విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(126-130)



126. ప్రశ్న :- ఈయాత్మ బాప్తిస్మము మానివేస్తే అపకార మేమి?

జవాబు:- ఉపకారములు మానివేయుట అపకారము కాదా? గొప్ప ఉపకారములు పొందవలెనంటే, ఎన్నో అడ్డములు వచ్చును. అయినను మానకూడదు. అన్ని మిషనులలో కొందరు, ఈ నూతనాంశము ఆలోచిస్తున్నారు. కొందరు ఆత్మ బాప్తిస్మము పొందుచున్నారు. మనమెందుకు ఊరకుండవలయును. ఇది బైబిలులో నున్న సంగతి గనుక తత్ విచారణ చేయక తప్పదు. విడిచిపెట్టుటకు వీలులేదు. క్రైస్తవ జీవనముయొక్క అభివృద్ధికి అవసరమైన సంగతి గనుక "మాకు అక్కరలేదు" అని అనడము బాగుగ యుండదు. వారికి వారికి ఇచ్చుచున్న దేవుడు మనకుకూడ ఇస్తాడు. స్వీడన్ దేశము లూథరన్ మిషను దేశమైయున్నది. ఆ దేశములో ఇప్పుడు ఆరువందల స్థలములలో పరిశుద్ధాత్మ బాప్తిస్మమునుగురించి యోచించుచున్నారు, పొందుచున్నారు గనుక మనమెందుకు పొందకూడదు!

127. ప్రశ్న :- ఇంత గొప్ప రక్షణ సువార్త తెచ్చిన పశ్చిమ దేశీయ మిషనెరీలు దీనిని గురించి ఎందుకు బోధించుట లేదు? ఇది వారికేల బయలువరచబడలేదు? వారేల దీనిని అంగీకరించుటలేదు?

జవాబు:- అవును, వారు చెప్పవలసినదే. వారు చెప్పడము మానివేసినారు గనుక మేము చెప్పుచున్నాము. అయినను మీరు వారిని అడగడం మంచిది. ఈ బోధలు ఇదివరకున్న బోధలతో చేర్చవలసినదని మేమును వారినడుగుచున్నాము. విశ్వాసులైనను, అవిశ్వాసులైనను, పండితులైనను, పామరులైనను, మిషనెరీలైనను, సామాన్యులైనను, క్రైస్తవులైనను, అన్యులైనను, స్త్రీలైనను, పురుషులైనను, ధనికులైనను, బీదలైనను, అనుభవము లేని పిల్లలైనను, అనుభవముగల పెద్దవారైనను; ఈ అంశమును గురించిన సత్యమును తెలుసుకొనవలెనను అపేక్షతో ప్రార్ధించిన యెడల దేవుడు తప్పకుండ ఏదో ఒకవిధముగా బయలుపర్చక మానడు అని మా అనుభవమైయున్నది. ఊరకనే ప్రార్థించుట చాలదు, ప్రభువు తెలియజేసేవరకు ప్రార్ధనలో ఉండి కనిపెట్టవలయును. అప్పుడు సత్యము తెలియగలదు. ప్రార్ధనలో మాట్లాడువారము మనమైతే కనిపెట్టుటలో మాట్లాడువారు ప్రభువైయున్నారు. ఎప్పుడును మనమే మాట్లాడుచుండి, ఆయనను మాటలాడనియ్యకపోతే సత్యమేలాగు బయలుపడును? సాధుసుందరసింగు సత్యము నిమిత్తమై ప్రార్థింపగా ప్రభువు ప్రత్యక్షము కాలేదా?

128. ప్రశ్న :- ఈ ఆత్మ బాప్తిస్మము పూర్వులకేగాని మనకుకాదని కొందరనుచున్నారు. దీనికేమి సమాధానము?

జవాబు:- ఇది మనకు కాదని బైబిలులో ఎక్కడ ఉన్నది?

129. ప్రశ్న :- ఆత్మస్నానము పొందుచున్నామని చెప్పుకొనుచున్నవారు, తక్కినవారిని చూచి నీవు పొందితేనేగాని వల్లపడదని చెప్పుచున్నారు. ఇది సరియా?

జవాబు:- దేవుడు ఇవ్వబోయే వరములు సంపాదించుకొనండని ప్రయానపడి చెప్పితే అది భయపెట్టడమగునా? పొందేవారికి చెడ్డ పేర్లు పెట్టి తర్కములోనికి దింపి, దోషారోపణచేసి, పరిహసించి, నిరుత్సాహపరచి, ఇదంతా వట్టిదేనని చెప్పడం భయపెట్టట అయియున్నది గదా! చెదరగొట్టుట అయియున్నది గదా! పొందే వారిని పొందకుండ చేయుటయు, క్రీస్తుప్రభువు చేరదీసిన గొర్రెలను చెదరగొట్టుట సరికాదు గదా! మేము మా పాపములు దేవునిదగ్గర ఒప్పుకొని, విడిచిపెట్టి, సమర్పణచేసి ఆత్మ కుమ్మరింపుకొరకు ప్రార్ధనచేసి స్తుతించుచూ కనిపెట్టగా, దేవుడు తన ఆత్మను మామీద కుమ్మరించియున్నారు. మీరును ఇట్లు మావలె చేసినయెడల మీకును ఆ కుమ్మరింపు లభించును అని సాక్ష్యమిస్తు, బోధచేయుచూ, హెచ్చరించుచున్నామే గాని బలవంత పెట్టుటలేదు, భయపెట్టుటలేదు

130. ప్రశ్న :- పెండ్లికుమార్తె! పెండ్లికుమార్తె! అనుచున్నారు. ఇది బైబిలులో యున్నదా?

జవాబు:- ముంగుర్తులుగా నున్న పాత నిబంధనలో పెండ్లికుమార్తెను గురించియున్న పరమగీతము, ఎస్తేరు గ్రంథము చదవండి. పైకి లౌకికముగా కనిపించుచున్నను అవి ఆత్మ సంగతులతో నిండియున్నవి. క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథములో దీనిని గురించియున్నది. దేవునికిని, విశ్వాసులకును గల సహవాసము ప్రసిద్ధికెక్కిన విషయమైయున్నది. అది "పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె" అను పోలికలు కలిగియున్నది. (ప్రకటన. 22:17) చదువండి.