పెంతెకొస్తు

Descent of the Holy Ghost



పరిశుద్ధాత్మను గురించిన కీర్తనలు



ఆంధ్రక్రైస్తవ కీర్తనల పుస్తకములోని (...... 251) కీర్తనలు పాడవలెను. తెలుగు క్రైస్తవ కీర్తనలలోని 9వ కీర్తననను మనో నిదానముతో పాడవలెను.


పెంతెకొస్తు స్తుతులు

పరిశుద్ధాత్మ యొక్కకుమ్మరింపు పరిశుద్ధాత్మ బాప్తిస్మ ప్రార్ధన స్తుతి త్రియేక దేవుని స్తుతులు


1. తండ్రికి స్తుతి

దయాస్వరూపుడవైన తండ్రీ! నీతిమంతుడవైన తండ్రీ! సత్యవంతుడవైన తండ్రీ! తండ్రీ అను పేరుమీద ప్రసిద్ధికెక్కుచున్న తండ్రీ! నీకు అనేక స్తోత్రములు. నాహృదయమంతటితో నిన్ను స్తుతించుచున్నాను.

నాకున్న విశ్వాసముతో, శక్తితో, జ్ఞానముతో, నిన్ను స్తుతించుచున్నాను.

నేను నిన్ను స్తుతించుటకు యోగ్యుడను కాను. భూమిమీద నిన్ను బాగుగా స్తుతించే విశ్వాసులును, అంతకంటె ఎక్కువగా పరలోకములో స్తుతించే పరిశుద్దులును, దేవలోకములో ఇంకా బాగుగా స్తుతించే దేవదూతలును ఉండగా, నిన్ను స్తుతించుటకు నేను ఏపాటివాడను! నా స్తుతి ఏపాటిది! అయినప్పటికిని నిన్ను స్తుతించవలెనని నీ వాక్యములో ఉన్నది గనుక స్తుతించుచున్నాను.

నీ కుమారునిబట్టి నీవు నాకు ప్రత్యేకమైన రీతిగా నా తండ్రివైయున్నావు గనుక నిన్ను స్తుతించుచున్నాను.

నీవల్ల ఉపకారములు పొందినాను గనుక నిన్ను స్తుతించుచున్నాను.

నీవు నన్ను కలుగజేసిన తండ్రివి గనుక నిన్ను స్తుతించుచున్నాను.

నిన్ను స్తుతించుటకు నేను బుణస్థుడనైయున్నాను గనుక స్తుతించు చున్నాను. స్తుతులు పొందుటకు నీవు ఒక్కడవే పాత్రుడవు గనుక నిన్ను స్తుతించుచున్నాను.

సమస్తమును నాకు ఇచ్చే నిమిత్తమై నన్నును, సమస్తమును కలుగజేసిన తండ్రీ నీకు స్తోత్రము. నాకు వాక్యమిచ్చిన తండ్రీ నీకు స్తోత్రము. ఓ దానకర్తవైన తండ్రీ, సమస్తమునిచ్చే తండ్రీ నీకు స్తోత్రములు. నీకెన్ని స్తుతులు అర్పించినను నీ బుణము తీరదు, నాకు సంతుష్టి గలుగదు. ఎందుకంటే నా స్తుతులకంటే నీ ఉపకారములే ఎక్కువ. నీవే ఎక్కువ. ఇదివరకే అన్ని ఇచ్చియుండుట మాత్రమేకాక ఇకమీదట అన్ని ఇచ్చే తండ్రివి. గనుక స్తోత్రము.

మహిమాస్వరూపుడవైన తండ్రీ! నాకు ఇవ్వడములో నీ మహిమ బయలుపడినది, నీ ప్రేమ వెల్లడియైనది. ఆహా తండ్రీ! నీకనేక స్తోత్రములు. సర్వజనుల మీద నీ యాత్మను కుమ్మరిస్తాను అను మహాద్భుతమైన వాగ్దానము యోవేలుచేత నాకు అందించినావు. సర్వజనులలో ఈ పాపి కూడ ఉన్నాడు. నీయాత్మను నామీద కుమ్మరించుమని నీ వాగ్ధానమును బట్టి నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. నీవు ఆడితప్పనివాడవు, పక్షపాతము లేనివాడవు. గాన నీవు నాకుకూడ ఇస్తావు. అన్ని ఇచ్చే తండ్రీ నీ ఆత్మనుకూడ నాకు ఇచ్చేవాడవై యున్నావు. గనుక నీకు స్తోత్రము. ఆమేన్.

