విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(121-125)
121. ప్రశ్న :- మీరు పెంతెకొస్తు మిషనులో చేరి పెంతెకొస్తు మిషను స్టాపిస్తారని వింటున్నాము. ఇది నిజమా?
జవాబు:- ఇది ఏ మాత్రమును నిజము కాదు, గాని ఒక సంగతి నిజము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అందరు పొందవలెననియు, భాషావరము ఈ కాలములో అనేకమందికి దేవుడు ఇస్తున్నాడనియు, ఔషధములు లేకుండా దేవుడు ఈ కాలములో కూడ రోగులను బాగుచేయుచున్నాడనియు, గురుతులనుబట్టి చూడగా ప్రభువు రాకడ కాలము సమీపముగా యున్నదనియు, వారు బోధించుచున్నారు. మేమును ఇది నమ్ముచున్నాము. ఈ బోధలు మన సంఘస్థులు కూడ నేర్చుకొనవలసినదని మేము కోరుచున్నాము. అది నేర్చుకొన్నంత మాత్రమున మనము పెంతెకొస్తు మిషను వారమైపోము. రోమను కధోలిక్కువారు ధరించుకొన్నట్లు మనము సిలువను ధరించుకొన్నంత మాత్రమునను, రోమను కధోలిక్కులవలె సమాధుల దగ్గర ఆరాధన చేసినంత మాత్రమును, మనము రోమను కధోలిక్కులవారము అయిపోలేదు కదా!
122,ప్రశ్న :- మీరు మీ అనుభవముమీద ఆనుకొను చున్నారు. దేవుని వాక్యముమీద ఆనుకొనుటలేదు. మీ అనుభవము ఎంత మంచిదైనను, దానిలో తప్పులుండక మానవుగదా?
జవాబు:- పాదుర్లు సంఘములో చేసే ప్రసంగములు, బోధలు వారి అనుభవములతో కూడినవి కావా? కూటములలో మనవారు అనుభవసాక్ష్యమిచ్చుటలేదా? వీధులలోను, దేవాలయములలోను, కూటములలోను చేయు బోధలు అనుభవముతో కూడినవేగదా? వ్యాఖ్యానముల గ్రంథములనిండ అనుభవములు లేవా? అర్ధాలులేవా? ఊహలు లేవా? ఇవన్నియు కొట్టివేయవలసినవేనా? క్రైస్తవ బోధలలోనుండి అనుభవమును తీసిపారవేసిన యెడల, మిగిలిపోయినది దేవుని వాక్యమేగదా! అలాగైతే బోధకులు ప్రసంగపీఠము లెక్కి దేవుని వాక్యమే చదువ వలయునుగాని, ప్రసంగములు ఏమియు చేయకూడదు. వీధులలో బైబిలులోని మాటలే చదువవలయును గాని ఏమియు వివరించకూడదు అని అనగలమా?
123. ప్రశ్న :- సంఘములోలేని బోధలు మీరు చేయుచున్నారు గనుక సంఘముమీద మీకు అభిమానము లేదు?
జవాబు:- నిజమే, సంఘములోలేని బోధలు మేము చేయుచున్నాము. గాని బైబిలులో ఉన్న బోధలే ప్రకటించు చున్నాము. అట్టివి మీరు ప్రకటించుటలేదు గనుక మీకు బైబిలుమీద అభిమానము లేదని మేము చెప్పవలసియున్నది. మీరు మమ్మును అనినమీదట మేమును మిమ్మును అనడము సుళువేగదా!
124. ప్రశ్న :- ఇదివరకు సంఘములోలేని బోధలు ఇప్పుడెందుకు చేర్చుచున్నారు?
