(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
ఆజ్ఞల ప్రార్ధన
- 1. ఓ క్షమాపణ కర్తవైన తండ్రీ! నేను అన్నిటికంటెను, అందరికంటెను ఎక్కువగా నిన్నే ప్రేమించి, నా మొదటి ప్రేమ నీకిచ్చునట్లు, నా స్వభావమును మార్చుము. ప్రభువా! నేను లోకములో నున్న వస్తువులకైనను, జీవరాసులకైనను, మానవులకైనను, సైతానుకైనను భయపడక, నేను ఎల్లప్పుడు నీకు మాత్రమే భయపడే కృప దయచేయుము.
- 2. ఓ ప్రభువా! నేను నీ నామమును వృధాచేయకుండా కాపాడి, నీ నామమును గౌరవించి, మహిమపర్చు బ్రతుకు నాకనుగ్రహించుము. ప్రభువా! నేను బైబిలు చదువటయందును, ప్రార్థించుట యందును, కీర్తనలు పాడుటయందును, గౌరవ బుద్ధితోను, భక్తితోను చేయగల కృవ నాకనుగ్రహించుము.
- 3. ఓ ప్రభువా! ఆరాధన దినమును గౌరవించవలసినదని నీవు సెలవిచ్చినావు. ఆ దినముననే అనేకులు విందులు చేసికొనుచు, లేనిపోని గొడవలు మాట్లాడుచున్నారు. ఊళ్ళు వెళ్ళుచున్నారు. బట్టలు కుట్టుచున్నారు. ఇల్లు అలుకుచున్నారు. నామకార్ధముగా ప్రార్థించుచున్నారు. పాటలు పాడు చున్నారు. ఆదివారమంటే తక్కిన రోజులుగానే భావించుచున్నారు. ఎంతో మంది పాస్టర్లు తమ ఇచ్చ నెరవేర్చుకొనే ప్రసంగాలు చేయుచున్నారు. ప్రభువా! అట్టివారిని క్షమించుము. కృప దయచేయుము. వారికి వర్తమానము దయచేయుము.
- 4. ఓ ప్రభువా! తల్లిదండ్రులను తన్నేవారు, దూషించేవారు, గౌరవించనివారు, సంపాదన ఎత్తుకొనిపోవువారు కలరు. అలాగే కొందరు రాజులను, కలెక్టరులను, పంచాయితీ వారిని ఎదిరించి, బహుఠీవిగా నడుతురు. అంతా వ్యతిరేకము. చాలామంది పంతుళ్ళను, మిషనరీ వారిని, రైల్వేవారిని, రైతులను ఎదిరింతురు. వారినందరిని క్షమించుము. దేవుని తరువాత గొప్పవారెవరనగా తల్లిదండ్రులు, ఆ తరువాత అధికారులు అని గ్రహించునట్లు చేయుచు, నిన్ను బట్టి వినయ విధేయతలు, ప్రేమ, గౌరవము చూపించి, నేను దీర్ఘాయుష్మంతుడుగా వర్ధిల్లునట్లు చేయుము.
- 5. ఓ ప్రభువా! కొందరు పగ ఉండి భార్యమీద అనుమానపడి, ఆమె తల నరుకుట, స్వంత బంధువులలో విరోధముండి చంపుట, కోప నరహంతకులు, అసూయ నరహంతకులు, స్వహత్య చేసికొనేవారు, జబ్బులు సహించలేక, భర్తపోరుపడలేక, అప్పులవారి బాధపడేక, నూతిలోనో, నదిలోనో పడి, నరహత్య చేసికొనుచున్నారు. ప్రభువా! నేను నా దుర్గుణముల ద్వారా నిన్నైనను, నీ స్వరూపమందు సృష్టించిన మానవునినైనను మనస్సు నొప్పించి ఆయాసవర్చక నీకును, లోకమునకు ఇష్టముగా బ్రతికే బ్రతుకు నాకనుగ్రహించుము. నా శరీరము నీకు ఆలయము గనుక నేను దానిని శుద్ధీకరించు విషయములోను, పోషించు విషయములోను తగిన జాగ్రత్త తీసికొనే జ్ఞాపకశక్తి దయచేయుము.
- 6. ఇది గొప్ప పాపము. నీచమైన పాపము, ఘోరమైన పాపము. మీ దృష్టిలో ఎంతోమంది యౌవనులు తమ జీవిత చరిత్రను పాడుచేసుకొంటున్నారు. ఎంతోమంది వ్యాధులు తెచ్చుకొని చనిపోవుచున్నారు. వివాహములు గల కుటుంబములు నాశనమగుచున్నవి. తల్లిదండ్రుల వ్యాధులు పిల్లలకు అంటుకొనుచున్నవి. ఇట్టి వారందరికి నీ కృప దయచేయుము. ఓ ప్రభువా! నేను నీవు జతపర్చిన భార్యభర్తలకు మధ్యగా వెళ్ళి వారి ఐక్యతను విడదీయకుండను, నీ చిత్తప్రకారము నూతనముగా జతపరచబడే వారిని విడదీయకుండను నన్ను జాగ్రత్తగా కాపాడుము.
