విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(61-65)
61. ప్రశ్న :- ఆత్మ కుమ్మరింపు అంటే పరిశుద్ధాత్మ మోక్ష లోకములోనుండి దిగివచ్చి మనమీద వాలునని ఎందుకు అనుకొనవలెను? ఆత్మ పని మనలో జరుగును అని అర్ధముగాని, పైనుండి వచ్చుననే అర్థమా?
జవాబు:-
- 1) ఆత్మ కుమ్మరింపువలన ఆత్మ పని జరుగును అనే అర్ధమున్నది. అది ముఖ్యమైన అర్ధమే. నీవు చెప్పినది సరేగాని; పైనుండి వచ్చెను అనుటలో తప్పేమున్నది?
- 2) పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు అని యెషయా వ్రాసెను. కుమ్మరింపు అనుమాటలో గూడ పైనుండి అను భావమున్నది గదా? దేవుని ఆత్మ పావురమువలె దిగెను అని మత్తయి వ్రాసెను (మత్తయి. 3:16) దిగుట అను మాటలో పైనుండి అనే అర్ధము లేదా? (మార్కు 1:10; అపో॥కార్య॥ 8:16) ఆకాశమునుండి అను మాటయు, ఆకాశము తెరువబడెను అనుమాటయును, దిగి వచ్చుట అనుమాటయును, పైనుండి అని అర్దమిచ్చుటలేదా? (లూకా. 3:21-22; అపో॥కార్య॥ 2:2).
62. ప్రశ్న :- చదువులేనివారికిని, పిల్లలకును ఆత్మ కుమ్మరింపు త్వరలో కలుగుచున్నది ఎందుచేత?
జవాబు:- వారు వెంటనే నమ్ముచున్నారు గనుకనే. వాక్యము వినగానే వారు నమ్ముదురేగాని ప్రశ్నలు వేయరు, తర్కము లోనికి దిగరు.
63. ప్రశ్న :- ఇప్పుడాత్మ బాప్తిస్మము పొందుచున్న వారిలో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు ఎందుచేత?
జవాబు:-
- 1) వారు వాక్యములోని సంగతి త్వరగా అంగీకరించుచున్నారు.
- 2) పొందవలెనని పట్టుదలగలిగి ప్రార్ధించుచున్నారు. సృష్టికాలమందు దురాత్మ ప్రేరేపణను అందుకొన్నది స్త్రీయేగదా! ఈ కాలమందు సంగతి తిరుగబడినది. పరిశుద్ధాత్మ కుమ్మరింపును స్త్రీ త్వరగా అందుకొనుచున్నది. ముందంజ వేయచున్నది. మరియొక సంగతి లోకములో ఏమి చూన్తున్నాము? కుమార్తెలే గదా తండ్రిని ఎక్కువ ప్రేమించుట పరలోకపు తండ్రినికూడ ఎక్కువగా ప్రేమించుటలో స్త్రీలే మొదట వస్తున్నారు.
64. ప్రశ్న :- "పరిశుద్ధాత్మ స్నానము పొందుడి" అని దేవుడు తన విశ్వాసులకెందుకు ఇప్పుడు చెప్పకూడదు? భిన్నబోధలు వినబడుచున్న మన కాలములో చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పడము?
జవాబు:-
- 1) వాక్యములోనే చెప్పినాడు గదా! ఇంకెందుకు?
- 2) ఎవరైనా పనిగట్టుకొని పట్టుదలతో అడిగిన తెలియజేయడా? ఏదోయొక రీతిగ తెలియజేయక మానడు. సందేహమెందుకు?
65. ప్రశ్న:- ఆత్మస్నానమొందినవారిలో లోపములున్నవి, ఇతరులు వారిని ఎట్లు అనుసరించగలరు?
జవాబు:- వారి లోపములను చూచి దేవునివాక్యమును నిరాకరించడము బాగా ఉన్నదా? మన మతభక్తి మనుష్యులమీద ఆధారపడియుండవలెనా? దేవుని వాక్యముమీద ఆధారపడి యుండవలెనా? “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని పౌలు 1కొరింథి 11:1లో వ్రాసెను. నిజమే! పౌలువలె ఇంత ధైర్యముగా చెప్పగల వారి మాదిరిని అనుసరించవలసినదెగాని క్రైస్తవునిలో లోపము కనబడినప్పుడు అనుసరింప వీలులేదు. అప్పుడు ఎఫెసీ. 5:1లో నున్నట్లు దేవుని పోలి నడుచుకొనవలెను. కావున "మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి".