విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(111-115)



111. ప్రశ్న :- ఈ రోజులలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము వల్ల ఉపయోగమేమి?

జవాబు:- ఆ రోజులలో మొదటి రాకడను గురించి వారు సాక్ష్యమిచ్చిరి. ఈ రోజులలో రెండవ రాకడ సమీపమని మనము సాక్ష్యమిస్తాము. ఆత్మస్నానము పొందనివారు అంత ధైర్యముగా రాకడ సమీపమును గురించి సాక్ష్యమియ్యలేరు. రాకడ దగ్గర బడినదని నమ్మవచ్చును, బోధింపవచ్చును. గాని శక్తితో బోధించలేరు, నిశ్చయము చెప్పలేరు.

112. ప్రశ్న :- అలాగైతే మీరనేమాట ఏమిటంటే రెండవ రాకడ సాక్ష్యమివ్వడానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందవలెను అదేనా?

జవాబు:- అవును అంతా మరల చెప్పుదును వినుము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము రెండవరాకడ సంబంధములో ఎందుకుపయోగమో వినుము.

షరా:- తక్కినపనులు అనగా నీళ్ళబాప్తిస్మమును పొందినవారు చేసే పనులు వట్టిపనులే గనుక స్నేహితుడా! పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకును రెండవ రాకడకును; గురుతులై పోవుచున్న ఈ కాలములో సర్వవిధముల సంబంధమున్నది. పై రెండును విడదీయ వీలులేదు. మనవారు పరిశుద్ధాత్మ స్నానమును, రెండవరాకడను విరోధించడము మాత్రమేకాక దర్శనములనుకూడ విరోధించుచున్నారు. ఒక సంగతిని విరోధించడం ఆరంభిస్తే, ఇంకొక సంగతిని విరోధించడంకూడ కలిగి ఉంటున్నారు.



113. ప్రశ్న :- “నీళ్ళ బాప్తిస్మము, నీళ్ళ బాప్తిస్మని" అనుటవల్ల బాప్తిస్మమును తుంచనాడినట్టుగ ఉన్నదిగదా?

జవాబు:- నీళ్ళ బాప్తిస్మము అనక మరి ఏ బాప్తిస్మమని పిలువగలము. అంత మాత్రముననే వట్టి నీళ్ళబాప్తిస్మమని అర్ధమియ్యదని అందరకు తెలుసును. అనుదినస్నానము వట్టి నీళ్ళ స్నానమైనట్లు, క్రైస్తవ పరిశుద్ధ బాప్తిస్మము వట్టి నీళ్ళ బాప్తిస్మమని ఎవరు అనుకొంటారు? అక్కరలేదు అంటే తుంచనాడినట్లు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అక్కరలేదని అంటే దానిని తుంచనాడినట్టే. క్రైస్తవ సంఘాధ్యక్షుల స్వాధీనములో ఉండి దొరకే నీళ్ళ బాప్తిస్మమును తుంచనాడితే, అది మా దోషము. క్రీస్తు స్వాధీనములో ఉండి దొరకే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును తుంచనాడుట మీది దోషము. ఏదైనా, మేము తుంచనాడలేదుకదా! నీళ్ళతో ఇచ్చే బాప్తిస్మము గనుక నీళ్ళ బాప్తిస్మమన్నాము. పరిశు ద్ధాత్మతో ఇచ్చే బాప్తిస్మము గనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మమన్నాము.

114ప్రశ్న :- తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల పేరిట బాప్తిస్మము పొందితిని గదా! అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అవసరమా?

జవాబు:- అపో॥కార్య॥ 8:14-16లో క్రీస్తు నామమున బాప్తిస్మము పొందినవారుకూడ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిరి.

115. ప్రశ్న :- “ఆయన ఈ మాటలు చెప్పి వారిమీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో, అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచి యుండునని వారితో చెప్పెను” (యోహాను. 20:22-23). ఈ వాక్యము చూడగా శిష్యులు పరిశుద్ధాత్మను పొందినట్లున్నది. వారికి కూడ పరిశుద్ధాత్మ అవసరమా?

జవాబు:-

తండ్రి సృష్టికర్తయని దీనివల్ల కనబడుచున్నది. క్రీస్తు ప్రభువుకూడ శిష్యులకు అట్లే చేసెను. గనుక ఈయన కూడ సృష్టికార్యము చేయు సృష్టికర్తయైయున్నారు. ఊదుట సృష్టిపని; కుమ్మరించుట వేరేపని. ఇవి రెండును రెండు వేరైన పనులుగదా! గనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రత్యేకముగా అవసరమైయున్నది.