2. కుమారుడగు తండ్రికి

స్తుతి యేసుక్రీస్తు ప్రభువా! నీవు పరిశుద్ధాత్మతోను, అగ్నితోను బాప్తిస్మము ఇస్తానని నీ రాయబారియైన యోహానుద్వారా సెలవిచ్చినావు గనుక నీకు అనేక వందనములు.

“పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను ననుగ్రహించును” అని సెలవిచ్చిన రక్షకా! నీకు అనేక వందనములు.

యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చెనుగాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని నీ శిష్యులకు నిశ్చయముగా చెప్పిన యేసుప్రభువా! నీకనేక వందనములు.

తుదకు నీ శిష్యులకు ఒకనాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చిన స్నానకర్తవైన యేసుప్రభువా! నీకనేక వందనములు.

నాకు కూడ పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇస్తావు గనుక నీకు వందనములాచరిస్తున్నాను. ఓ రక్షకా! సర్వలోక రక్షకా! నాప్రియ రక్షకా! నీకు నా కృతజ్ఞతగల వందనములు.

నీ ప్రాణమిచ్చిన రక్షకా! నీకు లెక్కకు మించిన వందనములు.

నీ ఆది శిష్యులకు మాత్రమేకాక, ఈ కాలపు శిష్యులకుకూడ నీ ఆత్మ బాప్తిస్మమిచ్చినందులకు నీకనేక వందనములు.

తండ్రియొక్క ప్రేమను బైలుపరచిన ప్రభువా నీకనేక వందనములు.

తండ్రియొక్క ప్రేమను బైలుపరచిన ప్రభువా నీకనేక వందనములు.

ఓ ప్రాణ రక్షకా! తండ్రియును, నీవును, ఆత్మయును నాలో ఉన్నారని నమ్ముచున్నాను, గాని నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మ మిచ్చుటవలన నాకు ప్రత్యేకమైన రీతిగా నీ ఆత్మ నింపుదల, నివాసము అనుగ్రహించుటయైయున్నదని నేను గ్రహించుచున్నాను. గనుక నీకు అనేక వందనములు.

"వారు మిమ్మును అప్పగించునప్పుడు ఎలాగు మాట్లాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి మీలోనుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు, పరిశుద్ధాత్మ" అని శిష్యులకు సెలవిచ్చిన నీకు వందనములు.

పరిశుద్ధాత్మను హృదయము లోపల కలిగియుండుటచేత ఎంత ధైర్యవంతుల మగుదుమో, ఎంత వాక్చాతుర్యము గలవారమగుదుమో ఈ మాటవల్ల తెలియపరచినందుకు నీకు అనేక వందనములు.

సువార్త బోధించే సేవకులను అపాయములోనికి వెళ్ళుడని చెప్పి, ఉపాయము నేర్పకుండ ఉండే రక్షకుడవు కావు. ఓ ప్రభువైన యేసూ! మాకు బదులుగ నీవు ఉండుటచే నీవు నీళ్ళ బాప్తిస్మముకూడ పొంది, ఈ రెండు విషయములలో మాకు మాదిరి చూపినందుకు నీకనేక వందనములు.

ఆత్మస్నానము పొందిన వెంటనే శోధింపబడుటకు నీవు ఆత్మచేతనే నడిపించబడినట్లు నీ చరిత్రలో చూచుచున్నాము. నీవు జయించినావు గనుక నీ జయమే మా జయము. ఓ జయశాలివైన రక్షకా! మేముకూడ ఆత్మబాప్తిస్మము పొందిన తరువాత ఆత్మచేత నడిపించబడి, సాతానుచే శోధింపబడుదుము. అప్పుడు నీ జయమును పొందుదుమని తెలిసికొని నీకు వందనములు అర్పించుచున్నాము.

నేను తండ్రిని వేడుకొందుననియు, మీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియైన ఆత్మను అనుగ్రహించుననియు నీవు నీ శిష్యులకు పరిశుద్ధాత్మ తండ్రి రాకను గూర్చి తెలియజేసినందుకు చాల వందనములు.

ఈ నీ ప్రవచనము నాలోకూడ నెరవేర్తువని నమ్మి వందనములు చెప్పుచున్నాను.

