ప్రాధేయత
- 1. సంఘాధ్యక్షులారా! అధికారులారా! కాపరులారా! పెద్దలారా! సంఘస్తులందరు మీ స్వాధీనములోనున్నారు. వారికి కొత్త సంగతులు చెప్పగల తరుణము వారమునకొకమారైన మీకు దొరుకును. గనుక మీ అధికారస్థితిని సద్వినియోగపరచుకొనుచు ఈ పుస్తక వార్త అందించుడనియు; మన అధికారియగు పరిశుద్ధాత్మకు వశమై, ఆయనవల్ల సత్యమును ప్రత్యేకమైన రీతిగా నేర్చుకొని అధికారముగల వానివలె బోధించి, ప్రజలలో ఆశ్చర్యము గలిగించిన యేసుక్రీస్తు ప్రభువువలె బోధించుడనియు; మత్తయి. 7:29; లూకా. 4:32లోని వాక్యములను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను.
- 2. స్నేహితులారా! మీరు ఏదోయెక మంచి విషయములో నాకు స్నేహితులైయున్న ప్రకారము ఈ విషయములో కూడ స్నేహితులై, నేను నేర్చుకొన్నట్లు మీరును నేర్చుకొనుడనియు, మీరు నా స్నేహితులని యేసుప్రభువు ఎవరిని గురించి చెప్పెనో (యోహాను. 15:4-5), ఆ ఆదిశిష్యులు ఆత్మనొందిన పిమ్మట మరింత గొప్ప స్నేహితులుగా మారినట్లు మీరును మరింత గొప్ప స్నేహితులుగా మారునట్లు; నేర్చుకొని అవలంభించుడనియు; మన స్నేహితులందరికి ఈ ఆత్మ వార్తను సంభాషణ రూపముగా స్నేహ భావముతో చెప్పుడనియు మిమ్మును స్నేహమునుబట్టి ప్రార్థించుచున్నాను (యోహాను. 15:14-15).
- 3. స్వజనులారా! వంశము ననుసరించి మీరు నాకు స్వజనులైయున్న ప్రకారము విశ్వాసవారసత్వము కలిగిన సంఘము ననుసరించి కూడ మీరు నాకు స్వజనులుగా మారునట్లు, ఇది నేర్చుకొని మన వారికి ప్రకటించుడని స్వతంత్రమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను.
- 4. చదువరులారా! మీరీపుస్తకమును పూర్తిగా చదివే చదువరులైయుండి, బైబిలులో మనవారు విడిచిపెట్టిన ఆత్మ స్నానమును గురించికూడ చదివే చదువరులై యుండుడనియు; అన్ని గ్రంథములు చదివి బైబిలు చదువనివారును, ఈ అంశము చదువనివారును పూర్ణ చదువరులుకారు గనుక, చదువరులైన మీరు అట్టివారై యుండక, పూర్ణచదువరులై యుండుడనియు; మీరు చదివినవి చదువుకొనేవారందరిచేత చదివించుడనియు; మీరును, వారును చదివినవి అనుభవించుడనియు మీకు వ్రాతమూలముగా విన్నవించుకొనుచున్నాను.
- 5. ఈ బోధ ఇష్టములేనివారలారా! మిమ్ము అందరికంటె ఎక్కువగా బ్రతిమాలుకొనుచున్నాను.
"వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ"
ఇది చదవడం మీకిష్టము లేకపోయినను, అవలంభించడం అసలే ఇష్టము లేకపోయినను, సంగతి తెలుసుకొనేటందుకైనను చదువండి. ఇదివరకే ఈ సంగతి విన్నాము అని అంటారేమో! సరే, అలాగైతే ఈ అంశమును గురించి ఎట్లు వ్రాసితినో అది మీకు కొత్తదో, కాదో గుర్తు పట్టుకొంటూ చదువండని నా మనవి. నా మనవి కొట్టివేయకండి. మా పత్రికలిదివరకు నేలను పారవేసినవారు, చింపివేసినవారు లేకపోలేదు. తెలియక వారట్లుచేసిరి. దేవుడు వారిని క్షమించుగాక. కోపతాపములకును, ద్వేషభాషలకును, ఖండన స్వభావములకును చోటియ్యని శాంతి మనస్సును త్రిత్వ తండ్రి మనయందరకును అనుగ్రహించునుగాక! నాకు తప్పులుగా తోచని తప్పులిందులో ఉంటే క్షమించుమని నేను ప్రభువును ప్రార్థించితిని. సమస్తమును ఆయనే దిద్దుబాటు చేయునుగాక! ఆయనకే మహిమ. ఆమేన్.
ధవళేశ్వరము,
తూర్పుగోదావరిజిల్లా. ఇట్లు విధేయ సహోదరుడు
N.D. ఫిలిప్ సన్