విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(91-95)
91. ప్రశ్న :- భాషలు మాటలాడిన కొరింధీయులను పౌలు గద్దించెను గదా! (1కొరింథి. 14వ అధ్యాయము.
జవాబు:- అందుకు గద్దించలేదు. భాష సరిగా వాడనందున గద్దించెను. నేను మాటలాడుచున్నానని చెప్పుటవల్ల బాగా వాడండని సలహా ఇన్తున్నాడు. తన్ను పోలి నడుచుకొనవలెనని పౌలు వ్రాయలేదా? (1కొరింథి. 11:1).
92. ప్రశ్న :- భాష దయచేయుమని ప్రార్థించుచు, ప్రార్ధనలో వృధాగా సమయము గడుపుచు, భాషకంటె ముఖ్యమైన పనులు నిర్లక్ష్య పెట్టుట న్యాయమా?
జవాబు:- బైబిలులో నున్న భాషలను స్వల్పముగా ఎంచుట ఎట్లు లోపమో, దిన కృత్యములు స్వల్పముగా నెంచుట కూడ అంతే లోపమే.
93. ప్రశ్న :- ప్రవచించువాడు శ్రేష్టుడనియున్నది గనుక భాష మాటలాడువాడు శ్రేష్టుడు కాదనియె గదా అర్ధము!
జవాబు:- కాదు. భాషలు మాటలాడువాడు శ్రేష్టుడని యర్థము. సంఘము క్షేమాభివృద్ధిపొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్ధము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్టుడు (1కొరింథి. 14:15). ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్న్మించితేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని ప్రభువు (యోహాను 3:5)లో చెప్పినది ఎట్లు అర్ధము చేసికొందురు? ప్రవేశింపలేడని ఆ చివరి మాట పట్టుకొని అర్ధము చెప్పగలరా? జన్మించితే ప్రవేశించునని గదా అర్ధము చెప్పుదురు. అలాగే భాష వచ్చి దాని అర్ధము చెప్పువాడు, ప్రవచించువానికంటె శ్రేష్టుడే అని అర్ధము. వెరొకర్థమెట్లు చెప్పగలము?
94ప్రశ్న :- “భాషలైనను నిలిచిపోవును” అని 1కొరింథి. 13:8లో ఉన్నది. అపోస్తలుల కాలములో ఇవి మాట్లాడిరి. అప్పటినుండి ఇప్పటివరకు ఎవరును మాట్లాడుట లేదు. గనుక ఇది ప్రయత్నము చేసినను రాదు. ఆగిపోయినది ఎట్లు వచ్చును? ఆగిపోవును అనే ప్రవచనము నెరవేరవద్దా?
జవాబు:- సంఘ చరిత్రలో అప్పుడప్పుడు, అక్కడక్కడ కొందరు మాట్లాడిరిగాని సంఘమంతయు మాట్లాడలేదు. ఎందుకంటే భాషావరము అందరు అంగీకరింపలేదు, గనుక ఆగిపోయినది. దేవుడు ఇవ్వనందువల్ల ఆగిపోలేదు. మనిషి నమ్మనందువల్ల ఆగిపోయినది. ఇది అంతా ఎందుకు? ఈ ప్రశ్నవేసే మీకు రాలేదు గనుక మీ విషయములోనే “ఆగింది. ఆగిపోవునని ఉన్నందున” నేను ప్రయత్నము చేసినను రాదు, గనుక నేను ప్రయత్నము చేయనని ఊరుకొనుటవల్ల ఆగిపోతుంది. గనుక పౌలుయొక్క ప్రవచనము మీలో నెరవేరినది నమ్మినవారిలో నెరవేరనిదైయున్నది. భాషావరము కలిగియుండవలెననేది సంఘముయొక్క సిద్ధాంతములలో లేదుగాని సంఘములోని కొంతమంది అనుభవములలోను, సిద్ధాంతములలో ఉన్నది. సంఘములో మాత్రము ఆగిపోయినది. భాష వచ్చిన నేనుకూడ వాడకపోతే నాలోకూడ ఆగిపోవును.
95. ప్రశ్న :- (మార్కు 16:17,18) ఈ భాగములను మార్కువ్రాయలేదనియు, ఎవరో చేర్చినారనియు, అది సందర్భము లేకుండ చేరినదనియు, కొందరు వ్యాఖ్యానకర్తలు వ్రాయుచున్నారు. ఈ వ్రాతలోనేగదా భాష మాటలాడుదురని యున్నది. మార్కు వ్రాయనిది ఎట్లు నమ్మగలము అని అనుచున్నారు. దీనికేమందురు?
జవాబు:-
- ఎ) మోషే వ్రాసిన ద్వితియోపదేశకాండములో చివరి అధ్యాయములో మోషే మరణమును గురించి యున్నది గదా! చనిపోయిన మోషే ఏలాగు వ్రాసినాడు? యెహోషువా ఆ అధ్యాయము చేర్చియుండునని సామాన్యభిప్రాయము
- బి) యోహాను 20 అధ్యాయములోని చివరి మాటలు చూడగా గ్రంథము ముగించినట్లు కనబడుచున్నది. అయితే 21వ అధ్యాయము తర్వాత చేర్చినది. ద్వితీ. 34ను, ఈ యోహాను 21ని బైబిలులోనుండి తీసివేయవలెనా? ఇవి మోషేయును, యోహాను వ్రాయకపోతే మరెవరైనా వ్రాసి ఉండరా? వారు మాత్రము ఆత్మవేశముగలవారు కారా? (సువార్తికులే వ్రాసిరని నా నమ్మిక).