విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(41-45)
41. ప్రశ్న :- పరిశుద్ధాత్మ కూటములు చేయువారిని తిరస్కరిస్తే హానియని చెప్పుచున్నారు. పరిశుద్ధాత్మ హాని చేయువాడా?
జవాబు:- నీవు మనుష్యులతో కాదు. దేవునితోనే అబద్ధమాడితివి అని పేతురు అననీయతో చెప్పెను. అతడు ఈ మాటలు వినుచు నేలపడి ప్రాణము విడిచెను. పరిశుద్ధాత్మ చంపెనా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన పేతురు చంపెనా? అతని దుర్గుణమె అతని చంపెను (అపో॥ 5అధ్యా॥) మునికోలను తన్నువానిని మునికోల గుచ్చినదని అందువా?
42. ప్రశ్న :- అపోస్తలుల కాలపవువారు పొందిన పరిశుద్ధాత్మ బాప్తిస్నమును ఇప్పటివారు పొందుచున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఒకటేనా ఏమి?
జవాబు:- మనము పొందుచున్న నీటిబాప్తిస్మమును ఆది సంఘస్తులు పొందిన నీటిబాప్తిస్మము ఒకటేనా ఏమి? అని అడిగినట్టున్నది మీ ప్రశ్న
43. ప్రశ్న :- మనమందరము భాషలతో మాటలాడవలెనా?
జవాబు:- అవును “వీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను” అని పౌలు వ్రాయుచున్నాడు (కొరింథి. 14:5).
44. ప్రశ్న :- భాషావరము అంత ముఖ్యమైన వరము కాదు గనుకనే ఆత్మవరముల జాబితాలో దానిని కృతజ్ఞతా స్తుతుల చివర చేర్చినాడని కొందరనుచున్నారు. దీనికేమి ఉత్తరము కలదు?
జవాబు:- వచ్చిన వరములలో భాషావరము చివర వచ్చిన వరము గనుక చివర ఉదహరింపబడినది (1కొరింథి. 12:4-12) 1తిమోతి. 2:2లో ఒక జాబితా ఉన్నది. (ఎ) విజ్ఞాపనలు, (బి) ప్రార్ధనలు (సి) యాచనలు, (డి) కృతజ్ఞతా స్తుతులు; కృతజ్ఞతాస్తుతులు అని చివర ఉన్నందున అవి అముఖ్యములా? 1కొరింథి. 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని ఉన్నది. ప్రేమ అనుమాట జాబితాలో చివర ఉన్నందున ప్రేమ అముఖ్యమైనదని మీరనగలరా? లేక జాబితాలో చివర ఉన్న "ప్రేమ అనునది శ్రేష్టమైనది" అని పౌలు చెప్పినమాట సరికాదు అని మీరందురా?
45. ప్రశ్న :- భాషలతో మాటలాడుటను గురించి మరెక్కడనైన ఉన్నదా?
జవాబు:- ఉన్నది. నమ్మినవానివలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. క్రొత్త భాషలు మాట్లాడుదురని ప్రభువు చెప్పెను (మార్కు 16:17).