నైజ పాపము
నైజపాపము అనగా తలంపులోని పాపము అని చెప్పవచ్చును. ఒక
చెడు తలంపు మనస్సులోనికి ప్రవేశించినపుడు, దానిని వెంటనే గెంటివేయనిచో, అది బలపడి నైజముగా తయారగును. దానిని పాపనైజముగా భావించవచ్చును.
మానవ నైజములో ఉన్న పాపపు తలంపు, ముందుగా మనస్సును లొంగదీసుకొని, ఆ తర్వాత నెమ్మదిగా శరీరమును కూడ లోపరచుకొనుచుండును. అప్పుడు ఆ నైజపాపము క్రియారూపకముగా బహిర్గతమగుచుండును. చెడు తలంపు మనస్సులో ఉన్నప్పుడు అది నైజముగాను, ఆ తలంపు క్రియలోనికి వచ్చినపుడు అది బహిరంగ పాపముగాను గ్రహించుకొనవచ్చును. బహిరంగ పాపమును అనగా క్రియా పాపమును జయించుట సులువే గాని ఈ మనో పాపమును అనగా నైజపాపమును జయించుటకు బహుగా ప్రయాస పడవలెను. పాపపు పుండు మానినా, పాప నైజము అను మచ్చ మాత్రము మానదు. ఈ నైజపాపము మానవుని ఆత్మను పట్టి దాని జీవమును పీల్చి వేయుచుండును. గనుక దర్శన బోజనము అనగా ప్రభువే స్వయముగా అందించు ఆయన శరీర రక్తములను భుజించి, దీనిని పరిపూర్ణముగా పెరికి వేసికొనవలెను. ఈ క్రింది అంశములు నైజ పాపముయొక్క వివిధ స్థితిగతులను మరింతగా విపులీకరించును.
- నైజపాపము యున్నప్పుడు మోక్షమునకు వెళ్ళవచ్చునా? తప్పు నుండి తప్పుకొంటే మోక్షమునకు వెళ్ళవచ్చును.
- యేసు ప్రభువు ఎప్పుడును జంకలేదు. మనము అనేక మారులు భయపడు చున్నాము. అదే నైజపాపము.
- గుడిలో పాదిరిగారు ఇచ్చే సంస్కార భోజనము వలన పాప పరిహారము కలుగుచున్నది, శరీరాత్మలకు మేలు కలుగుచున్నది. అయినప్పటికినీ నైజము, పాషనైజము ఉండి పోవును. అందుచేతనే బయటికి వచ్చినప్పుడు ఏదో ఒక కాని తలంపు జ్ఞాపకమునకు వచ్చును లేదా పరిహారమైన పాపమే జ్ఞాపకము వచ్చును. అదే నైజపాపము.
- ప్రార్ధన నెరవేరనప్పుడు గాని, ఆలస్యముగా నెరవేరినా గాని, దేవుడు నా ప్రార్ధన ఆలకించలేదు అని మనసులో అనుకొనుట నైజపాపము. ఎందుకనిన, నీవు మొదటిసారి ప్రార్ధన చేసినప్పుడు సంపూర్ణమైన నమ్మిక కలిగినది. ఇప్పుడు అది పోయినది. అదే నైజపాపము.
- పాపమును జయించినాను, అయినా మరలా పడిపోవుదునేమో అని అనుకొనుట నైజపాపము. ఎందుకనిన, క్రొత్త పాపశోధన ఇంకా రానే లేదు, రాకముందే పడిపోవుట తలంపులోనికి వచ్చినది. అదే నైజపాపము.
-
"జీవితకాలమంతయు భక్తిగా నడిచాను, నేను తప్పకుండా మోక్షమునకు వెళ్ళెదను" అను నిశ్చయత చేసికొని, స్వస్నములోగాని, దర్శనములోగాని ప్రభువు చెప్పటము వినికూడా, మరణ సమయమందు అనుమానము కలుగును. అదే నైజపాపము.