ఓ యేసుప్రభువా! ఇంకొకమాట కూడ సెలవిచ్చినావు. మీరు ఆయనను ఎరుగుదురు అని చెప్పినావు. అవును తండ్రీ, మేము నీటి బాప్తిస్మము పొందినప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామమందు మామీద నీళ్ళుపడినప్పుడే, ఆయన మాలోనికి వచ్చినారు. మరియు ఆయనను గురించి నీ వాక్యబోధవల్ల విన్నాము. మాకు పూర్తిగ తెలియకపోయినను, కొద్దిగానైనను ఆయనను ఎరుగుదుము అని ఒప్పుకొనుచున్నాను. నీకనేక వందనములు.

ఆయనను నేను ఇప్పుడు ఎరిగియున్న దానికంటె ఇంకా ఎక్కువగా ఎరిగియుండే నిమిత్తమై ఆయన కుమ్మరింపు దయచేస్తావని నమ్మి వందనములు చేయుచున్నాను.

మరియు లోకరక్షకా! ఆయన మీతోకూడ నివసించును అని వాక్కిచ్చినావు. ఓహో! ఇదెంత గొప్ప భాగ్యము! ఇదెంత ఐశ్వర్యము! స్నేహితులు మా దగ్గరయుంటేనే ఎంతో ఆనందముగదా? ఆయనే మాతో యుంటే ఇంకా ఎంత ఆనందమో, ఏమని వర్ణించగలను. రక్షణకర్తవైన తండ్రీ! యీ భాగ్యము కలిగేటట్లు నీయాత్మ కుమ్మరింపు సిద్ధింపజేతువని నమ్మి నిన్ను వందించుచున్నాను.

"ఆయన మీలో ఉండును" అనికూడ మాట ఇచ్చియున్నావు. ఇది మరింత గొప్ప భాగ్యము. ఏమి చెప్పవలెనో నాకు తోచడములేదు. విమోచన తండ్రీ! ఆయన నాలో ఉండేటట్లు కుమ్మరిస్తావా? ఆహా! నేనెంత ధన్యుడను! నా ధన్యత ఏమని చెప్పను! నా కృతజ్ఞత ఏలాగు వెల్లడించవలెనో నాకు తోచదములేదు. పరిశుద్ధాత్మ దేవుడు పాపినైన నాలోనా ఉండడము! ఏమి వింత! ఎంత గొప్ప అద్భుతము! ఎంత విచిత్రమైన కథ! ఇది ఏలాగో గ్రహించలేను. నేను ఉండగానే ఆయనకూడ నాలో ఉండడమేలాగో తెలియదు. అయినను ఆయన నాలో ఉండడము నిజమేనని నమ్ముచున్నాను, నీకు వందనములు సమర్పించు కొనుచున్నాను.

ఆయన నాలో ఉండడమనే తలంపు ఎంత సంతోషకరమైనది! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనే త్రియేక దేవుడు నాలో ఉండడము ఎంత మనోహరమైన సంగతి! ఎంత వినోదము! ఇది నాకైతే అసాధ్యము కాని నీకైతే సాధ్యము గనుక నీకు లెక్క పెట్టుటకు వీలుకానన్ని వందనములు.

“నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని” వినిపించినావు వందనములు! వందనములు! వందనములు.

ఆదరణకర్త అనగా నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయునని నా ప్రాణరక్షకా! నీవు బోధించినావు, నీకు అనేక నమస్మార వందనములు.

ఆయన నాలో ఉండి, నీ సంగతులు జ్ఞాపకముచేసి బోధించేటందుకు, ఆయనను నాపై కుమ్మరిస్తావని విశ్వసించుచు, ప్రాణకర్తా! నిన్ను వందించుచున్నాను. ఆయన మాకు సమస్తము బోధించెదరని పలికినావు. ఆ సమస్తము నాకాయన బోధించేటపుడు నా మనస్సు ఎంతగా ఆనందించునో! ఎంతగా మురియునో! జీవ రక్షకా! నీకు ఎన్నో వందనములు.

తండ్రియొద్ద నుండి బైలుదేరే సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నిన్నుగూర్చి సాక్ష్యమిచ్చునని ఓ సత్యరక్షకా నీవు సెలవిచ్చియున్నావు. పరిశుద్ధాత్మ తండ్రిని గురించి నీవు సెలవిచ్చిన మాటలు ఒకదాని కంటె ఒకటి ఆశ్చర్యముగానున్నవి. ఒకదానిలోనున్న సంగతికంటే ఇంకొక దానిలో ఎక్కువ సంగతి ఉన్నది. ఆయనను గురించి నీవు వర్ణిస్తు వచ్చిన ఈ వర్ణన మాటలు నేను తలంచుకొనుచున్న కొలది నాకు ఎక్కువ నోరూరుచున్నది. తప్పకుండ ఆయన బాప్తిస్మము నాకు ప్రసాదిస్తావని ధృఢముగా నమ్ముచున్నాను. ఓ పూర్ణ రక్షకా! ఎంతో ఎక్కువగా నిన్ను వందించుచున్నాను.

