(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

విమోచన ప్రార్ధన



త్రియేక దేవుడవైన తండ్రీ! ఎన్ని కోట్ల మంది ఎన్ని మనవులు చేసినను నీవు సుళువుగా నెరవేర్చగలవు. గనుక నీకు స్తోత్రములు. ఈ కూటములో ఎన్నో కోట్లమంది లేరు. ఎన్నో కోట్ల మనవులు లేవు. కొద్దిమంది, కొన్ని ప్రార్ధనలు ఉన్నవి, ఇవి నెరవేర్చలేవా! నెరవేర్చెదవని నమ్మితే నెరవేర్చ గలవు. కొంతమంది యొక్క హృదయములో వారిని విడిచిపెట్టని పాపములు గలవు. ప్రార్ధిస్తున్నారు. వాటిని వదలించగలవు. నీకు స్తోత్రములు.


ఆత్మ స్తితి యీలాగుండగా, కొందరికి శరీరములో అనారోగ్యము గలదు. అది వారిని వదిలిపెట్టకుండ నున్నది. నీవు వదలింపగలవు. నీకు స్తోత్రములు. కొందరి విషయములలో కొదువలు గలవు. అవి వారిని వదలకుండా నున్నవి. కాని నీవు వదిలింపగలవు గనుక నీకు స్తోత్రములు. ఇక్కడున్న వారిలో కొందరికి సంతానము లేదనే విచారమున్నది. అది వారిని వదలకుండా నున్నది. నీవు వదిలించగలవు. నీకు స్తోత్రములు. మరికొందరిని కొన్ని విషయములలో దురాత్మ పీడించుచున్నది. నీవు వదిలింపగలవు నీకు స్తోత్రములు. కొందరిలో రకరకములైన చిక్కులున్నవి అవి వారిని వదిలిపెట్టడములేదు. నీవు వదిలింపగలవు. కాబట్టి నీకు స్తోత్రములు. కొందరిలో తమ స్వజనుల యొక్క కష్టముల నివారణ కొరకైన ప్రార్ధనలున్నవి. నెరవేరనివి ఉన్నవి. అవి వారిని వేదించుచున్నవి. అవి వారిని వదలడములేదు. నీవు వదిలింపగలవు. నీకు స్తోత్రములు.


కొందరిలో రక్షణను గురించియు, పెండ్లికుమార్తె వరుసను గురించియు, రాకడను గురించియు, అప్పుడప్పుడు సందేహములు వచ్చి ముందుకు సాగి వెళ్ళుచున్న వారిని వెనుకకు లాగుచున్నవి. ఆలాగడమును వారు తప్పించుకొనలేకపోవుచున్నారు నీవు తప్పించగలవు. గనుక నీకు స్తోత్రములు.


ఇప్పుడు ఉదహరించినవి కాక ఇతర కష్టములు గలవారు కూడ గలరు. తృప్తిలేనివారు, సమాధానము లేనివారు, శాంతిలేనివారు, నెమ్మది లేనివారు, ఏమి చేయవలెనో తోచనివారు, ఎంత చెప్పినను నచ్చని వారు మొదలగు వారిని గురించికూడ ప్రార్థించుచున్నాము. వారిలో నున్నవి విదిల్చివేసి శాంతి కలుగజేయగలవు. నీకు స్తోత్రములు. ఎవరైతే స్వస్థానమునకు వెళ్ళవలసి ఉన్నారో వారికి దూతయొక్క సహాయమును అనుగ్రహించి, సురక్షితముగా తీసికొని వెళ్ళుదువని నమ్ముచున్నాము, నీకు స్తోత్రములు. ఇక్కడ నేర్చుకొన్న విషయములు ఇతరులకు చెప్పి సంతోషింపజేయుమని త్వరగా రానున్న ప్రభువుద్వారా ఈ ప్రార్ధనలు ఆలకించుమని వేడుకొనుచున్నాము ఆమేన్.