ఉదా: బిషప్ బట్లరు అనే ఆయన క్రీస్తుయొక్క దైవత్వము గురించి అనేక సంగతులు వ్రాసినాడు. గాని మరణ సమయమందు "నేను వృధాగా కష్టపడ్డాను. క్రీస్తు అనే ఆయన ఉన్నాడో లేడో నేను ఇప్పుడు చనిపోతే ఎక్సుడికి పోతానో తెలియదు" అని అనుకొని నిరాశలో ఉన్నాడు. ఈయన వ్రాసిన పుస్తకములు అనేకమంది చదివి, అనేకమంది విశ్వాసులైరి. అయితే ఆయన నిరాశలో ఉన్నప్పుడు, ఆయన శిష్యుడగు ఒక పాదిరిగారు వచ్చి విచారపడి, మోమాటము లేకుండ గద్దించినాడు. "అయ్యా! మీరు ఇప్పుడు నరకమునకు వెళ్ళిపోతారు, అది మాకు తప్పదు. మాకు ఇంత గొప్ప వరమిచ్చిన దేవుడు నిన్ను కఠినముగా శిక్షించును, మీరు తప్పించుకొనలేరు, మీరు పిశాచియొక్క వశము అగుదురు. మా అందరికి బోధ చేసి, మీరే గోతిలో పడిపోయినారు. మాకు మోక్షము, నీకు నరకము" అని చెప్పినాడు. అప్పుడు ఆయన మారుమనస్సుపొంది, చనిపోయి మోక్షమునకు వెళ్ళిపోను. అనుమానమే పాపనైజము. "ఈ భక్తుడు పరలోకమునకు వెళ్ళిపోవుచున్నాడు నాకు దొరకడు అని" మిక్కిలి వాడిగల బాణమువేసి చూస్తాడు. - రాకడలో యున్నవారికి ఈ సందేహము రాకమానదు, ఇదే నైజపాపము. రాకడలో సిద్ధపడే వారికి ఈ శోధన తప్పదు. అయితే ప్రార్థన ద్వారా దీనిని తప్పించుకొన వచ్చును. దైవ ప్రార్థనే అన్నిటికి విరుగుడు. ప్రార్ధన అనగా ప్రార్ధనమెట్లు ప్రకారము చేయుటయే.
- పాప పరిహారము కొరకు గుడిలో ఇచ్చే భోజనము మనము పుచ్చుకొని, ఇంటికి వెళ్ళిన తరువాత కూడ పాప ఆలోచనలు, పాప జ్జప్తి వచ్చును. అదే నైజపాపము.
- ఈ నైజపాపము తీసివేయుటకే ఆయన కనబడును, దర్శన భోజన మిచ్చును. మీరు ప్రభు భోజనము గుడిలో పుచ్చుకొన్నారు, పాప పరిహారము కలిగినది, ఇంటికి వస్తారు, పాత పాపము జ్ఞాపకము వచ్చును. అదే నైజ పాపము.
-
ఏమి! ఈ నైజము, ఇదేమో అని ఎపుడైనా, దీనిని గూర్చిన భయము వచ్చిన యెడల అదే నైజ పాపము. యేసు ప్రభువు భయమును తీసివేసినాడని నమ్మి మరలా ఎందుకు భయపడటము?
షరా:- పాము ఎన్నడూ తిన్నగా ప్రాకనేరదు. వంకర వంకరగానే ప్రాకుచూ వెళ్ళును. ఇదే దాని నైజము. అది సృష్టి. అలాగే ప్రతి భక్తునిలోకూడ ఎంతో మంచి ఉన్నప్పటికినీ, వంకర తలంపు కూడ యుండును. అదే నైజము. అది సరిచేయుటకే దర్శన భోజనము (అంతరంగ సంస్కారము) కావలెను. ఇది ప్రతి దినమునూ పుచ్చుకొనవచ్చును. ఆలాగు పుచ్చుకొనే వారికి తిరస్కరణి విద్య వచ్చును. ప్రభువు ఇచ్చినాడు అని ఊహించుట వలన సంతుష్టి కలుగదు. సాక్షాత్తుగా ఆ అనుభవము కలుగవలెను. పాదిరిగారిని, రొట్టెను, ద్రాక్షారసమును చూస్తుయున్నాము గదా! ఆలాగే దర్శనములో కూడ చూస్తే సంతుష్టి, లేకపోతే నైజపాపము వృద్ధి అగును. రోజూ చూడకుండా ఊహించు కొంటే అనుమానము