విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(136-140)



136. ప్రశ్న :- ఒకరు మీటింగులో ఉపన్యసించు చుండగా, కూర్చున్నవారిలో ఒకరు ఉపన్యాసకుని ప్రశ్నింప వచ్చునా? ఇది బాగాలేదు గనుక మానివేసి ఇంకొకటి మాటలాడండని అందరిలో అనవచ్చునా?

జవాబు:- బోధ తప్పు అయితే, ఆపుచేయుట తప్పుగాదు. గాని కాగితంమీద వ్రాసిచూపిస్తే బాగా ఉంటుంది. ఇతర మిషను బోధకుడు మన అనుమతిమీదనే మనమీటింగులో బోధిస్తున్నప్పుడు మన సిద్ధాంతములకు భిన్నమైన సిద్ధాంతము ఉంటే ఆపుచేయుట తప్పుకాదు. తప్పు బోధిస్తే తప్పుగాదు గాని తప్పును ఆపుచేస్తే తప్పా? మేము బోధిస్తున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మబోధ మీ దృష్టిలో తప్పుగా కనిపిస్తున్నందున మీరందరు ఆపుచేయవలెనని యత్నించుటలేదా?

137. ప్రశ్న :- పెంతెకొస్తు కాలములో మీరు పదిరోజులు మీటింగులు పెట్టవలెనని ఎందుకు ప్రచురించినారు?

జవాబు:- ఆది క్రైస్తవ సంఘములో శిష్యులు పెట్టిరిగదా! మనము పెట్టితే ఏమి తప్పు? శ్రమ కాలములో 40 రోజులు ఆరాధన పెట్టుకొన్నాము గదా! క్రిస్మసు, ఈస్టరు పండుగలు మహోత్సవములుగా ఆచరిస్తున్నాముగదా! అడ్వెంటుకాలమందొక వారము ప్రభువు రాకడ స్మరణార్థమైన ఆరాధనలు పెట్టుకుంటే మంచిది.

138. ప్రశ్న :- పరిశుద్ధాత్మ కుమ్మరింపులు మూడు ముఖ్యకాలములలో జరుగునని చెప్పుచున్నారు. అవి ఏవి?

జవాబు:- షరా:- ముమ్మారు జరుగు ఈ కుమ్మరింపులు, ఒక విధముగా సార్వత్రిక సంఘమునకుద్దేశింపబడిన పరిశుద్ధాత్మ బాప్తిస్మములై యున్నవి. అయినను మధ్యమధ్యను ఒక్కరికి ఇద్దరికి, కొద్దిమందికి కూడ కలుగవచ్చును. ఆ మనుష్యులను, ఆ కాలములను, తాత్కాలిక సువార్త పని అవసరమును, దేవుడెరుగును. పెంతెకొస్తునాడు ఒక్క యూదులకే కుమ్మరింపు కలిగెను. వారు మొదటి క్రైస్తవ సంఘస్థులు. మన కాలములో ఎవరికిపడితే వారికే కుమ్మరింపు కలుగును. వాక్యము విని, నమ్మి ప్రార్థించితే, చాలును. కొందరికి నీళ్ళ బాప్తిస్మము పొందకముందే కలుగును (అనగా అన్యులకే కలుగును) (కార్య. 10:44-46).

ప్రభువుయొక్క వెయ్యేండ్ల ఏలుబడిలో లోకమునకు చివరిసారి సమయము ఇయ్యబడును. పై చరిత్రద్వారా మూడు సంగతులు గుర్తించుచున్నాము. పెంతెకొస్తునాడు “నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును” అని వాగ్ధానము చేసిన తండ్రి జ్ఞాపకము వస్తున్నాడు. “ప్రభువైన యేసూ రమ్మని ప్రార్ధించుచున్న నేటి విశ్వాసుల సంఘము సిద్ధమగు నిమిత్తము ఆత్మ కుమ్మరింపు గలిగించుచున్న త్వరగా రానైయున్న క్రీస్తు ప్రభువు జ్ఞాపకము వస్తున్నారు. సహస్ర వర్షకాలమున విజ్ఞాపనచేయు ఆత్మ కుమ్మరింపబడునని జెకర్యా 12వ అధ్యాయములోని వ్రాతను చూడగా పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకము వస్తున్నారు.