నీవు చెప్పిన ఆ ఆదరణకర్త! ఆ సత్యస్వరూపి! ఆ నా నివాసి! ఆ నాలోని నివాసి! ఆ పరిశుద్ధాత్మ ఎంత వర్ణనగలవాడో ఏలాగు ఊహించగలను? నేను వెళ్ళినయెడల ఆయనను మీ మీదకు పంపుదును అని అన్నావు. సర్వజనరక్షకా! నీవు వెళ్ళనూ వెళ్ళినావు; ఆయనను మొదటి శిష్యులలోనికి పంపనూ పంపినావు. నీకు ఆగని వందనములు.

ఆయనను నాయొద్దకు పంపుదువని ఎంతో నమ్ముచున్నాను. ఎంతో వందించుచున్నాను. ఆయన వచ్చి లోకము తన పాపము ఒప్పుకొనేటట్టు, చేయును అని తెలియపరచినావు. ఓహో పాపపరిహార రక్షకా! అది ఎప్పుడు జరుగును? నీ సంఘము తన పాపమును ఒప్పుకొన్నట్లు లోకముకూడా తన పాపమును ఎప్పుడు ఒప్పుకొనునో ఆ దినము ఎంత శాంతిగల దినముగా నుండునో! ఎంత ప్రభావముగల దినముగా నుండునో! ఎంత మార్పుగల దినముగా నుండునో! ఎంత అనుమతిగల దినముగా నుండునో! ఆ దినము కోసరము నేను కనిపెట్టుచున్నాను. లోకములో లెక్కకు ఒక్కరు మాత్రమే తన పాపములు ఒప్పుకొన్నప్పుడు పరలోకములో ఎంతో సంతోషము కలుగును కదా! ఆ దినమున లోకమంతయు తన పాపమును ఒప్పుకొంటే అది ఎంత అద్భుతముగా నుండును! అట్టి మార్పును కలిగించే పరిశుద్ధాత్మను నాలో కుమ్మరించి తీరుదువని పూర్తిగా నమ్ముచున్నాను, నిన్ను వందించుచున్నాను.

నిన్ను ఒప్పుకొనక పోవడమే లోకము చేయుచున్న మహా గొప్ప పాతకము అని నాకు తోచుచున్నది. తక్కిన పాపములతోపాటు లోకము ఈ పాపమును కూడ ఒప్పుకొనునని నేను గ్రహించుచున్నాను.

ఓ యేసు తండ్రీ! అట్టి పనిచేసే పరిశుద్ధాత్మను నాయొద్దకు ప్రత్యేకమైన రీతిగా పంపిస్తావని నమ్ముచు నిన్ను వందించుచున్నాను. ఆయన నీతినిగూర్చి లోకమును ఒప్పుకొనేటట్లు చేయుననికూడ సెలవిచ్చినావు. ఓహో! యేసురాజా! ఇదెంత గొప్పమార్చు! ఇప్పుడైతే లోకము చేస్తున్న క్రియలు స్వనీతిమీద ఆనుకొనియున్నవి. నీవు సంపాదించి పెట్టిన నీతిని లోకము అంగీకరించడములేదు. అప్పుడైతే నీ నీతి ఎంత ప్రశస్తమైనదో లోకము తెలిసికొనును. ఈ సంగతి మాకు తెల్పిన నీకు వందనములు.

స్వంత క్రియలవల్ల, ఆచారములవల్ల, స్వంత ప్రయత్నములవల్ల, ఏ మాత్రము రక్షణలేదు గాని నీవు చేసిన క్రియల వల్లనే రక్షణ అని ఆ దినమందు లోకము తెలిసికొనును గదా! ప్రభువా! అట్టి వింత మార్పు కలిగించే పరిశుద్ధాత్మను నాలోనికి పంపిస్తావని తెలిసి నీకు వందనములు పలుకుచున్నాను.

