విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(81-85)
81. ప్రశ్న :- పిశాచికూడ ప్రవేశించును. ఆ మాటేచాలా భయంకరమైనమాట. ఏలాగు మరి?
జవాబు:-
- 1) ఇతరులకు అభ్యంతరము కలిగించ కూడదు (రోమా. 14:18).
- 2) “ప్రియులారా! అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళల్లియున్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనదికాదు. దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా! మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు. వారు లోకసంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును.దేవుని సంబంధికానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలిసికొనుచున్నాము (1యోహాను. 4:1-6).
- 3. “అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును, దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు” (1తిమోతి. 4:1).
82. ప్రశ్న :- కూటములలో దయ్యము చేష్టలు కనిపించిన వెళ్ళడమెందుకు?
జవాబు:- నీకు అట్టి అనుమానమున్న యెడల వెళ్ళకుము. నీ గదిలోనే ఉండి ఆత్మకొరకు ప్రార్ధించుము. ఇదీచేయక, అదిచేయక మధ్య, మార్గమున ఉన్న ఏలాగు?
83. ప్రశ్న :- స్త్రీలును, పురుషులును కూటము చేసికొందురు. ఇది ఆక్షేపణకాదా?
జవాబు:-
- ఎ) పెంతెకొస్తు రోజున, కూడుకొనిన మొదటి క్రైస్తవులు స్త్రీలును, పురుషులును కారా?
- బి) మన సంఘములో జరిగే ఆదివార ఆరాధనలకును, ఆదివారపు బడులకును, పండుగరోజున జరిగే ఆరాధనలకును, పండుగలకు సంబంధించిన ఆటపాటలకును, మత విషయములు ధ్యానించుటకై ఊరిబైట చేసే కూటములకును స్త్రీలును, పురుషులును వెళ్ళుటలేదా? పగలు మాత్రమే కాదు, రాత్రులుకూడ వెళ్ళుటలేదా? సువార్త పనిమీద స్త్రీలు, పురుషులు పొరుగు ఊరులకు వెళ్ళి కొన్ని రోజులు రేయింబగళ్లు బోధ పని చేయుటలేదా? వాటికి లేని ఆక్షేపణ వీటికేనా వచ్చినది! ఆక్షేపించిన అన్నీ ఆక్షేపణలే అగును.
84. ప్రశ్న :- పూర్వము గాలి, ధ్వనియు, అగ్నియు కలిగెను. ఇప్పుడెందుకు కలుగుటలేదు?
జవాబు:- ఇప్పుడును కొందరికి కలుగుచున్నది. తెలియకపోతే కలుగుటలేదనకూడదు.
85. ప్రశ్న :- అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ మొదలైన పశ్చిమ ఖండ దేశములలోకూడ భాషల కూటములున్నవనియు, ఆ కూటములు పిశాచి ప్రేరేపణచేతనే జరిగినవనియు, భక్తుల ప్రార్ధనలవల్ల ఆ కూటస్థులు బాగుపడిరనియు చెప్పుచున్నారు ఇదేమి?
జవాబు:- దైవభక్తులు వ్రాసినారు గనుక నిజమని నమ్మవలసినదే. చెడిపోవువారు భాషల కూటములోనే చెడిపోవు చున్నారా ఏమి? ఇతర కూటములలో చెడిపోవుట లేదా? చెడిపోవుటనేది ప్రతి స్థలమందు ఉన్నది. క్రీస్తు ప్రభువు ఏర్పరచిన వారిలో ఒకడు చెడలేదా? అంత మాత్రమున ఆయన దేవుడు కాకపోవునా?