నా అభిప్రాయము
ప్రియ చదువరులారా! ఈ పుస్తకములోని సంగతుల నన్నిటికిని నేనును పూచీదారుడనైయున్నాను. ఎందుచేతనంటే ఈబోధలనన్నిటిని ఉపదేశించినవారు నా ఆత్మీయ తండ్రియును, గురువును అగు యం. దేవదాసు అయ్యగారే. గాని వీటన్నిటిని వ్యాపింపచేసినవాడను నేను గనుక పూచీ నాకును కలిగియున్నది. ఎవరైనా ఈ అంశములమీద ఏ ప్రశ్నవేసిన జవాబు చెప్పుటకు నేను సిద్ధముగా నున్నాను. ఈ బోధను ఎదిరించేవారు అనేకులు ఉన్నందువలన ఇట్లు వ్రాయవలసివచ్చెను. నన్నడిగేవారికి బైబిలు వాక్యములను బట్టియు, నా న్ధంత అనుభవమును బట్టియు, నా మనస్సాక్షిని బట్టియు ఇతరుల అనుభవ చరిత్రనుబట్టియు బుజువు పరచుచు సమాధానము చెప్పగలవాడను. ఇది గర్వపువ్రాతగా భావించకండి. ఈ సంగతులు నేను ప్రార్ధన పూర్వకముగా ఆలోచించిన సంగతులే. ఇదివరకు నన్ను అడిగినవారికి నేను సమాధానము చెప్ప యత్నించినపుడు, పరిశుద్ధాత్మ తండ్రి వాక్కు అనుగ్రహించినట్లు ఇకముందునకు కూడ అనుగ్రహిస్తారని విశ్వసించు చున్నాను.
నా స్నేహితుడైన ఫిలిప్సన్ గారు. ఈ పుస్తకము వ్రాసిన తరువాత నేను అన్నియు చదివితిని. అన్నియు సరిగానే యున్నవి. మిషనెరీలైనను, పాస్టరులైనను, బైబిలు తెలిసిన మరెవరైనను బైబిలు పాండిత్యము లేనివారైనను, సంగతి తెలిసికొనవలెనని అడిగే సామాన్యులైనను నాతో వాదములకు ఢీగొనక, శాంతముగా సంభాషించినయెడల, అడిగిన ప్రతిదానికి ఉత్తరము చెప్పగల వాడను. ఏ మాత్రము సందేహించను. ఇది నా ఉద్యోగ ధర్మము. ఇది నా ఆనంద సేవ. ఆంధ్ర క్రైస్తవులు ఆత్మతో నింపబడుటకిదియే అమూల్యమగు అవకాశము. ఆలన్యములేక అవలంభించువారు, ఆశ్చర్యానుభవము నొందగలరు. ఇది నా స్వానుభవ సాక్ష్యమై యున్నది. ఈ పుస్తకము లూథరన్ వారికి మాత్రమే కాదుగాని, ఆంధ్ర క్రైస్తవులకందరకు అత్యవసరమగు గ్రంథము. గనుక మన తెలుగు దేశములో నున్న క్రైస్తవులందరు మిషను భేదములేక దీనిని గైకొని, చదివి ఆలోచించి, అవలంభించి క్రీస్తు ప్రభువు కొరకు బ్రతుకవలెనని నా కోరిక.
“విమలాత్మ ప్రోక్షణ” అను ఈ గొప్ప అనుభవ అంతస్థును ఇంత కాలమునకు బైలుపరచిన ప్రభువునకు స్తోత్రములు. ఇంకా మిగిలియున్న మర్మములు దేవుడు సకాలమందు బైలుపరచును గాక! చదువరులకు గ్రహించి నమ్మే హృదయము ప్రభువు అనుగ్రహించునుగాక!
తప్పులుపట్టే ఉద్దేశమునకును, మంచిదైనా ఇదివరకు లేనివి ఇప్పుడెందుకు అనే తలంపునకును, అందరును విరోధించు చుండగా ఈ బోధ మానివేయకూడదా! అను ఆలోచనకును చదువరులు దూరస్థులై ఇది దైవవాక్యానుసారము గనుక అవలంభించవలసినదే అను తీర్మానము పక్షముగా నుందురు గాక!
“మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక! (కీర్తన. 115:1).
స్వతంత్రసువార్త ప్రచారకుడు
షారోను గృహము
రాజమండ్రి, 26-6-1937. ఇట్లు
క్రీసునందలి
K. విజయరత్నము