నామకార్ధమనే పాపము



నామకార్థముగా చేయుట అనగా ఒకరు చేయుచున్నారని మనమును చేయుటయే. తప్పదు గనుక చేయవలెనని చేయుటయే, చేయకపోతే ఇతరులేమైన అనుకొందురేమో అని చేయుటయే. మరియు చేయకపోయిన యెడల ఎక్కడ కీడు సంభవించునో అని చేదస్తము కలిగి చేయుటయే. ఇదంతయు కలిపి నామకార్థమని చెప్పబడును. ఈ నామకము అనేది మన ప్రయాసమును, పాటును, సమయమును వృధా చేయునదై యున్నది. గనుక మెళకువగా యుండవలెను. నామకార్థముగా చేయుట అనే పాపము నేడు భూలోక కైస్తవ సంఘములో యున్నది. ఇది ఒక అపాయము, గొప్ప గండము, గొప్ప పాపశోధన, మనుష్యులు గుర్తుపట్టలేని మాయ, అనుకొనని నేరము గనుక అందరు ప్రతి దినము ఈ విషయములో జాగ్రత్తగా యుండవలెను. దీనివల్ల కలిగే ఒక నష్టము ఏదనగా మనలో ఉండే ఇతరమైన చెడుగు మనలను విడిచిపెట్టదు. మరియొక నష్టమేదనగా, ఇది ఒక చెడుగును తెచ్చిపెట్టును అనగా ఒక విషయములో ఉండే ఈ నామకము మరియొక విషయములో కూడ నామకార్థముగా ఉండునట్లు చేయును అనగా మరొక నామకమును తెచ్చిపెట్టును.


నాలుగు అనుభవ దృష్టాంతములు:

  1. మొదటి అనుభవ దృష్టాంతము: - ఒక అంశమును గురించి ప్రార్ధన ప్రారంభించినపుడు, వాడుక చొప్పున ప్రార్ధనలోని అలవాటు మాటలు బహుధారాళముగా వచ్చును. ఇవే అపాయకరమైన మాటలు. మాటలు మంచివేగాని వాటిలో నామకార్థము చేరియున్నందున అవి వృధా మాటలైనవి. కాబట్టి నామకార్ధ మనేది పోయి, యదార్ధమనునది వచ్చువరకు, ప్రార్ధన చేయకుండ కొన్ని నిమిషములు కండ్లు మూసుకొని నిశ్శబ్దముగా ఉండి, ప్రభువు తలంపు మీదనే నిలువవలెను. అంతలో నామకార్ధ మేఘములు గతించిపోవును, ప్రార్ధనవాలు ప్రవాహముగ వచ్చును. అప్పుడు మనసులో ఎడతెరిపిలేని ఆనంద సంతోషములు ప్రవాహముగా పైకి వచ్చుచూ యుండును. అప్పుడు నీ ప్రార్ధన నిజమైన ప్రార్థనయని గ్రహించుకొనవచ్చును. నీవు నీ పాపములు ఒప్పుకొని ప్రార్ధన చేసినయెడల, ఆలాగు చేయగా చేయగా, నామకార్ధ మేఘములు పూర్తిగా విడిపోవును. అంతలో మనోవేదన, కన్నీళ్ళు, వడలు (శరీరము) వణకుట, మూలుగుట, అయ్యో! నేనెంత పాపిని! అనే మాట వచ్చుట, తండ్రీ! నన్ను క్షమించుము! అనే మనవి బయలు వెడలుట; ఈ మొదలైనవి కలుగును గనుక ఇది యదార్ధమైన పాపపు టొప్పుదల ప్రార్ధన యని గ్రహించుకొనుము. మరియొక సంగతి జ్ఞాపక ముంచుకొనుము: నామకార్థ ప్రార్ధనలన్నియు, వెళ్ళితే ఇంటి కప్పువరకే వెళ్ళును. అయితే యధార్థమైన ప్రార్ధనలు నీ హృదయములో నుండి బయలుదేరి, నీ శరీరమును దాటి, నీ ఇంటి కప్పును దాటి, అక్కడనుండి మేఘములో చొరబడి, ఆ తరువాత నక్షత్ర మండలమును దాటిపోయి, పరలోకము చేరి సింహాసనము మిద కూర్చున్న దేవుని యొక్క పాదముల మీద పడిపోవును. దీనికి ఎంత చొరవ, ఎంత ధైర్యము, ఎంత చురుకుదనము, ఎంత వేగము, ఎంత ఆటంకమును జయించే కత్తివాటము ఉన్నదోగదా! ఓ చదువరీ! ఇది నేర్చుకొనుము, అలవాటు చేసికొనుము. ఇది వచ్చేవరకూ మోకాళ్ళ మీద నుండుము. అట్లున్నచో, నీ సమయము వృధాకాదు.

