విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(6-10)



6. ప్రశ్న :- పాతనిబంధన విశ్వాసులలో పరిశుద్ధాత్మ లేదా?

జవాబు:- ఉన్నాడు. పరిశుద్ధాత్మావేశమువల్లనే వారు అద్భుతములు చేయగలిగిరిగాని వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు. భాషలతో మాట్లాడు వరము వారికియ్యబడినట్లు వాక్యములో లేదు. భాషలతో మాటలాడు వరమును ఆదిక్రైస్తవ మత సంఘములోని వరములును; పరిశుద్ధాత్మను పొందిన ఒక ఫలితముగా కలిగినట్లు వాక్యమువల్ల కనబడుచున్నది.

7. ప్రశ్న :- అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించిన వాక్యము లెచ్చట యున్నవి?

జవాబు : క్రొత్తనిబంధనలో కూడ ఈ బాప్తిస్మమును గురించిన ప్రవచన వాక్యములున్నవి.
  • 1. “మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుదను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును”. (మత్త. 3:11).
  • (మార్కు 1:8)
  • 3. (లూకా. 3:16).
    షరా:- ఇవి యోహాను పలికిన ప్రవచనములు.
  • 4. “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద యెల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును” (యోహాను. 14:16-17) - ఇది ప్రభువు పలికిన ప్రవచన వాక్యము.
  • 5. “ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” (యోహాను. 1426) - ఇదియు క్రీస్తు ప్రవచనమే.
  • 6. “అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనియెడల ఆదరణకర్త మీయొద్దకురాడు. నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమునుగూర్చియు, నీతినిగూర్చియు, తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు; నేను తండ్రియొద్దకు వెళ్ళుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతినిగూర్చియు, ఈలోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటతానే ఏమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును. గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నియు నావి. అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను జెప్పితిని.” (యోహాను. 16:7-15). ఇవికూడ రక్షకుని ప్రవచన వాక్యములే.

8. ప్రశ్న :- ఈ అన్ని ప్రచనముల నెరవేర్పు ఎక్కడ ఉన్నది?

జవాబు : అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములోఉన్నది.

9. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎవరు ఇచ్చిరి?

జవాబు:- పరలోకమునకు వెళ్ళిన ఆ క్రీస్తు ప్రభువే. ఆ బాప్తిస్మము ఇచ్చెను. యోహాను. 15:26 16:7 అపో॥కార్య॥ 2:23 చూడండి.

10. ప్రశ్న : ఆ మొదటిసారి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన వారెవరు?

జవాబు : 1) పేతురు 2) యోహాను 3) యాకోబు 4) అంద్రెయ 5) ఫిలిప్పు 6) తోమా 7) బర్తలోమయి 8) మత్తయి 9) యాకోబు (అల్ఫయి కుమారుడు), 10) సీమోను (మతాభిమాని), 11) యూదా (యాకోబు కుమారుడు), 12) మత్తీయ, 18) కొందరు స్త్రీలు, 14) మరియ ప్రభువు తల్లి, 15) ప్రభువుయొక్క సహోదరులు. మొత్తము ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు.