విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(21-25)
21. ప్రశ్న :- పరిశుద్ధాత్మ నొందినవారు ఈ భూలోక భాషలలో ఏమని బోధించిరి?
జవాబు:- “దేవుని గొప్ప కార్యములను వివరించిరి” (అపో॥కార్య॥ 2:11).
22. ప్రశ్న :- అయితే ఈ సంగతి చూచి అందరు హర్షించిరా?
జవాబు:- లేదు, కొందరు అపవాస్యము చేసిరి (అపో॥కార్య॥ 2:18).
23. ప్రశ్న :- ఏమని అపహసించిరి?
జవాబు:- క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి (అపో॥కార్య॥ 2:13).
24. ప్రశ్న:- దీనికి ఆ నూట ఇరువదిమంది సమాధానము చెప్పలేదా?
జవాబు:- సమాధానము చెప్పిరి. వారిలో ముఖ్యుడగు పేతురు చెప్పిన సమాధానము బైబిలులో ఒక గొప్ప ప్రసంగముగా అమరియున్నది (అపో॥కార్య॥ 2:14-40).
25. ప్రశ్న :- ఆ ప్రసంగములో కొన్ని ముఖ్యమైన సంగతులేవి?
జవాబు:-
- 1) శిష్యులు మత్తులు కారని చెప్పిన సంగతి: “అయితే పేతురు ఆ పదునొకరితో కూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుష్యులారా! యెరూషలేములో కాపురమున్న సమస్తజనులారా! ఇది మీకు తెలియుగాక. చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులుకారు (అపో॥కార్య॥ 2:14-15).
- 2) వారు ఆత్మ కుమ్మరింపు పొందిరని చెప్పిన సంగతి: “యోవేలు ప్రవక్తద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను, నా దాసురాండ్రమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.” (అపో॥కార్య॥ 2:16-18).
- 3) క్రీస్తుప్రభువు అద్భుతములు చేసెననియు, ఆయనను యూదులు చంపిరనియు, ఆయన బ్రతికి లేచెననియు చెప్పిన సంగతి : “ఇశ్రాయేలీయులారా! ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను, మహత్మార్యములను, సూచనక్రియలను మీమధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పు పొందినవానిగా కనుపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను, మీరు దుష్టులచేత సిలువవేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు నివారణచేసి ఆయనను లేపెను. ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడును నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను. నా నాలుక ఆనందించెను. మరియు నా శరీరముకూడ నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీవు నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి. నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు.” (అపో॥కార్య॥ 2:22-28).
- 4) క్రీస్తు ప్రభువు పరలోకమునకు వెళ్ళినని చెప్పిన సంగతి : ఆయన దేవుని కుడిపార్వమునకు హెచ్చింపబడెను (అపో॥కార్య॥ 2:33). “నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీఠముగా ఉంచు పర్యంతము నీవు నా కుడిపార్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను (అపో॥కార్య॥ 2:35).
- 5) క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మను కుమ్మరించెదనని చెప్పిన సంగతి : ఆయన దేవుని కుడిపార్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్ధానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించియున్నాడు (కార్య. 2:33),
- 6) యేసుప్రభువును దేవుడు ప్రభువుగాను, క్రీన్తుగాను నియమించిన సంగతి : "మీరు సిలువవేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను" (అపో॥కార్య॥ 2:37).