బైబిలు అద్దము
బైబిలు అనగా పుస్తకమని అర్ధము. అనగా లోకములోని గ్రంథములన్నిటిలో గొప్ప గ్రంథమని అర్ధమిచ్చు బిబ్లాస్ అను గ్రీకు పదమునుండి 'బైబిలు' అను పేరు వచ్చినది. ఇది దైవాత్మ ప్రేరణ వలన వ్రాయబడిన గ్రంధము గనుక అన్ని గ్రంధములకంటె ఇది గొప్ప గ్రంధమని, 'బైబిలు' అనుపేరులోనే తెలియుచున్నది. ఆదియందు దేవుడు సృష్టిని మానవులను, లోకములోని సమస్తమును ఎట్లు సృజించెనో, ఆ పిమ్మట మానవునిలోనికి పాపము ఎట్లు ప్రవేశించెనో, పాపమునుండి నరులను రక్షించుటకు, దేవుడు ఎట్లు వాగ్ధానము వినిపించెనో, దానిని నెరవేర్చుటకు దేవుడు తన పనినెట్లు చేయుచు వచ్చెనో, ఇది పాపము, ఇది పవిత్రము అని ఎట్లు బోధించెనో, పాపము ఎట్లు వదిలించు కొనవలెనో, దేవుడిచ్చునవి ఎట్లు పుచ్చుకొనవలెనో, బైబిలు చెప్పుచున్నది.
మన పాపములు ఏ రీతిని పరిహరింపబడునో బైబిలులో నున్నది. పాపములను జయించు శక్తి ఏలాగు పొందగలమో బైబిలులో వివరించబడినది. దేవునిని ఏలాగు నమ్మవలెనో, నీతిగా ఎట్లు నడచుకొనవచ్చునో, పాపకారకుడైన సాతానును ఏలాగు ఓడించగలమో బైబిలు తెలియ జేయుచున్నది. గనుక ఈ బైబిలు గ్రంధమును అద్దము అనవచ్చును. అద్దము ఏరీతిని మానవుని బహిరంగ స్థితిని చూపించునో, ఆలాగుననే బైబిలు అనే అద్దముకూడ మానవుని అంతరంగ స్థితిని చక్కగా చూపించుచుండును. ఈ బైబిలు అద్దమును చూచి మానవుడు తన బ్రతుకును సరిచేసికొన్నవో మోక్షరాజ్యములో ప్రవేశించి, మహిమ జీవనమునకు వారసుడగును. ఈలాగున మానవుడు తన్నుతాను దిద్దుకొనుటకు, ఈ బైబిలు అద్దము చూపించుచున్న కొన్ని సంగతులు:
- దేవునికి విరోధమైన తప్పిదములు: దేవుని విషయములో తప్పు అభిప్రాయములు కలిగియుండుట, దేవుని మీద విసుగుకొనుట మొదలైనవి.
- నీకు విరోధమైన తప్పిదములు: అనగా శరీరమునకు, ఆత్మ జీవనమునకు, శరీర జీవమునకు హాని తెచ్చు తప్పిదములు.
- దేవదూతలకు విరోధమైన తప్పిదములు: అనగా దేవదూతల సహాయము నాకేమి కనబడుట లేదనుకొనుట.
- నరులకు విరోధములైన తప్పిదములు: శత్రువులను ప్రేమింపకుండుట, వారికొరకు ప్రార్ధింపకుండుట.
- జీవరాసులకు విరోధములైన తప్పిదములు: జీవరాసులను నిర్దయగా చూచుట.
- వస్తువులకు విరోధములైన తప్పిదములు: అనగా సామానులను, సరుకులను దుర్వినియోగపరచునట్టి తప్పిదములు.
- తలంపు, చూపు, వినికి, మాట, ప్రయత్నము, క్రియ, స్వప్నములలోని కళంకము.
- ధర్మగుణము లేకుండుట: అనగా బీదలను కనిపెట్టకుండుట, వారు సహాయము కోరునప్పుడు ఇయ్యకపోవుట, ధర్మకార్యములకు చందాలియ్యక పోవుట.
- సోమరి తనము: అనగా కష్టపడి పనిచేయని గుణము, పనిచేయవలసి వచ్చినను బద్దకించుట, ఒకరిపాటు మీద బ్రతుకవలెనని చూచుట.
