విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(76-80)
76. ప్రశ్న :- పరిశుద్ధాత్మ కూటములకు వెళ్ళకూడదు. వెళ్ళితే మాకుకూడ దయ్యములు పట్టుకొంటాయి. దీనికేమి చెప్పుదురు?
జవాబు: - డాక్టర్. మార్టిన్ లూథరును వర్మస్ పట్టణమునకు వెళ్ళకూడదని స్నేహితులు చెప్పినప్పుడు ఆ పట్టణములోని ఇండ్లమీద ఎన్ని పెంకులున్నవో, అన్ని దయ్యములు నా మార్గమునకు అడ్డుగా ఉన్నను వెళ్ళక మాననని చెప్పెను గదా! మీకేల భయము! సాతాను విశ్వాసులకు జడువవలయును, గాని విశ్వాసులు సాతానుకును జడువనేల! లూథరుయొక్క మంచిమాదిరి మనమవలంభించ కూడదా?
77. ప్రశ్న :- గత సంవత్సరాంతమందు జరిగిన కన్వెన్షన్లో మీ ప్రార్ధన కూటములకు షారోను సంస్తుతి సమాజమని ఎందుకు పేరు పెట్టినారు?
జవాబు:- ప్రభువుయొక్క రాకడకు పూర్వము జరుగవలసిన గుర్తులు జరిగిపోవుచున్నవి గనుక ఆయన రాకడ కాలము అతి సామీప్యముగా యున్నదని మేము నమ్ముచున్నాము. యూదులు యెరూషలేమునకు తిరిగివచ్చుట ఒక చివరి గుర్తు. ఇప్పటికి నాలుగు లక్షలమంది వచ్చిరి. అది అతి సామీప్యముగా నున్నదని నమ్మేవారందరును, ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరముతో ఎత్తబడుదురని నిరీక్షించుచున్నారు. మేమును వారిలోని వారమే. ఎత్తబడేవారే పెండ్లి కుమార్తె వరుసలోనివారు అయి ఉన్నారు. పరమగీతము అనే పుస్తకములో ఈ పెండ్లికుమార్తె యొక్కముంగుర్తు ఎంతో పావన వృత్తాంతముగా నున్నది. “నేను షారోను పొలములో పూయు పుష్పమువంటిదానను” అని పరమగీతములోని పెండ్లి కుమార్తె తాను పొందిన పవిత్రస్థితిని గురించి చెప్పుకొనుచున్నది. ఇది విశ్వాసుల సంఘము. ఈ వాక్యము క్రీస్తురక్తమువల్ల పొందిన పరిశుద్ధ స్థితికి ముంగుర్తెన వాక్కయియున్నది. మా కూటములో పాపపు “ఒప్పుదల, పూర్ణ సమర్పణ ప్రార్ధన ఉన్నప్పటికిని, ఎక్కువ స్తుతి యుండును గనుక సంస్తుతి అనుమాట చేర్చినాము. మేలు కలిగినప్పుడు మాత్రమేకాక కీడు కలిగినప్పుడును అదే విధముగా స్తుతి చేయుచుండుట అలవాటు చేసికొనుచున్నాము.
78. ప్రశ్న :- ఆత్మస్నానము పొందనివారు గూడ దీనిని గురించి బోధించుచున్నారు ఇదెందుకు?
జవాబు:- ఆత్మజీవములేని ఎందరు వాక్యమును బోధింపగా ఎందరో క్రైస్తవులగుచున్నారు. ఇది నిజము కాదా? మనుష్యులనుబట్టి కాదు మనుష్యులు మారడము. గాని దేవుని వాక్యములనుబట్టి క్రైస్తవ బోధకులుచేయు ప్రసంగములో ఏదో ఒక మాటవల్ల ఎవరో ఒకరు మారడములేదా? లోపములుగల బోధకులు బోధ చేయుట లేదా? లోపములుదిద్దుకొని బోధించుట వాక్యానుసారమైన పద్ధతి.
79. ప్రశ్న:- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందే సమయములో పిశాచి ప్రవేశించుట కూడ ఉండునని కొందరి అభిప్రాయము. దీనికేమి యుత్తరముకలదో!
జవాబు:- అవును కొందరిలో పిశాచి ప్రవేశించు చున్నాడని వారి చర్యలవల్ల మనము గ్రహించగలము. గాని అట్టి సమయములో కూటస్థులూరుకొనరు. ప్రార్ధనా స్తుతులవల్ల దయ్యమును వెళ్ళగొట్టుదురు. ఆత్మల విమోచనావరము గలవారిది గ్రహించగలరు.
80. ప్రశ్న :- అలాగైతే అట్టి కూటములకు ఎందుకు వెళ్ళవలెను?
జవాబు:-
- 1) చాలమంది పరిశుద్ధాత్మయొక్క పనివల్ల కలిగే మేలు పొందుచున్నారు గదా!
- 2) గుడికి వెళ్ళే కొందరు మారడము లేదనియు, కొందరు బొత్తిగా చెడిపోవుచున్నారనియు మన మందరమును గుడికి వెళ్ళడము మానవలెనా?
- 3) ప్రభువు భోజనము వుచ్చుకొను కొందరు తమ విరోధములను అలాగే ఉంచుకొనుచున్నారని మన మందరము సంస్కార భోజనము మానవలెనా?
- 4) వైద్యశాలలకు వెళ్లే కొందరు భాగు కాలేదనియు, కొందరు చనిపోవుచున్నారనియు చెప్పి వైద్యశాలలకు వెళ్ళడము మానివేయవలెనా?