విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(130-135)



131. ప్రశ్న :- మీరు మాతో మాటలాడేటప్పుడు మా కూటస్థులు, మాకూటస్థులు అని అంటున్నారు. మీరు మాలోనుండి వేరైనారా ఏమి?

జవాబు:- మీ కూటస్థులు గంటల కొలది ప్రార్ధనలో ఉంటున్నారేమి? అని అడిగినప్పుడు, మీరు మమ్మును "మీ" అనుట లేదా?

132. ప్రశ్న :- మీరు రహస్య కూటములు పెట్టుకొన వచ్చునా?

జవాబు:- కూటములు రహస్య కూటములై యుండుటలో తప్పులేదు. దూషణతోను, అపనిందలతోను, దుర్భోదలతో నిండియుండిన కూటములు బహిరంగ కూటములై యుండుటయు, అట్టి కూటములు పరిశుద్ధ దేవాలయములో జరుపుటయు తప్పు అయియున్నది.

133. ప్రశ్న :- నా ప్రశ్నకు ఇటువంటి జవాబు చెప్పినారేమి?

జవాబు:- రహస్యముగా ఉండవలసిన సంగతులు రహస్యముగా యుంచుట తప్పులేదే. రహస్య సంగతులు కొద్దికాలము వరకే రహస్యముగా ఉంచబడును. తరువాత అవి బయలుపర్చవలెను. దానియేలునకు ఒక సంగతి బయలుపర్చబడి నప్పుడు, "ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి గనుక దానియేలూ! నీవు ఊరకుండుము" అని దానియేలుకు సలహా ఈయబడెను. అయితే ఈ సంగతులు కాలము వచ్చినప్పుడు బయలుపడెనుగదా! అవి బయలుపడేవరకు రహస్యముగా ఉంచబడెను. మరియు ప్రభువుకూడ కొన్ని సంగతులు రహస్యముగా ఉంచవలెనని చెప్పెను. “మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ సంగతులు ఎవరికిని చెప్పకుడి” అని రూపాంతరముపొంది కొండ దిగినప్పుడు, ప్రభువు తన శిష్యులకు చెప్పలేదా! (మత్తయి. 17:9). మేము ఈ సంగతులు పరిశీలన చేసి నేర్చుకొనేవరకు ఎవరికిని ధారాళముగా చెప్పలేదు. గనుక మీలాటివారు రహన్య కూటములనుకొను చున్నారు. అయితే అప్పుడు కూడ ఎవరైనను తెలుసుకొనవలెనని వచ్చిన యెడల చెప్పుచుండెడివారము. కొన్ని సంగతులు మేము నేర్చుకొన్న కొంత కాలమునకు ఎవరైన వస్తే, ముందు మొదటి సంగతులు నేర్పించిన తరువాత తక్కినవి నేర్పించువారము. అందుచేతను అట్టివారు మమ్మును రానివ్వడములేదు అని అల్లరిచేసిరి. అయితే 1934వ సంవత్సరములో పెద్దాపురము గుడిలోను, 1935లో రాజమండ్రి గుడిలోను, 1936లో ధవళేశ్వరము, గుంటూరు దేవాలయములలోను తదితర స్థలములలోను ఈ సంగతులు బాహాటముగా బోధించినాము. మేము రహస్యముగానేమియు నుంచలేదు. "సద్విషయములు", “ద్వితియాగమనము” అను పుస్తకములు మేము ప్రచురించి ఉచితముగా పంచిపెట్టలేదా! మమ్ములను పిలిపించి, అన్ని సంగతులు కనుగొనవలయునని మేము ఏ.ఇ.యల్.సి. వారిని 12-10-1936లో అడుగలేదా! ఇది మీరు అంగీకరించరు. మీరు మా కూటములకు రారు గనుక ఇవి మీకు రహస్యకూటములుగా నుండును.

134ప్రశ్న :- మీ కూటములు గుడిలో ఎందుకు పెట్టకూడదు?

జవాబు:- సంఘమంతటికైతే గుడిలో పెట్టవచ్చునుగాని ఇతర స్థలములలో పెట్టితే తప్పేమి? మిషనెరీలు తమ బంగళాలలో ప్రార్ధన కూటములు పెట్టుకొనుటలేదా? పెట్టనిస్తే పెట్టకేమి? అలాగైతే మీకును రావలెనని ఉన్నది గనుక మీరును రండి అందరిని పిలువండి.

135. ప్రశ్న :- మీరు చెప్పుచున్న ఆత్మస్నానము మొదలైనవి అవలంభించకపోతే అనేక నిందలు కష్టములు వచ్చుచున్నవి. అవలంభించడము చాలా కష్టమైన సంగతిగా కనబడుచున్నది ఏలాగు మరి?

జవాబు:- బైబిలులోనున్న సంగతులు వదలి పెట్టుటకు వీలులేదు. పశ్చిమ దేశములలోని కొంతమంది బైబిలులోని అద్భుతములు తీసివేయమనుచున్నారు. అలాగే మీరుకూడ పరిశుద్ధాత్మ బాప్తిస్మము లోపించవలయునని అనుచున్నారు. ఇది యే మాత్రము సరికాదు. దేవుని వాక్యము కొంత తగ్గించుటకు ఎవరికి అధికారమున్నది? క్రీస్తు మతములోనికి వచ్చినయెడల అనేకములైన శ్రమలు వచ్చుచున్నవి. గనుక క్రైస్తవ సంఘములో చేరడము మానివేయవలెనా? అది మానని మీరు ఇది ఎందుకు మానవలయును!