139. ప్రశ్న :- మన లూథరన్ మిషను కీర్తన పుస్తకములో కూడ పరిశుద్ధాత్మను గురించి ప్రార్ధనలు ఉన్నవిగదా?

జవాబు:- అవును, ఉన్నవి పూర్తి ఆరాధన క్రమము గల పెద్ద పుస్తకములో ఐదు ప్రార్ధనలు పరిశుద్ధాత్మ తండ్రిని గురించి వ్రాయబడినవి. అందులో మూడవది :
ఓ ప్రభువైన దేవా! పరలోకపు తండ్రీ! మమ్మును వెలిగించి, సర్వసత్యములోనికి నడిపించి దుర్దశలన్నిటి నుండి కాపాడునట్లు నీ పరిశుద్ధాత్మను మాలో నివసింపజేయుమని నీ కుమారుడును, మా ప్రభువైన యేసుక్రీస్తుద్వారా వేడుకొను చున్నాము. ఆమేన్

ఐదవది: సర్వశక్తిగల నిత్యుడవైన దేవా! నీ కుమారుడైన యేసుక్రీస్తునుబట్టి మమ్మును కనికరించి, మాకు పాపక్షమాపణయు, జీవమును, దైవభక్తికిని అవసరములైనవన్నియును అనుగ్రహించియున్నావు. వేము తండ్రిభావముగల నీ కృపను ఎల్లప్పుడు మనస్సునందుంచుకొని మా శరీరేచ్చలను చంపి, లోకమును జయించునట్లును, నిర్మలమైన పరిశుద్ధ జీవనముతో నిన్ను సేవించుచు, నీకృప అంతటి నిమిత్తము ఎల్లప్పుడు నీకు స్తుతులను చెల్లించునట్లును, మమ్మును నడిపించుటకై నీ పరిశుద్ధాత్మను పంపుమని ఆ నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంటున్నాము. ఆమేన్.

ఈ విధముగా మన లూథరను వారంతా ప్రార్ధనలు చేయుదురు. దేవుడు మన ప్రార్థనలు విని తీరా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే, అది దయ్యమని మనవారు త్రోసివేయుచున్నారు.

ఉదాహరణ:- యూదులు మెస్సియాను రమ్మని నాలుగువేల సంవత్సరములు ప్రార్థించిరి. తీరా మెస్సియా క్రీస్తువారుగా వస్తే, నీవు కాదని సిలువవేసిరి. మనవారును ప్రస్తుతము యూదులవలెనె చేస్తున్నారు. ఇదెందుకో తెలియదు!

140. ప్రశ్న :- ఆత్మస్నానము నిమిత్తమొక్కరీతిగా ప్రార్థించుచు, నిద్ర, విశ్రాంతి లేకుండ ఉపవాసములో ఉండి కనిపెట్టుచుండుటవల్ల కొందరికి మతిచాంచల్యము కలుగు చున్నదనియు, అపవిత్రాత్మ పీడితులగుచున్నారనియు, వదంతి యొకటి గలదు. మీరేమందురు?

జవాబు:- నేను అనవలసినదేమున్నది? సంగతిని సంగతిగానే మాటలాడుకొందుముగదా! ప్రార్ధించవాడు శరీరమునకు మనస్సునకును హాని కలుగకుండ ప్రార్థించుట అలవాటు చేసుకొనవలెను మరియు కుమ్మరింపు త్వరగా కలుగని యెడల నిరాశపడుచు, దిగులుపడుచు, విసుగుకొనుచు, దేవునితో లేనిపోని వాదములు పెట్టుకొనుచు, ఇట్టి తగని చేష్టలుచేసిన యెడల హాని కలుగదా! దురాత్మ పని జరుగదా! అప్పుడు పరిశుద్ధాత్మ కూటములవల్ల ఈస్థితి లభించినదని దోషారోపణ చేయుట న్యాయముగాదు.