ప్రార్ధన:- ఓ దయగల తండ్రీ! “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నపుడే నిన్ను గూర్చి నాకు తెలియును” అని నతనయేలుతో యోహాను 1:50లో అన్నట్లు మమ్ములను గురించి నీకు తెలియును. మా ప్రార్ధన నెరవేరక ముందే నీకు స్తుతులు. ఈ గొప్ప విశ్వాసము, ఈ గొప్ప సహవాసము మాకు అనుగ్రహింపుము. నిన్ను కలిగి ఉండే భాగ్యమే భాగ్యము. నిన్ను కలిగిఉండే స్థితే స్థితి. మేము పరలోకమునకు రాకముందే ఇక్కడ నీ స్ధితి కలిగివుండే భాగ్యము అనుగ్రహింపుము. నీవు నాకుండగా లోకములో ఏదియు నాకక్కరలేదని కీర్తన 73:25లో వ్రాయించిపెట్టినావు. ఎంత ఆశ్చర్యకరమైన అనుభవము. మేముకూడ అదే అనవలెను. నీవు మాకుండగా లోకములో ఏది మాకు లేకపోయినా ఉన్నట్టేనని బైబిలులో వ్రాయబడినది గాని ఆయన అక్కరలేదన్నాడు. ఎంత గొప్ప విశ్వాసము! ఎంత లోతైన మర్మము! ఎంత ఆశ్చర్యము. లోకములో నున్నాము. లోకములోనుండి ఏది అక్కరలేదంటాడు. ఎవరంటారు? అక్కరలేదంటే ఏమి తింటాము? ఏమి కొంటాము? ఏమీ అక్కరలేదు, ఎంత గొప్ప ఆశ్చర్యము! లోకములో నున్న ఐశ్వర్యమంతా చూడగా అంతా పెంటకుప్ప అన్నాడు పౌలు. ఎవరంటారు? పెంటకుప్ప అన్నాడు. అట్టి అనుభవము నాకుంటే ఎంత సంతోషము. లేదు, వినలేదు అంటాము. ఎవరైనా వచ్చి గదిలో ఎవరున్నారంటే యేసుప్రభువును, నేనును ఉన్నాము. పదిమంది ఉన్నా లేనట్లే.


అంతగొప్ప విశ్వాసము మాకు అనుగ్రహింపుము. నీవు మోషేతో “ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల దుఃఖములు నాకు తెలిసినవి” అని అన్నావు. ఇది బహువిచిత్రమైన వాక్యము. అది వారు విన్నప్పుడు వారికి ఎంత సంతోషము. ప్రభువా! నా జబ్బు తీసివేయి అని ఒకరు అంటే, నాకు తెలుసును అన్నావు. మోషేతో కాదు, ఈ గదిలోనున్న మాతో ఒకటి ఉండి ఒకటి లేకపోతే ఆ మాట చెప్పినట్లు చేయుము. అక్కరలేదంటే ఉన్నవి అనవలెను. నీ వాక్యప్రకారము “నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు” ప్రపంచములో అనేకమంది భక్తులు, (పరమ) విశ్వాసులు ఉన్నారు. అందులో ఎందరికి ఈ బైబిలు వాక్యము తెలుస్తుంది? నీ సర్వశక్తిని బట్టి భూలోకములో నున్న భక్తులందరు ఈ వాక్యము చదివితే ఈ అనుభవము మాకున్నదని చెప్పగలరు. మా అనుభవము అదే.


మా తండ్రీ! మా ప్రభువు మా ప్రార్ధన వినలేదు. ఇది లేదు అది లేదు అని నిన్ను నిందించే అరుపులు ఎందుకు? లోకము పట్టజాలని ధన్యత బుడ్డినిండా ఉన్నది. లోకము పట్టదు. లోకము ఈయనేరని సమాధానము నేను మీకిచ్చినాను. ఇది తండ్రీ! ఎంత గొప్ప వాక్యము!

నీకృపాకార్యములు జ్ఞాపకము తెచ్చుకొంటే మా ముఖము చిన్నపోయింది అని నీ వాక్యములో ఉన్నది. ఇంతగొప్ప పాపికి ఇంత గొప్ప భాగ్యమని చిన్న బుచ్చుకొన్నాడు. మేము తగము. ఎంత గొప్ప భాగ్యము. ఎంత గొప్ప ధన్యత. అయ్యా! మీ ప్రేమను మేము గ్రహింపజాలము. “ఎందుచేత యీ పాపిపై ఇంత ప్రేమ” మా ప్రభువా! స్థలాంతరము నుండి వచ్చినవారి హృదయములోనున్న కోరికలు నెరవేర్చి, నీ భక్తి, నీ ప్రేమ బయలుపర్చుము.


ఓ తండ్రీ! ఆయా జిల్లాలలో గల మాకు సంబంధించిన విశ్వాసులు. మేమందరము ఎప్పుడయినా కూడుకోగలిగితే ఎంత సంతోషము! మహిమ సంగతులే మాట్లాడుకొనగలము. మేము అందరిని సమకూర్చుకొనలేకపోవుచున్నాము. విశాల స్థలములో, ఇదివరకు మాట్లాడుకొన్నవన్ని మాట్లాడుకొనే సమయము దయచేయుము. అందరము కూడుకొనే సమయముగా నీ సమయము మా సమయముగా అనుగ్రహించుము ఆమేన్.