- 7. ఓ దయగల తండ్రీ! నీవు "నా ప్రార్ధనలు వినుచున్నావు" అందుకు స్తోత్రములు. అనేకులు ప్రయాణికులను బాథ పెట్టుచున్నారు. స్త్రీల నగలు దోచుకుంటున్నారు. చేలలో పంట దొంగిలించుచున్నారు. తోటలలో ఫలములు దొంగిలించుచున్నారు. అందరు నిద్రపోవుచుండగా కన్నములు వేయుచున్నారు. సంతలలో, బజారులలో తక్కువ ఖరీదుగల వాటిని ఎక్కువ లాభమునకు అమ్ముచున్నారు. అట్టివారి నిమిత్తము వర్తకులందరి నిమిత్తము ప్రార్థించుచున్నాను. ఓ తండ్రీ! నేను నాది కాని ఇతురులదగు దేనినైనను టక్కరి వల్లనైనను, కుయుక్తి వల్లనైనను దొంగిలించకుండ నీవు నాకిచ్చిన సమస్తమును, సమయమును జాగ్రత్తగా వాడుకొనగల నేర్పు నాకు అనుగ్రహింపుము.
- 8. ఓ ప్రభువా! పరువు నష్టము తెచ్చేవారు, ఒకరి మంచిపేరు చెడకొట్టేవారు రహస్య సంగతులు బయటికి తెచ్చేవారు. ఒకరిమీద లేనిపోని చెడ్డనేరములు గొప్పవారు బుజువుపరచిన మాట్లాడక ఊరకుండుటయు, నా ఇరుగుపొరుగు వారిమీద అబద్ధసాక్ష్యము పలుకకుండ నా నోటిని భద్రపరుచుము. ఓ ప్రభువా! నేను సత్యముగా బ్రతుకుచు సత్యము కొరకు పోరాడుచు, చివరకు సత్యము కొరకే హతసాక్షులైన వారి జీవితము నాకు దయచేయుము.
- 9. దురాశ దుఃఖమునకు చేటు. పొరుగువానిది ఏమియు ఆశింప కూడదు. మాకున్న దానితోనే తృప్తిపొందవలయును. కొందరు ఏదిచూస్తే అది అడుగుదురు. మనస్సులోనైన ఆశించుదురు. ఇట్టి వాటికి నన్ను దూరపరచుము. నీవు నాకు అనుగ్రహించిన పవిత్రమైన మనస్సాక్షిని నా అపవిత్ర ప్రవర్తన ద్వారా అపవిత్రపరచి, నీవు ఏర్పరచిన ఉద్దేశ్యమునకు వ్యతిరిక్తముగా నడుచుచుండగా నీవు క్షమించి, శుద్ధిచేసి, క్రమపరచి, నీకు లోబడి గౌరవపరచు స్ధితి నా మనస్సాక్షికి దయచేయుము.
ఓ తండ్రీ! నేను ప్రార్థించవలసిన విషయములు అనేకములున్నవి. పసిపిల్లలు తమ తల్లులు బయటకు వెళ్ళితే, పొలములోనికి వెళ్ళితే వారు మంచము మీద నుండి, ఊయలలో నుండి పడి అపాయములకు లోనగుదురు. కొందరు మరణించుచుందురు. పసిపిల్లలను, యౌవనులను, వృద్ధులను కాపాడుము. వారు చెడ్డ అలవాటులలో పడకుండా విద్యాబుద్ధులను నేర్చుకొనునట్లు నీ కృప దయచేయుము. కూలీలను కాపాడుము. మిల్లులలో పనిచేయు వారిని, బొగ్గుగనులలో పనిచేయువారిని, యుద్ధములో పనిచేయువారిని, మేడలు, గోపురములు, సత్రములు కట్టేవారిని, భిక్షకులను, కుమ్మరిపని చేయువారిని, అడవిలో పనిచేయువారిని, పుస్తకములు వ్రాయువారిని, అచ్చు ఆఫీసులో పనిచేయు వారిని, వైద్యశాలలో పనిచేయువారిని, కార్ఖానాలలో పనిచేయువారిని మేడలు, గోపురములు, సత్రములు కట్టేవారిని, కుమ్మరిపని చేయువారిని దీవించుము.
దేశమునేలేవారు. ధర్మపాలనచేసే కృప దయచేయుము. వర్షముల వలన తడియువారు, భూకంపము వలన మరణించువారు, అడవి జంతువుల వలన చచ్చేవారు, అట్టి హానినుండి వారిని తప్పించుము. మనుష్యులందరికి సువార్త ప్రకటింపజేయుము. సువార్త అన్ని భాషలలోను, అందరికి వ్యాపింపజేయుమని యేసుప్రభువుద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్.