ఎక్కువ అవుతుంది, అదే నైజ పాపము. ఉదయమున నిన్నటి దర్శనములో నాకు స్పష్టముగా కనబడినట్టు, ఎవరికి కనబడినదో వారికి సంతుష్టి కలుగును. - మీరు యెరూషలేము పండుగకు వెళ్ళరా? అని కొందరు యేసు ప్రభువును అడిగినారు. ప్రభువు నా సమయము ఇంకా రాలేదు అని జవాబు చెప్పినారు. తరువాత సమయము వచ్చినపుడు వెళ్ళినారు. తల్లియైన మరియమ్మ ద్రాక్షారసము అయిపోయినదని చెప్పినను, "నా గడియ ఇంకా రాలేదు" అని ఆయన చెప్పినాడు. ఆ గడియ వచ్చినప్పుడు ద్రాక్షారసము చేసినాడు. ఇంత ఖచ్చితముగా గడియార ప్రకారము మనము చేయగలమా? చేయలేని యెడల అదే నైజ బలహీనత మరియు ఆయనను రాళ్ళతో చంపవలెనని శత్రువులు యత్నించినారు. అప్పుడు ఆయన, తన మరణ గడియ ఇంకా రాలేదు గనుక మెల్లగా జారిపోయినాడు. అలాగే నజరేతులో ఆయనను కొట్టటోయినపుడు, దెబ్బకు అందలేదు, జారిపోయినాడు. మనము శ్రద్ధగా నాలుగు సువార్తలు చదివితే ఈ సంగతులు కనబడును. మనకైతే జన్మపాపమున్నది. ఆయనకు లేదు. అందుచేత ఆయన నైజపాపము కూడ చేయలేదు.
షరా:- మోషే ఏలీయాలు 40 రోజులు ఉపవాసము చేసిరి. ఇశ్రాయేలీయులు 40 సం॥లు వనవాసము చేసిరి. అలాగే యేసు ప్రభువు తన ఉపవాసమునకు ఈ 40 అంకెయే ఏర్చర్చకొన్నారు.
నైజపాప నిర్మూలము:- ఇది పోవుట దుర్లభము. దర్శన భోజనము వలన కాల క్రమేణా నైజ పాపము పోవును. ఇన్నాళ్ళనుంచి, ఏ బోధకులు నైజ పాపమును గురించి గాని, దర్శన భోజనమును గురించిగాని చెప్పలేదు. ఇప్పుడు క్రొత్తగా చెప్పటము వలన అపనమ్మిక కలుగుచున్నది అని కొందరనుచున్నారు.
డాక్టర్ మార్టిన్ లూథర్ గారు మనలోని పాత ఆదాము, ప్రతి దినము మునిగి చావ వలెను; ప్రతి దినము మనలోనికి క్రొత్త ఆదాము బ్రతికి వచ్చుచుండవలెను అని చెప్పిరి.
ప్రార్ధన: ఓ తండ్రీ! నీవు మనిషిని కలుగచేసినపుడు, నైజ పరిశుద్ధత అతనిలో ఇమిడ్చినావు గాని పాపము ప్రవేశించినపుడు, ఆ నైజము చెంతను పాపనైజము మొలిచినది. అప్పటినుండి నేటివరకు మనిషిలో మంచిచెడ్డలు ఉంటూనే యున్నవి. ఆ చెడుగు, దర్శన భోజనము వలన హరించి పోవలెను. మనిషి ఎంత చెడ్డవాడైనను అతనిలో ఏదో ఒక మంచి నైజము ఉండక మానదు. అలాగే ఎంత భక్తుడైనను అతనిలో కొంచెము చెడుగైనా ఉండక మానదు. ఇది అనుదిన ప్రయత్నము వలన గతించిపోవును. ఒకవేళ కొంచెము మిగిలిన యెడల మరణ సమయమందైనా అది పోవును. అందుకే పాదురులు మరణ సమయమందు రోగికి, ప్రభుభోజనము ఇస్తూ ఉన్నారు. అతడు చనిపోయి, వెళ్ళిపోవుచున్నాడు గనుక ప్రభుభోజనము, అతని భక్తి స్థిరపడుటకు ఉపయోగము.
ప్రభువా! ఆదిని పరిశుద్ధ నైజము ఇచ్చిన నీవు, నేడు మాకును అది అనుగ్రహించుము. ఆదిని సైతాను ప్రవేశపెట్టిన పాపనైజమును పెరికివేయుము. ఆమేన్.