విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(101-105)



101. ప్రశ్న :- అంత్యదినమందుగదా ఆత్మకుమ్మరింపు?

జవాబు:- అపో॥కార్య॥ 2:17లో ఉన్నది. అంత్యదినము గాదు గాని అంత్యదినములు.

102. ప్రశ్న :- అంత్యదినములంటే ఏమిటి? ఇప్పుడే అంత్యదినములలోనికి వచ్చివేసినామా ఏమి?

జవాబు:- ఒక కాలం అయిపోయేటప్పుడుండే రోజులు అంత్యదినములు. పాతనిబంధనకాలము అయిపోయి సంఘకాలం ఆరంభించేటప్పుడు ఉన్న పెంతెకొస్తు కాలము, ఆ కాలముయొక్క అంత్యదినములలోనిదే. అందుకే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట జరిగినది. (అపో॥కార్య॥ 2:17).

103. ప్రశ్న :- అలాగైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అయిపోయినదిగదా! ఇప్పుడు మరల ఎందుకు?

జవాబు:- అంత్యదినము అని ఉంటే అయిపోయినట్టు. అయితే అక్కడి ప్రవచనములో "అంత్యదినములు" అని ఉన్నది గనుక ఇంకా మరికొన్ని అంత్య దినములు ఉన్నవని అర్ధము. సంఘకాలము అయిపోయి రెండవ రాకడ వచ్చేటప్పుడు ఉండే దినములు మరొక అంత్యదినములు. గనుకనే దేవుడు మన కాలములో కోరేవారికి కుమ్మరింపు అనుగ్రహించుచున్నాడు.

104ప్రశ్న :- ఇప్పుడు అంత్యదినములు వచ్చివేసినవా?

జవాబు:- ఇది ఇందాక వేసిన ప్రశ్నే. అవును. వచ్చివేసినట్టు కుమ్మరింపు వార్తలనుబట్టి తెలుసుకొనగలము.

105. ప్రశ్న :- అబ్బో! ఇది మరీ భయంకరమైన మాట. క్రీస్తు రాకడ వచ్చివేస్తే లోకము ఉన్న పరిస్తితులనుబట్టి సిద్ధపడడం ఏలాగు?

జవాబు:- నమ్ముటవల్లనే, ఆత్మ పనిని అంగీకరించుట వల్లనే. ఈ పుస్తకములో ఉన్న ప్రార్ధన మెట్లు అనే పాఠము బాగా చదువుకొని, ఆ వరుసను ప్రార్ధన పెట్టుకొని, దేవుని అడిగిన యెడల ఆ కుమ్మరింపు కలుగును. రాకడకు సిద్ధపడుటయు గలుగును. పరిశుద్ధాత్మయే మనలను సిద్ధపరచువాడు. ప్రభువు పరలోకమునకు వెళ్ళేటప్పుడు, "పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పెను" గదా! ఆ తరువాత ప్రభువు- "మరలవచ్చి మిమ్ములను తీసికొని వెళ్ళుదును" అనికూడ చెప్పెను (యోహాను. 14:3). ఈలోగా విశ్వాసులను పరలోకమునకు, రెండవ రాకడకు సిద్ధముచేసే పని పరిశుద్ధాత్మ పనియేగదా! ఆయన చేసే పనులు (యోహాను 14:16-26; 16:8-16) లో ఉన్నవని చూపించితిని గదా! ఇంకా అనేకములున్నవని కూడ చెప్పితిని. పరిశుద్ధాత్మ మన హృదయములో సంచకరువుగ ఉండి మన పక్షముగా పనిచేయుచున్నాడు (2కొరింథి. 1:22) క్రీస్తు ప్రభువు దేవుని సింహాసనము నొద్ధ ఉత్తరవాదిగా ఉండి మన పక్షముగా పనిచేయుచున్నాడు (1యోహాను 2:1).