పరిశుద్ధాత్మ తండ్రికి స్తుతి
పరిశుద్ధాత్మవైన దేవా! నీవు దేవుడవు గనుక నీకు
వందనములు.
పరిశుద్ధాత్మవైన తండ్రీ! నీకనేక స్తుతులు. ఓ తండ్రీ! సృష్టికాలమందు నీవు సృష్టిని కాపాడుటకై
సృష్టిమీద ఉన్నట్లు నేను చదువుకొనుచున్నాను, నీకనేక స్తుతులు. కాపాడే తండ్రీ! నీ సృష్టిలో నేనును ఉన్నాను
గనుక నన్ను కాపాడే తండ్రీ! నీకు స్తుతులు ఆచరిస్తున్నాను.
కోడి తన రెక్కలక్రింద పిల్లలను దాచి కాపాడు రీతిగా
నీవు నన్ను సమస్త విధములైన కీడులనుండి కాపాడుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాను. నీవెంత దేవుడవైనను నాలో
నివసించుటకు పూనుకొనియున్నావు గనుక నీకు స్తుతులు చెల్లించుచున్నాను.
ఓ దయగల తండ్రీ! పైనుండి మనమీద ఆత్మ
కుమ్మరింపబడువరకు నగరి విడువబడును, జనసమూహముగల పట్టణము విడువబడును. కొండయు, కాపరుల గోపరమును ఎల్లప్పుడు
గుహలుగా నుండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండునని యెషయా గ్రంథములో నేను
చదువుకొనుచున్నాను.
ప్రభువా! నీ కుమ్మరింపు లేనియెడల నేను పాడైపోయిన భూమివలె ఉందునని ఈవాక్యములో
తెలిసికొనుచున్నాను.
ఓ తండ్రీ! నీ కుమ్మరింపు నాకు కలుగునని నేను
నిన్ను స్తుతించుచున్నాను.
పరిశుద్ధాత్మ తండ్రివైన తండ్రీ! పెంతెకొస్తు పండుగనాడు అందరు నీతో
నిండినవారైనారని చదువుకొన్నాను. నీకనేక స్తుతులు. నేనుకూడ నీతో నిండినవాడనై యుండగోరుచున్నాను. కృప
దయచేయుదువని నమ్మి స్తుతించుచున్నాను.
ఓ ఆత్మ తండ్రీ! గాలివంటి ధ్వని ఇల్లంతయు వ్యాపించిన రీతిగానే, నీవు నా
జీవితమంతయు వ్యాపించుమని ప్రార్థించుచు, అట్లు చేయుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాను. హృదయములో
వ్యాపించే తండ్రీ! నాలో వ్యాపించే తండ్రీ! పూర్వము ప్రవక్తలలోను, అపోస్తలులలోను ఉండి వారిచేత పని చేయించిన
ప్రకారముగా నాలోను, నాతోను వ్యాపించి నాచేత కూడ పని చేయించుమని ప్రార్ధించుచు నిన్ను స్తుతించుచున్నాను. నా
తలంపులలోను, మాటలలోను, చూపులలోను, వినికిలోను, ప్రయత్నములలోను, క్రియలలోను, ఆచారములలోను, సేవలోను,
కష్టకాలములోను, ఆనందకాలములోను, నా బ్రతుకు కాలమంతటిలోను నీవు వ్యాపించియుంటే నా ధన్యత ఏమని చెప్పను! నీకనేక
స్తుతులు.
నా ప్రియమైన తండ్రీ! నీవు నాలో లేకపోతే, ప్రభువు యేసు సంపాదించిన రక్షణభాగ్యము అందుకొనలేను.
అందుకొన్నను నిలుపుకొనలేను. నిలుపుకొన్ననూ పొందినది వాడుకొనలేను గనుక అందుకొని, నిలుపుకొని, వాడుకొనేటట్లు
నీవు సర్వములో వ్యాపించియుండుము. ఇది నా కోరిక, ఇది నా హక్కు ఈ నా విశ్వాసమును నెరవేరును తండ్రీ! నేను ఎంత
మంచితనము కలిగియున్నను దానిలో నీవు లేకపోతే దానికి జీవమేలేదు గనుక నాలో ఎప్పుడును చురుకుదనము
కలిగి పనిచేసే జీవముండునట్లు నీవు నాలో వ్యాపించియుండుము. ఈ నీ పని నిమిత్తమై నా
అంతరంగమంతటితోను నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్.