జవాబు:- ఇరువదిఐదు యేండ్లక్రిందట లేని కోతపండుగ సంఘములో నేడు ప్రవేశపెట్టలేదా? ఇదివరకు సమాధులలోలేని ఆరాధన, ఇప్పుడు సంఘము ఆచరించుటలేదా? ఇదివరకు లేని నాటకములు సంఘములో ప్రవేశపెట్టలేదా? నాటకములు, బైబిలు సంబంధమైన నాటకములు ఉండకూడదని సినడ్లో తీర్మానము చేసిన తర్వాత బైబిలు నాటకములు కట్టలేదా? (స్తీ వేషములతో) రాజమండ్రిలోని సెంట్రల్ బాలికల పాఠశాలవారు ఈ సంవత్సరము మన క్రైస్తవ పిల్లలచేత హరిశ్చంద్ర నాటకము కట్టించలేదా? ఇదివరకు సంఘములో లేనివి, అంగీకారము కానివి, చేయకూడదని అనుకొన్నవి చేయుట, మీకు తప్పులేదుగాని; వాక్యములో బోధనలు మేము చేస్తే మీకు తప్పుగా కనిపిస్తున్నదా?
125. ప్రశ్న :- ఎప్పుడులేని పరిశుద్ధాత్మ బాప్తిస్మము తీసికొని వచ్చినారు. మన సంఘ చరిత్రలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినట్లుగాని, భాషలు మాట్లాడినట్లుగాని, దర్శనములు చూచినట్లు గాని ఇంకా ఇతరమైన ఆత్మవరములు పొందిన వారున్నారా?
జవాబు:- చాలమందియున్నారు. వారిపేర్లు ఇచ్చట నుదహరించుటకు వీలులేదుగాని ప్రతిశతాబ్ధములోను, అట్టి అనుభవములు కలిగివారు ఉంటున్నారు. మన శతాబ్దములో చాలమందియున్నారు.
రెండవ శతాబ్దములో తెర్తుల్లియన్ అనే ఆయన భాషావరము కొందరికివ్వబడినట్లు వ్రాసియున్నాడు.
నాల్గవ శతాబ్దములో కొందరు పరిశుద్ధాత్మనుపొంది భాషలతో మాట్లాడినట్లు పరిశుద్ధుడైన అగస్టిను వ్రాసియున్నాడు.
పన్నెండవ శతాబ్దమునుండి పదిహేనవ శతాబ్దము వరకు ఐరోపా దక్షిణ భాగమందు అనేకమంది భాషలతో మాట్లాడిరి.
1552 సంవత్సరములో పరలోకగతులైన పరిశుద్ధుడైన ప్రాన్సిసు గ్జేవియరు అనే పరమ భక్తుడు (సర్వప్రపంచ మిషనెరీ) నేర్చుకొనని హిందుదేశములోని భాషలలో ప్రసంగించెను. తనకు తెలియని భాషలలో కూడ మాట్లాడెను.
రక్షణసేన స్థాపకుడైన విలియంబూత్ దొరగారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది, కఠినాత్ములనేకమంది మారుటకు కారకుడాయెను.
లోక ప్రసిద్ధి కెక్కిన ప్రసంగీకుడు ఈ మధ్యనే పరలోకగతుడైన ఎఫ్. మేయర్ దొరగారు ఇట్లు వ్రాయుచున్నారు. రష్యా ప్రాంతములయందు లూథరన్ మిషను పని చేయుచున్న స్థలములలో, క్రైస్తవులు మందస్థితియందుండగా, దేవుడు బేరన్ ఆక్సువాల్ అనే ఆయనను లేపెను. ఆయన బలముతో సువార్త ప్రకటించెను. అప్పుడు అనేకమంది భాషలతో మాట్లాడిరి. ఒకరు మాట్లాడిన భాషయొక్క అర్ధము ఏమనగా “యేసు త్వరగా వచ్చుచున్నాడు, యేసు సమీపములో ఉన్నాడు, సిద్ధముగా యుండండి. సోమరి తనముగా యుండవద్దు”. ఈయన ఆ ప్రాంతములను దర్శించెను.