విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(51-55)
51. ప్రశ్న :- భాషలవల్ల చాలా అల్లర్లున్నందున మాన్పిస్తే బాగుండును గదా?
జవాబు:- “కాబట్టి సహోదరులారా! ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను, క్రమముగాను జరుగనియ్యుడి” (1కొరింధి. 14:39,40) అని పౌలు వ్రాయుచున్నాడు గనుక ఆపుచేయ వీలులేదు. మీకొక ఉపాయము చెప్పుచున్నాను. మీరు మొదట పరలోక భాషావరము సంపాదించుకొనండి. అప్పుడితరులు మాటలాడే భాషలలోని లోపములు మీకు తెలియును గనుక ఆపుచేయవచ్చును.
52. ప్రశ్న :- పౌలు 1కొరింథి. 14వ అధ్యాయయములో ప్రవచించుటను గురించి వ్రాయుచున్నాడు. ఇది ఏమిటి?
జవాబు:-
- 1) ప్రవచించుటవల్ల ఇతరులకు మేలు గనుక పౌలు భాషలతో మాటలాడువానికంటె ప్రవచించువానినే ఎక్కువ మెచ్చుకొనుచున్నాడు. ఇందువలన భాషలతో మాటాలాడుటను కొట్టివేయుటలేదు.
- 2) ప్రవచించుట అనగా దేవుని చిత్తమును ప్రజలకు తెలియజేయుట. భాషార్ధములోను, దైవవాక్యములోను, దాని వివరములోను ప్రవచనముండును. పూర్వకాలపు ప్రవక్తలు రాబోవు సంగతులను చెప్పువారు. అందుచేతనే వారికి ప్రవక్తలని పేరు వచ్చినది.
53. ప్రశ్న:- పరిశుద్ధాత్మ ఇచ్చువరములేవి?
జవాబు:-
- 1) ప్రవచన వరము
- 2) స్వవ్న వరము
- 3) దర్శన వరము (యోవేలు. 3:28),
- 4) పరిచర్యవరము,
- 5) బోధించు వరము,
- 6) హెచ్చరించు వరము,
- 7) పంచిపెట్టు వరము
- 8) పైవిచారణచేయు వరము,
- 9) కరుణించు వరము (రోమా. 12:8),
- 10) జ్ఞాన వాక్యముచెప్పు వరము,
- 11) బుద్ధివాక్యము చెప్పు వరము,
- 12) విశ్వాస వరము,
- 13) స్వస్థపరచు వరము,
- 14) అద్భుతములు చేయు వరము,
- 15) ఆత్మవివేచన వరము,
- 16) నానా భాషల వరము,
- 17) భాషార్ధము చెప్పు వరము,
- 18) పరలోక భాషలు మాట్లాడు వరము (1కొరింధి. 12:8-10).
54. ప్రశ్న :- పరిశుద్ధాత్మవల్ల ఏ మంచి గుణములు అబ్బును?
జవాబు:-
- 1) ప్రేమ,
- 2) సంతోషము,
- 3) సమాధానము,
- 4) దీర్ఘశాంతము,
- 5) దయాళుత్వము,
- 6) మంచితనము,
7) విశ్వాసము, - 8) సాత్వికము,
- 9) ఆశానిగ్రహము (గలతీ. 5:22)
55. ప్రశ్న:- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవారిలో మార్పులేమియు కనబడడము లేదేమి?
జవాబు:-
- 1) పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి శ్రద్ధగా నేర్చుకోవడము మార్పుకాదా?
- 2) నేర్చుకొని నమ్మడము మార్పు కాదా?
- 3) నమ్మి పొంద ప్రయత్నించుట, కన్నీళ్ళతో ప్రార్ధించుట నిద్రమాని మోకాళ్ళమీద ఉండుట. ఇవి మార్పులుకావా?
- 4) పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందటము మార్పు కాదా?
- 5) ఎరుగని భాషలతో మాటలాడుట మార్పుకాదా?
- 6) అర్ధము చెప్పుట మార్పు కాదా?
- 7) క్రైస్తవమతమంటే చెప్పవద్దు చెప్పవద్దు అనేవారు, పరిశుద్ధాత్మ కూటములకు వచ్చిన వెనుక నీళ్ళబాప్తిస్మము కోరుకోవడము మార్పుకాదా?
- 8) సంఘకూటాలకురాని కవులు ఈ కూటములకు, సంఘ కూటములకు రావడము మార్పుకాదా?
- 9) బైబిలు మునుపటికంటె శ్రద్ధగా చదవడము మార్పుకాదా?
- 10) గంటలు గంటలె ప్రార్ధనలో, స్తుతిలో, కనిపెట్టుటలో ఉండడము మార్పుకాదా?
- 11) ఎవరికిబడితే వారికే దేవుని మాటలు చెప్పడము మార్పుకాదా?
- 12) దర్శనాలు చూడడము మార్పుకాదా?
- 13) దేవుని స్వరమును వినడము, ఆ విన్నది వ్రాసుకోవడము మార్పుకాదా?