నమ్మకమైన సేవ - 1
"అతడు (ఆబ్రాహాము) నమ్మకమైన మననుగలవాడని (దేవుడు) ఎరిగి" (నెహెమ్యా 9:8);
"ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము" (ప్రకటన 2:20) పనిచేయుటకు అనేకములైన ఆటంకములు కలుగుచున్న వారలారా! ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా నుండుము! అని చెప్పబడిన ధన్యత మీకు కలుగును గాక. నెహెమ్యా గ్రంథములో, అబ్రాహామునుగూర్చి "నమ్మకమైన మనస్సు" గలవాడని యున్నది. ప్రకటనలో, ఆపద ఉన్నను నమ్మకముగా నుండుమని ప్రభువు స్ముర్న సంఘముతో చెప్పుచుండెను. నమ్మకమైన మనను గలవాడు, నమ్మకమైన పనిచేయలేదా? చేయగలడు. అయితే, ఆటంకము వలన చేయలేక పోవుచున్నాడు. ఒక మనిషి గంభీరమైన పనిచేయుచున్నాడు, గొప్ప పనిచేయుచున్నాడు. గాని తన మనస్సు నమ్మకమైనది కాదు. అయితే, విధులనుబట్టి చేయుచున్నాడు. ఈ రెండు తరగతుల వారున్నారు. మరియొక వరుస: దేవుడు మనలను నమ్ముట, మనము దేవుని నమ్ముట. మనమందరమును ఈ ప్రశ్న వేసికొనవలెను:
- 1) మనుష్యులు నన్ను నమ్ముచున్నారా?
- 2) ప్రభువు తన సేవలో నన్ను నమ్ముచున్నాడా?
- 1) అబ్రాహాము నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు కనిపెట్టినాడు.
- 2) మనస్సు కలిగియుండుట మాత్రమేకాదు. ప్రవర్తనలో దానిని కనుపర్చవలెను,
- 3) సేవలో కనపర్చవలెను. మన ప్రవర్తననుబట్టి నమ్మకమైన మనస్సు గలవారని ప్రజలు తెలిసికొందురు.
I.
అబ్రాహామునకు
- 1) నమ్మకమైన మనస్సు ఉన్నది.
- 2) నమ్మకమైన క్రియ ఉన్నది.
- ౩) నమ్మకమైన ప్రవర్తన ఉన్నది.
II.
దోతాను దగ్గర యోసేపు అన్నలున్నారు. వారు గొర్రెలను మేపుచున్నారు. అక్కడ అన్నలు యోసేపును గుంటలో పడవేసి, అన్నము తినుచున్నారు. పదిమంది చేతులలో యోసేపు ఉన్నాడు. వారి తండ్రియైన యాకోబు, ఆ పదిమంది కుమారులకు యోసేపును అప్పగించెను. వారేమిచేసినారు? గోతిలో పడవేసినారు! మాకు ప్రభువు సంఘములు అప్పగింపవచ్చును, అన్యులను అప్పగింపవచ్చును. మీరు వారిని అమ్ముకొందురా? అన్నలు తమ్ముని అమ్ముకొన్నారు కదా! యోసేపును గోతిలోవేసి, వారు అన్నము తినుచున్నారు. మీకప్పగింపబడిన వారిని మీరేమి చేయుచున్నారు? మీకు అప్పగింపబడిన సంఘములను సరిగాచూచి, వాక్యము చెప్పినయెడల సంతోషమే. ప్రభువు మిమ్ములను నమ్మి - మా చేతులలో పెట్టిన ఆయా సంఘములలోను, పాఠశాలలలోను, గ్రామాదులలోను మీరు నమ్మకమైన సేవచేయుచున్నారా? రేపు తీర్చు దినమందు ప్రభువు అడుగును. మిమ్ములను నమ్మి మీకప్పుగించిన వాటిని ఏమిచేశారు? అని అడుగును. అబ్రాహాము నమ్మకముగా పనిచేసెను గాని అతని మునిమనుమలు అనగా, యాకోబు పదిమంది కుమారులు నమ్మకముగా పనిచేయలేదు.
ఉదా: ఒకరు ఒక కర్రను కొని కుర్చీచేయుమని, వడ్రంగిని నమ్మి ఇచ్చెను. అతనిని నమ్మి ఇచ్చినాము గనుక మంచిచేసిన అతనిదే చెడుచేసిన అతనిదే భారము. నీవు భూలోకములో జీవించినంత కాలములో, ఆయన నీకు పని ఇచ్చినాడు. నీవు నమ్మకముగా సేవచేసి ఉన్నయెడల, అంత్యదినమున ప్రభువు "భళా నమ్మకమైన మంచివాడా"! అని మెచ్చుకొనును.
బైబిలు మిషను సువార్తికుడా! నీవు నమ్మకమైన మనసు కలిగి పనిచేయుచున్నావా? నమ్మకమైన సేవ చేయుచున్నావా? "భళా నమ్మకమైన మంచి సువార్తికుడా!" అను మెప్పు రేపు వచ్చునా? ఆలోచించుకొని, నీ మనస్సాక్షికి నీవే జవాబు చెప్పుకొనుము.