విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(86-90)
86. ప్రశ్న :- భాషల సంగతి రోమా. 12:6-8లోను, ఎఫెసీ. 4:8-13లోను ఉన్న వరముల జాబితాలో ఏమాత్రమును ఉదహరింపబడలేదు గనుక ముఖ్యము కాదుగదా!
జవాబు:- ఒకచోటనుండి, ఇంకొకచోట నుందని సంగతి అంగీకరింపకకూడదని ఎక్కడున్నది? అలాగైతే నాలుగు సువార్తలలోను ఉన్న ఆహారాద్భుతమును అంగీకరించి, మహాముఖ్యమైనదిగా ఎంచి, మూడు సువార్తలలో లేని యోహాను 3:16ను అంగీకరింపకూడదనియు, ముఖ్యమైనది కాదనియు అందురా?
87. ప్రశ్న :- “అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు” అని 1కొరింథి. 14:19లో ఉన్నది గనుక భాష అవసరము లేదుగదా!
జవాబు:-
- ఎ) “సంఘములో” అనే మాట గుర్తించవలెను. పౌలు సంఘములో మాట్లాడక, తాను ఒంటరిగా ఉన్నప్పుడు భాషలో మాటలాడేవాడని ఇందువల్ల గ్రహించుకొనుము. నేటి క్రైస్తవులును అట్లే చేయవలెను. ఆయన దేవునితో పరలోక భాషలోను సంఘముతో స్వభాషలోను మాట్లాడువాడు. మీరును ఈ రెండు పనులు చేయండి.
- బి) 18వ వచనములో పైనున్న వాక్యము చదువరా ఏమి? నేను మీయందరికంటె ఎక్కువగ భాషలతో మాటలాడు చున్నాను. అందుకు దేవుని స్తుతించెదను (1కొరింథి. 14:18).
88. ప్రశ్న :- “మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగల వారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానాభాషలు మాటలాడువారినిగాను నియమించెను. అందరు అపోస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములుగలవారా? అందరు భాషలతో మాటలాడు చున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? (1కొరింథి. 12:28-30). ఈ వాక్యములనుబట్టి చూస్తే దేవుడందరికిని భాషలియ్యడని కనబడుచున్నది. భాషలు వచ్చితీరవలెనని ఏల చెప్పుచున్నారు?
జవాబు:- దేవుడు తన సర్వజ్ఞాన దృష్టినిబట్టి, ఉద్యోగ నియమమునుబట్టి, వరములను ఇచ్చును. భాష అడిగినవారి కెందుకివ్వరు. మత్తయి. 7:7లో అడుగుడి మీకివ్వబడును అని ఉన్నది గనుక భాషను గురించి కూడ అడుగవచ్చును. ఇష్టమున్న వారడిగి పొందుటలో ఏమి ఆక్షేపణ?
89. ప్రశ్న :- “అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు, కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు” (1కొరింథి. 12:11). ఆత్మ తన ఇష్టము చొప్పున వరములు పంచి ఇచ్చునని ఈ వచనములో ఉన్నది గనుక మనము భాష కోరుకొనరాదుగదా?
జవాబు:- భాష కావలెనని 120 మంది ప్రార్థింపలేదు, ఆత్మ కుమ్మరింపు మాత్రము అడిగిరి. దానితో భాష వచ్చినది. అపోస్తలులవలె మీరును చేయుడి.
90. ప్రశ్న :- క్రీస్తు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చునని ప్రవచించిన యోహాను భాషను గురించి ఏమియు చెప్పలేదే! అది అంత ముఖ్యమైనదైతే చెప్పియుండడా?
జవాబు:- ఆలాగైతే, యోహాను చెప్పనిది కార్యములు 2:4లో ఉన్నది. గనుక బైబిలులోనుండి తుడుపు పెట్టవలెనా?