విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(36-40)



36.ప్రశ్న :- ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అపోస్తలులకే గాని మనకు కాదని ఒకరు అనుచున్నారు. దీనికేమి సమాధానము చెప్పుదురు?

జవాబు:- మీరు ఊహించుచున్నట్టు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అపోస్తలులకే అనుకొనండి. అయితే నాకు కూడ దయచేయుమని నేను దేవునిని అడిగినాను. ఆయన ఇచ్చినాడు, నేను పొందినాను. గనుక మీకెందుకీ సంగతి కష్టముగా నుండవలయును.

37. ప్రశ్న :- నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుటకు ఎంతో ప్రయత్నము చేస్తూవుంటే నాకు కలుగడములేదు గనుక అది ఈ కాలమునకు కాదని తోస్తుంది. దీనికేమందురు?

జవాబు:- మీకు రాకపోతే ఎవరికి రానట్లేనా? మీకు రాకపోతే మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుని వాక్యము అసత్యమేనా? మీకు రాకపోతే దూరస్తులందరికీ అనే మాట రద్దయిపోయినట్లేనా? మీకు రాకపోతే మీలో ఏదో ఒక లోపమున్నదని గ్రహించవలెను లేదా అందునిమిత్తము చేయవలసిన ప్రయత్నములలో ఏదో విడిచిపెట్టియుందురు.

38. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందవలెనంటే ఏమి చేయవలెను?

జవాబు:- 1) మారుమనస్సు పొందవలెను (అపో॥ కార్య॥ 2:38), 2) నీళ్ళ బాప్తిస్మము పొందవలెను (అపో॥కార్య॥ 2:౩8), 3) ప్రార్ధింపవలెను (అపో॥కార్య॥ 1:14), 4) కనిపెట్టవలెను (అపో॥కార్య॥ 1:4), 5) విశ్వసింపవలెను (గలతీ. 3:13-14; మార్కు 12:24).

39. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎవరెవరికి?

జవాబు:- 1) పేతురు ప్రసంగము విన్నవారికి (అపో॥ 2:39), 2) వారి పిల్లలకు, 3) దూరస్తులందరికి (అపో॥ 2:39), 4) సర్వ జనులకు (యోవేలు 2:28), 5) పనివారికి, 6) పనికత్తెలకు (యోవేలు 2:29) అని పేతురు చెప్పిన మాటవల్లనే తెలియుచున్నది. మీరు ఏ జాబితాలో లేకపోయినను, సర్వజనుల జాబితాలో ఉన్నారుకదా! మీకింకా సందేహమెందుకు?

40. ప్రశ్న :- ఓ దేవా! నీ పరిశుద్ధాత్మను దయచేయుము అనియు, ఓ పరిశుద్ధాత్మా! మాలోనికి దిగిరమ్మనియు కొందరు ప్రార్ధించుట విన్నాను. ఇదివరకే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చియుండలేదా? ఈ ప్రార్ధన సరిగా ఉన్నదా?

జవాబు:- పరిశుద్ధాత్మను గోరుము (248) పరిశుద్ధాత్ముడ దేవా ప్రభువా! నీ కరుణ మాపైన వర్షింపుమయ్య (244); దేవుండవైన యాత్మ రా (624) రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా! రమ్ము రమ్ము (245) ఈ మొదలైన మన కీర్తన పుస్తకములోనికి కీర్తనలలో ఉన్న భావము పరిశుద్ధాత్మను పిలుచుటయే. ఇవెందుకు పాడుచున్నాము?