విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(146-150)



146. ప్రశ్న :- మీ కూటములు ఎట్లు ఏర్పడెనో వ్రాసిరి కారణమేమి?

జవాబు:- ఈ సమాజమును చూచి అనేకులు ఇదేమిటని అడుగుచున్నారు. ఇది పెంతెకొస్తునాడు ప్రేక్షకులు అడిగినట్లున్నది. ఈ బోధలు బైబిలులోనివే అని కొందరును; బైబిలులోనివైతే మాత్రం అవి పూర్వకాలమునకేనని మరి కొందరును; బైబిలులో ఉన్నను లేకపోయినను అవి మిషనెరీలు అభ్యసించినవి కావని ఇంకొందరును; ఇవి బాగానే ఉన్నవని కొందరును; ఇవి అబద్ధ ప్రవక్త బోధలు అని కొందరును; ఇవి ఏమిటో కడవరకు చూస్తేనేగాని ఏమియు చెప్పలేమని కొందరును; ఇవి పరీక్షింపవలసినవే అని కొందరును అవలంభించవలసినవే అని కొందరును చెప్పుకొనుచున్నారు. మొత్తముమీద మిషనంతటిలో కొంత ఆందోళనము కలిగినది. అందుచేత దీని ప్రారంభ చరిత్ర కొద్దిగ వ్రాయవలసి వచ్చింది.

147. ప్రశ్న :- ఈ బోధలు బైబిలులో యున్నమాట నిజమేగాని మనవారు ఇదివరకు అవలంభించలేదు. ఇప్పుడు విన్నందువల్లే కలహములు లేచునేమో, భేదాభేదములైన వివాదములు లేచునేమో గనుక మిషనెరీలు ఇవి బోధించడము మానివేసినట్లు, మనము కూడ మానివేస్తే మంచిది కాదా?

జవాబు:- బైబిలులో లేనిది, ఉపకారము కానిది బోధిస్తే మానివేయవలెను. గాని ఇది ఎందుకు మానవలయును? ఉపకారములు మానివేయవలయునని మాకు సలహా ఇవ్వడము ఏమాత్రము సబబుగలేదు. సువార్త ప్రకటించేటప్పుడు ఆటంకములు, వివాదములు, మనస్పర్ధలు, కలహములు రావడము లేదా! వచ్చినంత మాత్రమున సువార్త పని మానవలయునా? ఈ విషయముకూడ అట్టిదే. రక్షణ పొందినవారియొక్క ఆత్మ జీవనాభివృద్ధి నిమిత్త్రమైయున్న ఈ విషయములు గొప్ప ఉపకార విషయములు కావా! మేము మిషనులో పుట్టి, మిషనువల్లనే పోషణ పొంది, విద్యాభ్యాసము, ఉద్యోగము కలిగినవారమై ఉన్నందులకు కృతజ్ఞతగా ఈ ఉపకార విషయములు బోధించుచుండగా వీటిని బోధించకూడదని సలహా ఇచ్చుట బాగుగాయున్నదా? మేము పొందుచున్న ఈ బోధన మేళ్ళు మన మిషనువారందరును పొందవలెనని మేము కోరుట న్యాయముకాదా? ఒక్కసారి ఈ బోధలు మేము ఎవరికి బోధిస్తామో, వారికి తిరిగి మాటిమాటికి బోధించడము అవసరములేదని మాకు తోచుచున్నది. ఇవి నమ్మేవారు అవలంభిస్తారు. నమ్మనివారికి మేము నచ్చజెప్పగలమా? వారు ఈ మేళ్ళు పొందకపోతే తప్పువారిదే కాని మాదికాదు. మావంతు మేము నెరవేర్చినాము. వెల్లడి చేయవలసినదని దేవుడు మా యాత్మలకు తెలియపరచిన ఈ సద్విషయములు మేము దాచ తలంచుకొనలేదు. కాగితముమీద ఎక్కువ వివరించలేకపోవు చున్నాము. ఎవరైనను దగ్గరకు వచ్చి, నేర్చుకొనవలెనను ఉద్దేశముతో అడిగితే మరింత వివరముగా చెప్పగలము. ప్రస్తుతము కొంతపని జరుగు నిమిత్తము ఈ పుస్తకములో అన్ని సంగతులు కలిపి వ్రాయడమైనది. ప్రభువు సెలవైనప్పుడు ఒక్కొక్క సిద్దాంతము ఒక్కొక్క చిన్న పుస్తకముగా వ్రాయుటకు సిద్ధముగాయున్నాము.

