విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(56-60)
56. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవారు ఏల పాపములో మరల పడిపోవుచున్నారు?
జవాబు:-
- 1) పడకూడదు, ఎక్కడైనా, ఎవరైనా పడినట్టుంటే దానికి ఏమి చెప్పగలము? అంతమాత్రమున అతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుట అనేది నిజము కాదా ఏమి? (హెబ్రీ. 6:4-6) (లూకా. 12:10) చదివి చూడుము.
- 2) నాలుగు రకముల నేలలలో పడిన వడ్లగింజ ఒక్కటేకదా? నాలుగవ స్థలములో మంచి ఫలితము కలిగినదికాని మూడు స్థలములలో కలిగిన స్వల్ప ఫలితము నశించిపోయినది. అట్లు నశించిపోయినంత మాత్రమున ఆ మూడు స్థలములలో విత్తనము పడడమనేదియును, కొద్దిగా మొలవడమనేదియును నిజము కాకపోవునా? విత్తనము పడడమును, అది కొద్దిగా మొలవడమును పిశాచి పని క్రింద లెక్కపెట్టుదురా? ఆగిపోవడము నశించిపోవడము పిశాచి పనిక్రింద లెక్కపెట్టండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందడము, భాషలతో మాటలాడడము పిశాచి పనులా? పొందినవారిని నిరుత్సాహ పరచడము, హేళన చేయడము : ఇవి పిశాచి పనులా? దేవుని వాక్యములో స్పష్టముగా వ్రాసియున్న సంగతి ఒప్పుకొనక పోవడము, దాని ఫలితములు గ్రహించక పోవడము, దుర్వార్తలు కల్పనచేయడము ఇవి ఎవరి పనులు?
- 3) నీళ్ళబాప్తిస్మము పొందినవారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా? వారేల పడిపోవుచున్నారు? తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొన వలయును (కొరింథి. 10:12).
57. ప్రశ్న :- ప్రవర్తన ముఖ్యము కాదా?
జవాబు:- ఎందుకు ముఖ్యము కాదు? అన్యులు బైబిలు చదువరు.
- ఎ) క్రైస్తవుల ప్రవర్తనను చూతురు. ఇది బాగా ఉంటే బైబిలు మంచి గ్రంథమని వారు తెలుసుకొందురు. అయినను మనము ఇతరుల ప్రవర్తనమీద ఆనుకొనక, వాక్యములో ఉన్న సంగతిమీద ఆనుకొనవలెను. ప్రవర్తన సరిగా లేదని చెప్పి బైబిలును కొట్టివేయ వలెనా?
- బి) భక్తుల అనుభవములో భేదముండవచ్చును.
- సి) క్రైస్తవుల వృత్తాంతమును గూర్చిన వదంతిలో నిజము ఉండక పోవచ్చును.
- డి) ప్రవర్తనను స్వయముగా చూచినవారు అర్ధము చేసికొనుటలో తప్పులుండవచ్చును.
- ఇ) కొందరు భక్తిగా నడుచుకొన్నప్పటికిని, అనేక కష్టముల పాలు కావచ్చును.
- ఎఫ్) ప్రవర్తనను చూడక వాక్యమునుచూచి, ఆ వాక్యము యెడలగల తమ స్వాఖిప్రాయము కొందరు వెల్లడింతురు. ఆ అభిప్రాయములో భేదములుండవచ్చును.
58. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందనివారికి అద్భుత కార్యములు చేయుశక్తి లేదా?
జవాబు:- ఉన్నది.
- 1) పాతనిబంధనలో దైవజనులు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందకపోయినను, పరిశుద్ధాత్మను కలిగియుండినందున అనేక అద్భుతములు చేసిరి.
- 2) అలాగే డెబ్బదిమంది శిష్యులు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందక మునుపే అద్భుతములు చేసిరి (మత్తయి. 10:1,2).
- 3) అలాగే ప్రభువు యొక్క శిష్యులు పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు పూర్వమే అద్భుతములు చేసిరి (లూకా. 10:1-12).
- 1) ఏలాగనగా, తాము నేర్చుకొనని భూలోక భాషలతో సువార్త ప్రకటించుట,
- 2) నేర్చుకొని పరలోక భాషలతో ప్రార్ధనా స్తుతులు చేయుట,
- 3) పరలోక భాషలకు అర్ధము చెప్పుట ఈ మొదలైన నూతన అనుభవములతో వారు పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చు అద్భుత శక్తిని భూదిగంతములవరకు వెల్లడి చెసిరి.
59. ప్రశ్న :- అనేకమంది పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుట లేదు కదా? కారణమేమైయుండును?
జవాబు:-
- 1) పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి పూర్తిగా తెలిసికొనలేదు. అందువలననే నమ్ముటలేదు.
- 2) నమ్మనందుననే ప్రయత్నించుటలేదు.
- 3) ప్రయత్నించనందుననే పాందుటలేదు. “అపోల్లో, కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి, ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారినడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.
60. ప్రశ్న :- మీ కూటములలోనికి ఇతరులను రానియ్యరట. ఎందుచేత?
జవాబు:-
- 1) రానియ్యక పోవడముకాదుగానీ కూటములోని వారిదివరకు నేర్చుకొనిన సంగతులు, క్రొత్తవారునూ నేర్చుకొన్న తర్వాత రానిత్తుము.
- 2) నేర్చుకొనడము ఇష్టము లేనివారు ఊరకనే చూడవలెనని వస్తే రానిస్తాము. గాని ఆలాగు వచ్చినవారికి అంత ప్రయోజనము కలుగదు. మధ్యను రావడము గనుక అన్ని సంగతులు నచ్చవు. అందుమీదట ఆక్షేపణలు మాత్రమేగాక తప్పుడు అర్ధములు, కల్పనలు, లేనిపోని యూహలు బైలుదేరును.