విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(66-70)
66. ప్రశ్న :- కూటములో లోటు కనబడుచున్నది. కొన్ని నాకు సరిపడలేదు.
జవాబు:- ఈ ప్రశ్నయే మీకు మాటిమాటికి వచ్చుచున్నది. మీకొక మంచి సలహా ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి బైబిలులో నున్న వాక్యములన్ని నెమ్మదిగా చదువుకొని ఒకరి సహాయము లేకుండ మీరే స్వయముగా ప్రార్ధన చేసికొని, ఆత్మస్నానము పొంది, మీరొక కూటముపెట్టి, మీ కూటములు ఇప్పుడున్న కూటములకంటె శ్రేష్టమైనదనియు; కేవలము బైబిలు ననుసరించి యున్నదనియు, మీ కూటము మూలముగా బుజువు పరుపండి. అప్పుడెంత బాగా ఉండును! “ఆ కూటము బాగాలేదు, ఈ కూటము బాగా లేదు, కూటమునకు వెళ్ళేవారు బాగాలేరు, వారు బాగాలేరు, వీరు బాగాలేరు” అని అనడముకంటె ఎవరైనా ఒకరు లేచి మహాదివ్యమైన కూటములు పెట్టిన ఎంతో ఉపకారము చేసిన వారగుదురు. ఏడ్చుట మూల్గు ట దొర్లుట అర్ధములేని మాటలాడుట ఈ మొదలైనవి లేకుండ కూటము జరిపే వారు. ఇవి రాకుండ ఆత్మ నొందేవారు లేవడము కూటమునకెంతో మేలు కదా!
67. ప్రశ్న :- ఎంతో చెడ్డగా తిరిగేవారికి ఆత్మ వచ్చినదంటే ఏలాగు నమ్మగలము?
జవాబు:-
- 1) వారు మారిన యెడల ఆత్మ రాకూడదా? సుంకరులును, వేశ్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువు చెప్పలేదా! (మత్తయి. 21:31).
- 2) ప్రభువు పాపులను చేర్చుకొన్నాడని పరిసయ్యుల మాటలవల్ల తెలియుచున్నది (లూకా. 15:1-2). వారు బోధ వినుటకు రాగా ఆయన చేర్చుకొనెను, వారితో భోజనపంక్తిని కూర్చుండెను. ప్రతి పాపియు బోధ వినుటకు వచ్చి బాగుపడితే సంతోషమేగదా?
68. ప్రశ్న :- మొదటనుండి కొందరెంతో భక్తిగా నడుచుకొనుచున్నారు. ఎంతోగొప్ప దైవసేవ చేయుచున్నారు. ఎంతో గొప్ప వాక్యానుభవము గలిగియున్నారు. అట్టివారిలో కొందరు ఆత్మకుమ్మరింపు పొందినవారి సంగతులు విని ఎన్నో రోజులనుండి ప్రార్థించుచున్నారు గాని వారికి ఆత్మకుమ్మరింపు రాలేదు. అది నిజమైతే రాదా! వట్టివట్టి వారికి చిటుక్కున రావడమును, తక్కిన వారికి ఎన్ని తంటాలుపడినను రాకపోవడమునా?
జవాబు:- ఇదివరకె దీనికి జవాబియ్యడమైనది. ఎంతకును పొందకపోతే పొందుటకు ప్రయత్నించే ఒక క్రమముకూడ ఉన్నదికదా! ఒకసారి ప్రయత్నించేవారు నిజమని నమ్మబట్టేగదా ప్రయత్నించడము! అట్టివారు పొందకపోతే మరల మొదటనుండి యత్నించవలెను. అనగా బైబిలు వాక్యములు మరల చదువవలెను. అందరికి అనేది నచ్చకపోతే ప్రయత్నములో లోపమే. “అందరికి అనేది నచ్చేవరకు ప్రార్ధించవలెను. అయినను రాలేదందువేమో! ఆలాగైతే స్తుతియు, కనిపెట్టుటయు ఉండవలెను. ఈ రెండే చిట్టచివర వరకు నుండవలెను.
69. ప్రశ్న :- నా ప్రశ్నకు సరిగా జవాబు చెప్పండి.
- 1) కొందరు ప్రార్ధనలో ఉండి ఉండి తల విరియబోసుకొంటున్నారు.
- 2) మరికొందరు వికారముఖము, మాడిపోయిన ముఖము గలవారగుచున్నారు.
- 3) ఇంకను కొందరు టట్ టట్ మొదలగు మాటలు ఉచ్చరించుచున్నారు.
- 4) వేరే కొందరు క్రిందపడి దొర్లుచున్నారు.
- 5) ఇంకా మరికొందరు కెవ్వున కేకలు వేయుచున్నారు.
- 6) తక్కినవారు స్తోత్రం స్తోత్రం అని అనేక పర్యాయములనుచున్నారు. ఇంకా చాలా ఉన్నవి, ఇవన్నియు దయ్యపు చేష్టలు కావా?
జవాబు:- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుట మహిమగల కార్యము. అట్టి కార్యము జరిగే ప్రారంభదశయందు శరీర ప్రాణములు ఆ కార్యమును భరింపలేక అట్టి చర్యలు జరిగించును. తర్వాత అవి పూర్తిగా పోవును. దయ్యపు చేష్టలవలె కనిపించే అట్టి చర్యలాగిపోయి శాంతి కలిగేవరకు భాష ధారాళముగాను మృదువుగాను వచ్చేవరకు; భాషార్ధము నేర్చుకొనే వరకును నాయకులు కూటస్థులు బహిరంగము లోనికి రానీయగూడదు. బలహీనులగు క్రైస్తవులును, పిల్లలును ముఖ్యముగా అన్యులును ఈ చర్యలను చూచి దయ్యము పట్టుకొన్నది అని తలంతురు. అట్లు వారు తలంచుటకు సందివ్వుకూడదు. ఇట్టి చర్యలు వెల్లడియైనప్పుడు దైవవాక్యము నెడలను, ప్రార్ధనాచారము నెడలను, క్రైస్తవమతము నెడలను, క్రైస్తవుల యెడలను ఇతరులకు దురభిప్రాయము కలుగును. అన్యులు సంఘములోనికి రాకుండుట కిదియొక గొప్ప ఆటంకపు అడ్డు బండగ నుండును. క్రీస్తు నామమునకు అవమానము కలుగును గనుక నాయకులు జాగ్రత్తగా నుండవలెను.
70. ప్రశ్న :- ఆత్మస్నానము పొందినవారు దయ్యములు పూనినవారివలె వణకుట, కేకలు వేయుట, పడిపోవుట, ఏడ్చుట బిగ్గరగా పాడుట ఇవెందుకు చేయుదురు?
జవాబు:-
- 1) దానియేలు కొక దర్శనము కలిగినప్పుడు వణకలేదా? (దానియేలు 10:11),
- 2) "భక్తులు బిగ్గరగా ఆనంద గానము చేసెదరు” అని కీర్తన. 132:16లో లేదా?
- 3) ఆరంభములో వణకుండును. దైవసహవాసము అలవాటుపడగా అదియుండదు. భాషారంభమందునట్టులుండగా, తర్వాత క్రమేణ భాషలో పాటపాడుట కూడ వచ్చును.
- 4) యోహాను లంకలో దర్శనమందు ప్రభువునుచూచి చచ్చినవానివలె పడిపోయెను గదా! (ప్రకటన 1:17) చచ్చినవానివలె పడుట ఎందుకు? అని యడుగుదురా!