148. ప్రశ్న :- మీ కూటస్థులు గంటల కొలది ప్రార్ధనలో గడుపుచున్నారు. ఇదేమియు బాగుగలేదు. ఆ సమయమె సువార్త ప్రకటనలో గడిపితే ఎంతోమంది అన్యులు ప్రభువుగూర్చి తెలిసికొందురు కదా?

జవాబు:- ఇదొక నేరమా మామీద! మా కూటస్థులు సంఘస్తులతో కలిసి సువార్త పనికి వెళ్ళడము లేదా? ఒక నెలలో మీరు ఎంతమంది అన్యులకు సువార్త ప్రకటించుచున్నారో పరీక్షించుకొనండి. మీరు ప్రకటిస్తున్న ప్రజలు సంఖ్యయును, కూటములో ఒకరు ప్రకటిస్తున్న ప్రజలు సంఖ్యను సరిపోల్చి చూచిన తర్వాత ఆ ప్రశ్నవేస్తే బాగా ఉంటుంది. మరియు గంటసేపు దైవసన్నిధిలో గడుపుటయందు మీరు కనిపెట్టిన యెడల దోషమేమి? వృధాగా సన్నిధిలో నుండడము కాదది. సన్నిధిలో ప్రార్థించుట, స్తుతించుట కనిపెట్టుట అనునవి యుండును గనుక మా కూటస్థులు సమయము సరిగానె వాడుకొంటున్నారు. గనుక మీరుకూడ ఆలాగే చేయవలెననునది నా సలహాయైయున్నది. ఎవరైన యుకమంచిపని చెడగొట్టొ మరియుక మంచిపని చేయట, భూనుట తగని కార్యమే గాని రెండు మంచికార్యములు చక్కబెట్టుకొనుట తగని కార్యములు కావు గదా

149. ప్రశ్న :- మీ కూటస్తులలో లోపములున్నప్పుడును, నేర్చుకొన్నవి, పొందినవి సరిగా వాడుకొనుటలేదని తెలిసియు నాయకులు గద్దించుటలేదని, దిద్దుబాటు చేయుటలేదని వింటున్నాము. ఇది నిజమా?

జవాబు:- మా మీదికివచ్చే నిందలలో ఇదొక నింద, కూటస్థులలో లోపములున్నపుడు నాయకులూరుకొందురా! బడిపిల్లలలో లోపములున్నప్పుడు, పంతుళ్ళును, సంఘస్థులలో నేరములున్నప్పుడు పాదుర్లును ఊరుకొందురా?

150. ప్రశ్న :- మీరడగిన ప్రశ్నలన్నిటికిని మేము జవాబు లిచ్చితిమి. చివరగా మీ అభిప్రాయమేమి?

జవాబు:- మీ జవాబులన్ని వినగా, నాకు చాల గందర గోళముగ నున్నది గనుక ఏమియు చెప్పలేను. నాకు మాత్రము ఇవి నిజమని పూర్తిగా తట్టడములేదు. ఇది అవసరమైనదైతే మిషనెరీలు బోధించియుండరా? అనే ప్రశ్న నాలో నున్నది. అందుచేతనే నేనేమియు తీర్మానము చేయలేను. అయినప్పటికిని ఆలోచిస్తాను.