక ముందే అతనిని ఇంటికి వెళ్ళుమని చెప్పినావు. వెంటనే అతని జబ్బు బాగైనందున సంతోషముతో అతడు ఇంటికి వెళ్ళెను. కాబట్టి నీకనేక వందనములు. నా పాపములు కూడ క్షమించుము. నా జబ్బులు బాగుచేయుము. ఇట్లు చేయుదువని నేను నమ్ముచున్నాను.


మా కాలములోకూడ నీవు వేలకొలది ప్రజలను నీ ప్రభావమువల్ల బాగుచేయు చున్నావు. నీకనేక స్తుతులు. నా శరీరములోని జబ్బులు బాధలు నాకంటే నీకే బాగుగ తెలుసును. పాపులను, రోగులను జూచి నీవు జాలిపడుదువు. నమ్మినయెడల బాగుచేయుదువు.


తండ్రీ! నీవు పాపములను పరిహరించు వాడవు గనుక నీవు నా ఆత్మవైద్యుడవు. అల్లాగుననే నా శరీర జబ్బులు బాగుచేయువాడవు గనుక నా శరీర వైద్యుడవు. నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు కాబట్లి నిన్నే నా మనసులోను, బహిరంగములోను పూజింతును. ఎటువంట వ్యాధినైనను ఎంత దీర్ఘకాల వ్యాధియైనను సుళువుగా ఒక క్షణములో నీవు బాగుచేయగలవని నమ్ముచున్నాను. నీవే నా దేవుడవు. నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు నీ నా యొద్ద నిత్యము నివసింపగల సహవాసివి. అందుకే నన్ను నీ వశము చేసికొన్నాపు.


ఓ తండ్రీ! భూత పీడితులలోనున్న దయ్యములను వెళ్ళగొట్టుము. సంతానములేనివారికి సంతానము దయచేయుము. చిక్కులలోనున్నవారిని విడిపించుము. నీ సంగతులు లోకస్తులందరికి ప్రకటించుము. నాకు నీ బోధ తరచుగా వినిపించుము. దానివల్ల నాలో నమ్మిక కలిగించుము. ఆ నమ్మికనుబట్టి నీవు నాకు చేయదలచిన ఉపకారములు దయచేయుము. నా పాపములు వ్యాధులు, నిత్యశిక్ష పరిహరించుటకై నీ ప్రాణము ధారపోసిన ప్రభువా! నీనేక స్తోత్రములు. నేను నీయొద్దకు రావలసిన గడియలో మోక్షమునకు చేర్చుకోమ్ము. ఇట్లు నీవు నాలో కీర్తినొందుము అని మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్.