విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(106-110)
106. ప్రశ్న :- నేను స్నానం పొందినప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందలేదా?
జవాబు:- లేదు. బాప్తిస్మము ఇవ్వవలసినది అని ప్రభువు చెప్పిన మాటలలో పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి ఏమియు లేదు. నీవు పొందినది త్రియేక దేవుని నామమున నీళ్ళతో ఇవ్వబడిన పరిశుద్ధ బాప్తిస్మము. దానికి "పరిశుద్ధాత్మ బాప్తిస్మము" అనే పేరు లేదు. అది పాదిరిగారు ఇచ్చే బాప్తిస్మము. ఇది క్రీస్తు ప్రభువిచ్చే బాప్తిస్మము. ఈ రెండును బాప్తిస్మములే గనుక ఈ బేధము తెలుసుకొనేటందుకు దానిని నీళ్ళ బాప్తిస్మమంటూయున్నాము. దీనిని పరిశుద్ధాత్మ బాప్తిస్మమంటున్నాము. రెండును పొందవలసినదే. నీళ్ళ బాప్తిస్మము, విశ్వాసమూలముగా రక్షణ పొందుచున్నామనుటకు ఇయ్యబడును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, రక్షణ పొందినవారు ఆత్మ జీవనములో వృద్ధి పొందుటకు ఇయ్యబడును. నీటి బాప్తిస్మము ద్వారా సంఘములో ప్రవేశించే సంగతి గలదు. ఆత్మ బాప్తిస్మము ద్వారా సేవచేసి క్రీస్తునుగూర్చి సాక్ష్యమిచ్చే సంగతి గలదు.
107. ప్రశ్న :- ఆత్మస్నానము పొందనివారు సాక్ష్యమిచ్చుట లేదా?
జవాబు:- ఇచ్చుచున్నారు. అయితే, ఈ స్నానము పొందినవారు ఇచ్చే సాక్ష్యము మరింత బలముగా ఉంటుంది. అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యమువంటి సాక్ష్యము ఇతరులు ఇవ్వలేరుగదా? పెంతెకొస్తుకు ముందు తమ బోధవల్ల వారిచ్చిన సాక్ష్యము గొప్పదే. అయితే, పెంతెకొస్తు తరువాత వారిచ్చిన సాక్ష్యము అంతకంటే గొప్పది.
108. ప్రశ్న :- మన సాక్ష్యమునకు వారి సాక్ష్యమునకు భేదమేమి?
జవాబు:- వారు ప్రభువును చూచినట్లు సాక్ష్యమిచ్చిరి (యోహాను 1:2) మనము అట్టి సాక్ష్యమివ్వలేము.
109. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవారు అట్టి సాక్ష్యమివ్వగలరా?
జవాబు:- సందేహములేకుండా ఇవ్వగలరు.
110. ప్రశ్న :- ఎట్లు?
జవాబు:- ఆత్మస్నానము పొందుదురనే ప్రవచనములోనే దర్శనములు కలుగుననే మాటకూడ ఉన్నట్లు చదివినారుగదా! అట్టి దర్శనములో వారు క్రీస్తు ప్రభువును చూస్తున్నారు. గనుక అన్యులు ప్రశ్నించేటప్పుడు చూచినామని చెప్పగలరు. చెప్పు! క్రీస్తు చెప్పు మాటలు వింటున్నారు గనుక ఆయన స్వరము విన్నామని సాక్ష్యమియ్యగలరు. సాక్ష్యమిచ్చే శక్తి పరిశుద్ధాత్మ వల్ల కలుగును. అపోస్తలులు అదివరకు సాక్ష్యమిచ్చిరి. గాని పరిశుద్ధాత్మ స్నానము పొందినప్పుడు, వారిచ్చిన సాక్ష్యము మరింత బలముగా ఉండేటందుకు “శక్తి” కలిగినది. (అపో॥కార్య॥ 1:8 2:4).