విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(71-75)
71. ప్రశ్న :- స్తుతిచేస్తే ఆత్మ వచ్చునని ఎక్కడ ఉన్నది?
జవాబు:- ఎక్కడను లేదు గాని రెండు కథలలో దాని జాడలున్నవి.
- 1. మొదటి కథ: “యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కూర్చున్నవారికి వడ్డించెను” అని యోహాను 6:11లో ఉన్నది. ముందు స్తుతి జరిగినది తర్వాత రావలసిన రొట్టెల వృద్ధి కనబడినది. స్తుతివల్ల సిద్ది కలిగినది. రొట్టెలు వృద్ధియైన తర్వాత కాదుగాని అభివృద్ధి పొందకముందే ప్రభువు స్తుతి చేసెను. అంటే ముందు స్తుతి చేసిన యెడల ఆత్మ వచ్చునని దీనినిబట్టి గ్రహించుకొందుము. మనమైతే రొట్టెలు వృద్ధియెన తరువాత స్తుతి జేతుముగదా! చూడండి! ప్రభువెట్లు నెరవేర్పునకు ముందే స్తుతించెనో!
- 2. రెండవ కథ: లాజరు శవమింకను సమాధిలోనేయుండగా అతడు బ్రతికి బైటికి వచ్చినాడనట్టు ప్రభువు ముందే స్తుతిచేసెను. అప్పుడుగదా లాజరు బ్రతికెను (యోహాను. 11:41). ముందుస్తుతి, తర్వాత లాజరు బ్రతుకుట! ప్రార్ధన సంగతి నెరవేరకముందే, నమ్మి వేసినయెడల నెరవేరునని ప్రభువు (మార్కు 11:24)లో చెప్పలేదా! దీనినిబట్టి ఆత్మ నిమిత్తమైన ప్రార్ధన నెరవేరకముందె నెరవేరెనని నమ్మవలయునుగదా! అట్లు నిజముగా నమ్మినయెడల, నెరవేరినట్లు భావించి స్తుతిచేయుము. ఆలాగు చేయగా ఆత్మ వచ్చును. స్తుతి చేయకపోతే నమ్మికలేదనియే కదా అర్ధము.
72. ప్రశ్న :- గొప్ప శబ్దముతో ఎందుకు స్తుతి చేయవలయును?
జవాబు:-
- 1) ఒక కుష్టురోగి స్వస్థత నొందగానే గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచెను గదా! (లూకా. 17:16) గొప్ప శబ్దమెందుకని అడుగుదువా?
- 2) ప్రభువు గార్థభాసీనుడై యెరూషలేము వెళ్లుచుండగా, ప్రజలు దావీదు కుమారునికి జయము అని కేకలు వేసిరిగదా! (మత్తయి. 21:9). కేకలెందుకని అడుగుదువా? మరియు
- 3) దావీదు కీర్తన. 9:1 చదువుకొనుము. దావీదు తన కంఠమెత్తి స్తుతిగానము చేసినట్లు తాను వ్రాసిన పుస్తకములో చూస్తున్నాము. ఆయనే అట్లు చేసిన యెడల మనము మరెంతగా స్తుతి చేయవలెనో ఆలోచించుకొందాము.
73. ప్రశ్న :- పరిశుద్ధాత్మ కూటస్థులలో కొందరి ప్రవర్తన సరిలేదనియు, కొన్ని అనాచారములున్నవనియు, మూఢభక్తి గలదనియు; స్త్రీలు పురుషులు కలిసి కూటములు పెట్టుట మంచిది కాదనియు; అందుచేత అట్టి కూటము నెత్తివేయుట ఉత్తమమనియు కొందరు పెద్ద మనుష్యుల అభిప్రాయము. మీరేమందురు?
జవాబు:-
- 1) కొందరిలో లోపములున్నవనుట అసత్యము గాదు. సంఘములో ఒకరు తప్పుచేస్తే ఆ సంఘ మెత్తివేయుదురా? ఒక బడిలో ఒక విద్యార్థి తప్పుచేస్తే ఆ బడిని ఎత్తివేయుదురా? పొరబాటులున్నయెడల దిద్దుబాటు చేస్తే గొప్ప ఉపకారముగాని ఎత్తివేస్తే ఏమి ఉపకారము!
- 2) సమాజముగా కూడుకొనుట మానవద్దని పౌలు వ్రాయలేదా? (హెబ్రీ. 10:24).
- 3) ఆదివారము దేవాలయములో స్త్రీ పురుషులు కలిసి ప్రార్థించుటలేదా? అది ఆక్షేపించనప్పుడు ఇదెందుకు ఆక్షేపించవలయును.
- 4) “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును” అని ప్రభువు చెప్పలేదా? (మత్తయి. 18:20).
- 5) మోషేలో లోపమున్నది గనుక ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితియోపదేశకాండములు కొట్టివేయవలెనా?
- 6) దావీదులోను, సొలోమోనులోను లోపములున్నవని వారి వ్రాతలు కొట్టివేయవలెనా?
- 7) ప్రవక్తలలో లోపములున్నవని ప్రవచన గ్రంథములు కొట్టి వేయవలెనా?
- 8) నువార్తికులలో లోపములున్నవని సువార్తలు, అపోస్తలుల కార్యగ్రంథము కొట్టివేయవలెనా? ఈ విధముగా బైబిలులోని పుస్తకములన్నియు కొట్టివేసికొనుచు వెళ్ళవలెనా?
74. ప్రశ్న:- కూటస్థులలో లోపములుంటే లోపములున్నవని చెప్పుట తప్పేనా?
జవాబు:- తప్పుకాదుగాని వారి నడత తప్పు అని చెప్పి, ఆ వంకమీద బైబిలులోని సంగతికూడ తప్పేనని ఇతరులు అనుకొనే మాటలు పలుకుట తప్పుగాదా మరీ! ఒక వేటగాడు పక్షిని గొట్టవలెనని గురిపెట్టి పక్షిని కొట్టినాడు గాని ఆ పక్షితోపాటు కొమ్మనున్న మనిషిని గూడ గొట్టినాడు. మనిషిని కొట్టవలెనని కొట్టలేదు. గాని కొట్టినాడా లేదా? అలాగే మనిషిది తప్పని మనిషిని ఖండించేటప్పుడు, దైవవాక్యమును కూడ ఖండించేరు సుమీ, జాగ్రత్త! దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడేమి విత్తునో ఆ పంటనే కోయును (గలతీ. 6:7).
75. ప్రశ్న :- పరిశుద్ధాత్మ కూటములకు వెళ్ళితేనేకాని, ఇంటిలో నుండి ఏకాంతముగా ప్రార్ధనచేసికొంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము రాదా?
జవాబు:- ఆదికాలపు క్రైస్తవులు నూట ఇరువదిమంది ఒక మేడ గదిలో కూడుకొని ప్రార్థింపగా బాప్తిస్మము కలిగెను. ఈ వృత్తాంతమును ఎట్లు గ్రహించుచున్నావు? ఒంటరిగా ప్రార్ధిస్తే రావచ్చునుగాని పదిమందితోకలిసి ఏకమనస్సుతో కూడుకొన్న యెడల త్వరగా, సరిగా ఆత్మాభిషేకము కలుగును గనుక ఉపదేశము పొందుము, ప్రార్ధించుము, అను వాడుకను నిర్లక్ష్య పెట్టినయెడల అదియొక లోపమగును. లోపముంటే బాప్తిస్మమెట్లు కలుగును?