విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(31-35)
31. ప్రశ్న :- పరిశుద్ధాత్మ స్నానము పొందిన అపోస్తలులు, మొదలగువారు భూలోకభాషలు మాటలాడిరి. అయితే పౌలు 1కొరింధి. 14 అధ్యాయములో భాషలను గురించి వ్రాయుచున్నాడు అవి యే భాషలు?
జవాబు:-
- 1) దేవదూతలకు కూడ భాష ఉన్నదని కొరింథి. 13:1 వలన తెలియుచున్నది. ఇది పరలోకభాష.
- 2) భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాటలాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములు పలకుచున్నాడు అని 1కొరింథి. 14:2లో నున్న వ్రాతనుబట్టి చూడగా, పరలోకభాష ఉన్నట్టు తెలియుచున్నది.
- 3) పౌలు ఆత్మవశుడై పరదైసులోనికి వెళ్ళి, మనుష్యుడు పలుకగూడని మాటలు వినెను. ఇవి పరలోకభాషయొక్క మాటలు అని గ్రహించుకొనవచ్చును.
“క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యముగాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను. అది దేవునికే తెలియును. అట్టివానినిగూర్చి అతిశయింతును.
32. ప్రశ్న :- “కాబట్టి భాషలు విశ్వాసులకుకాదు, అవిశ్వాసులకే సూచకమైయున్నవి” అని 1కొరింథి. 14:22లో ఉన్నది. గనుక అవిశ్వాసులకే భాషలు. ఈ భాషలు వచ్చిన వారందరు అవిశ్వాసులనియెగదా అర్ధము?
జవాబు:- కాదు, అవిశ్వాసులకు భాషలు వచ్చునా? అదేమి వ్యాఖ్యానము! విశ్వాసులైనవారు తమ విశ్వాసమునుబట్టి భాషావరము సంపాదించుట అవిశ్వాసులు చూచి, తాముకూడ భాషను గడించుకొనగల విశ్వాసమును కలిగించుకొన యత్నింతురు. అట్లు విశ్వాసుల భాష స్థితి, అవిశ్వాసులకు పాఠము నేర్పించు నొక సాధనమగును. ఈ యర్థము యుక్తముగ తోచుటలేదా?
33. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మమును, భాషలతో మాటలాడుటయును, ఇన్నాళ్ళనుండి ఎక్కడ ఉన్నవి?
జవాబు:- ఇన్నాళ్ళనుండి ఇవి మీ చేతిలో నున్న బైబిలులోనే ఉన్నవి.
34. ప్రశ్న :- ఉంటే ఎవరు ఎందుకు బోధింపలేదు?
జవాబు:- బోధించినారు, జరిగిన కధ మాత్రమే బోధించినారు. మనకు కాదని అనుకొన్నందున పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంద యత్నించుడని బోధింపలేదు. నీళ్ళబాప్తిస్నమప్పుడె ఆత్మ బాప్తిస్మమును పొందినామని బోధించలేదు.
35. ప్రశ్న :- వారు ఊరుకొన్నట్టు మీరెందుకు ఊరుకొనరు?
జవాబు:- దేవుడిస్తానన్నది వద్దనడమెందుకు? ఇష్టముగా ఉన్నది గనుక అడిగి పొందుచున్నాము. మీరును పొందవలెనని కోరుచున్నాము గనుక బోధించుచున్నాము.