- జబ్బుచేసినపుడు బాగుచేసికొనక నిర్లక్ష్యముగా నుండుట, కోపగించి గాని, నిరాశవలన గాని తిండి మానుట, చావు త్వరగా వస్తే బాగుండును అని తలంచుట, శరీరము శుద్ధిగా నుంచుకొనకుండుట, అపవిత్ర జీవనము వలన అకాల మరణమొందుట.
- భార్య భర్తలలో నమాధానము లేకుందుట: మనస్పర్ధలకు సందున్నను సఖ్యత లేకుండుట, క్షమించు నైజము లేకుండుట, యౌవ్వనకాల అపవిత్రత కలిగియుండుట.
- అబద్ధమాడుట: అనగా అబద్ధమును నిజమును కలిపి చెప్పుట. పంచాయితీలలో, కోర్టులలో అబద్ద సాక్ష్యము పలుకుట.
- ద్వందార్థములు: అనగా మోసము చేయవలెనని, అబద్ధమాడవలెనని, రెండు అర్థములు ఇచ్చే మాటలు మాట్లాడుట.
- అప్పులు తీర్చెదనని జరుపుట, తీర్చకుండుట
- అసూయ: అనగా నీకంటె ఎక్కువ కలిమిగల వారిని, గొప్ప ఉద్యోగములు గలవారిని, నీకు లేని వరములు గలవారిని చూచి మనస్సులో కష్టము కలిగియుండుట.
- లేనిపోని ఊహలు, అనవసరమైన తలంపులు.
- దురాశ: అనగా ఒకరి ఆస్థిలో దేనినైనను ఆశించుట.
- సందేహము: అనగా అవిశ్వాసము, వెనుకాడుట, అది నిజమా అనుకొనుట, అనగా మోక్షము, నరకములు ఉండుట నిజమా అనుకొని, సందేహము కలిగియుండుట.
- అనిశ్చయము: బైబిలులోని సంగతులు అందరు అన్ని విధములుగా బోధించు చున్నందున, ఎవరిబోధ నిజమో నిశ్చయము తెలియని స్థితి కలిగియుండుట.
- అతిశయము: గర్వము, బడాయి, గొప్పతనము కోరుకొనుట, నరుల మెప్పుకోరుట.
- భయము: అనగా దిగులు, బెదురు. పాము, జెర్రి, పులి, హానిచేసే మనిషి విరోధముగా మాట్లాడే మనిషి తారసిల్లినపుడెల్ల జంకుట, భయపడుట; చెడు కలలు తప్పుడు దర్శనములు, నింద మాటలు వచ్చినప్పుడు భయపడుట; దుశ్శకునములు, సోదె చెప్పువారి మాటలు, మంత్రగాండ్ర మాటలు శపించు వారి మాటలు మొదలైనవి విని భయము కలిగియుండుట.
- చింత: అది నెరవేరలేదు. ఇది నెరవేరలేదు అనే చింత.
- అధైర్యము: అనగా నిరాశ.
- పేద అరువులు: అదిలేదు, ఇదిలేదు అని; దానికి కొరత, దీనికి కొరత అని అనుకొనుట; తృప్తి లేకపోవుట.
- నిష్కారణ కోపము: చిరచిరలాడుట, కారణము లేకుండా కోపపడుట.
- మందస్థితి కలిగియుండుట: మతబోధ విన్నప్పుడు పాపస్థితిని తెలిసికొనియు నిర్లక్ష్యముగా నుండుట; పాపమువలన కష్టములు, మరణము, నరకము అని విన్నప్పటికిని లెక్కలేకుండా ఉండుట; ఎన్ని బోధలు విన్న మారకుండుట; మోక్షములో మహిమయున్నదని వినినను ఆశలేకుండుట.
- కృపను లోకువగట్టుట: అనగా ఎన్ని తప్పులు చేసినను, దేవుడు క్షమించును గదా అని అనుకొని విచ్చలవిడిగా తిరుగుట.
- నెరవేర్చవలసిన విధులను నెరవేర్చకుండుట.
- పొందిన మేలును గుర్తెరిగియు, ఉపకారులను మరచుట; దేవుని యెడల కృతజ్ఞత లేకుండుట.
- మర్యాద చేయకపోవుట: మనకంటె పెద్దవారై యున్నవారిని గౌరవముగా చూడకుండుట, సంఘాధికారులను మన్నన చేయకుండుట (చేయలేకపోవుట).
ఈలాగున, పై బలహీనతలన్నిటినీ ఈ బైబిలు అద్దములో చూచుకొని, సరిచేసికొని, మహిమ జీవనములో స్థిరపడు ధన్యత పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు మీకు దయచేయునుగాక! ఆమేన్ .