ఆయన తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయునని సెలవిచ్చినావు. ఓ క్రీస్తురాజా! ఈ మార్చు నిమిత్తమైకూడ నేనానందించుచున్నాను. దేవుడు అన్యాయస్థుడనియు; తప్పుచేసిన వారిని శిక్షించక తప్పు చేయనివారినే శిక్షించుననియు; ఆయన తీర్పు న్యాయము కాదనియు లోకమిప్పుడు తలంచుచున్నది. అయితే, ఆ దినమున లోకము దేవునితీర్పు న్యాయమైనదని గ్రహించగలదు. ఇట్టి గ్రహింపు కలుగుటకు పరిశుద్ధాత్మ పనియే కారణమని కనబడు చున్నది. అట్టి పరిశుద్ధాత్మను నాలో కుమ్మరిస్తావని నిరీక్షించుచూ, నీకు వందనములని అనుచున్నాను. ఇట్లనుట నీకెంతో ఇష్టము. ఓ ప్రభువా! ఓ దేవా! లోకము నిన్ను నమ్మడములేదు. ఎందుకంటే వారిలో పాపమున్నది. పరిశుద్ధాత్మ తండ్రి వచ్చినప్పుడు పాపమనగా ఏమిటో లోకమునకు తెలుస్తుంది. గనుక ఎంతో సంతోషము. నీవు విశ్వాసులకు కనబడకపోయినను, నీవు సంపాదించిన నీతి వారికున్నది. గనుక వారు ధైర్యముగానుందురు. అందుచేత వందనములు.

ఇట్టి ధైర్యము పరిశుద్ధాత్మవల్ల కలుగును. నీతి గడించిన యేసు పరలోకమునకు వెళ్ళిపోయినాడని విశ్వాసులు అనుకొని అధైర్యపడకుండా నీ పరిశుద్ధాత్మ వారిని మమ్ములను ధైర్యపరచునని గ్రహించు చున్నాను, కనబడని నీవును, నా కొరకు నీవు గడించిన నీతియును నాకు కలిగియున్న సంగతి; పరిశుద్ధాత్మవల్ల నాకు తెలియగలదని తలంచుచున్నాను. అట్టి పరిశుద్ధాత్మను కుమ్మరింతువని వందనములు ఆచరించుచున్నాను.

లోకమును పాపములోనికి నడిపించిన అపవాదికి ఇదివరకే తీర్పు అయిపోయినదని నీవు సెలవిచ్చినావు. తీర్పు పొందిన వాడు నాకు హాని చేయడని, తెలిసికొనుచున్నాను నీకు వందనములు.

నా నిమిత్తమై తీర్పు అనుభవించిన తండ్రీ! క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదని నీవాక్య గ్రంథమందు నీవు చెప్పుచున్న మాట నేను నమ్ముచున్నాను. నాకు నిత్యమైన తీర్పు, శాశ్వతశిక్ష లేదని నేను ఆనందించుచు నమ్ముచున్నాను! ఇట్టి మార్పు కలిగించే పరిశుద్ధాత్మను నాలో కుమ్మరిస్తావని వందించుచున్నాను.

ఓ రక్షణాధికారివైన యేసుప్రభువా! పరిశుద్ధాత్మ తండ్రి పనినిగూర్చి చెప్పిన మరికొన్ని మాటలు నాహృదయ బలము నిమిత్తమై తలంచు కొనుచున్నాను. నేను మీతో చెప్పవలసినవి ఇంక అనేక సంగతులును కలవుగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, మీరు సత్యమంతయు గ్రహించునట్లు ఆయన మిమ్మును నడిపించును. “ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్ని నావి అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని” తెలియపరచినావు గనుక నీకు వందనములు.

ఈ గొప్ప పని నా విషయములో జరిగేటట్లు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తావని ఎదురుచూస్తూ నీకు వందనములు చేయుచున్నాను.

నేను సత్యమంతయు గ్రహించేటట్లు ఆయన నడిపించుననే సంగతి వినుటయు, సంభవింపబోవు సంగతులను తెలియజేయునని వినుటయు, ఆయన నిన్ను మహిమపరచును అనే సంగతి వినుటయు నాకెంతో ముచ్చటగా నున్నది! ఎంతో కుతూహలముగా నున్నది, ఎప్పుడు! ఎప్పుడు! ఇవన్ని జరుగునని యున్నది! నీకే వందనములు.

నా జీవిత దినములన్నిట నీకే వందనములు.

నీవు ఆత్మను కుమ్మరిస్తావనే నిరీక్షణ ఆనంద విశ్వాసము నాకు కలిగియున్నది. గనుక నీకు వందనములు. ఆమేన్.


3. పరిశుద్ధాత్మ తండ్రికి స్తుతి