  2. రెండవ అనుభవ దృష్టాంతము: - నీవు బైబిలు చదువుకొనునప్పుడు నీకు చప్పగా యుండును, వినోదముగా నుండదు, ఉపయోగముగా నుండదు, మామూలు కథవలె యుండును. నిన్ను ఆదరించే ఒకవార్త అందులో నీకు కనబడదు. కారణ మేమనగా నామకార్ధ మనేది నీలోయున్నది. ఇదే కారణము గనుక ముందు, 'దేవా! ఈ నామకార్ధ శోధనను నాలోనుండి తీసివేయుము' అని ప్రార్ధించుము. అప్పుడు చదివి చూడుము. ఆ బైబిలుకథ నీకు ఒకదరి నుంచి బాగుగా తెలియుచుండును, అర్ధమగుచుండును. ఇది నా కొరకు, నాకు తగిలి వచ్చేటట్టు వ్రాయబడిన కథ అని తట్టును. అక్కడ నుండి మహా ఆనందము కలుగును, విచారమనునది ఉండనే ఉండదు. మందము, అజ్ఞానము, చప్పనితనము పూర్తిగా అంతరించి పోవును. మరియు ఒక కథ మిద నీకు, వ్యాఖ్యానములలోని కొత్త క్రొత్త తలంపులు పుట్టుచుండును. నీవు ఎంత ధన్యుడవు! మరియు బైబిలు నీ కంటికి ఒక క్రొత్త పుస్తకముగా కనిపించును. బైబిలు చదువకపోతే మార్కులు రావు అనే తలంపుతో చదివే వారికి మాత్రము, బైబిలు వినోద గ్రంథంగా కాక కేవలము కఠిన గ్రంథముగాను, నిర్ణయా గ్రంథము గాను, ద్వేషించు గ్రంథముగాను కనబడును. గనుక ఎంత జాగ్రత్తగాయుంటే అంత మంచిది. అంతే కాకుండా బైబిలు ప్రతిదినము చదివే పుస్తకము గనుక బైబిలు పఠన, చాలా మామూలై పోవును. కాబట్టి క్రొత్తగా కొనుకొన్న పుస్తకము మీదనున్న గౌరవము యుండదు. ఇది ఒక గొప్ప అపాయము. బైబిలు దేవుని గ్రంథము గనుక మనము లోకములోయున్న గ్రంథములన్నింటికంటే దీనిని గౌరవముగా ఎంచవలెను. ఎంచలేకపోతే నీలో నామకార్థము అనే బలహీనత యున్నదని గ్రహించు కొనుము. మహమ్మదీయులు, తమ ఖురాను గ్రంథమును రుమాలు క్రింద పరచి, దానిమోద వేసి చదువుకొందురు. ఖురానును ఎక్కడబడితే అక్కడ పెట్టరు, ఎవరికి బడితే వారికి ఇవ్వరు. వీరి మాదిరి మంచి మాదిరి. ఒకరిలో భక్తి యుండవచ్చును గాని అట్టి భక్తిని వాడుకొనేటందుకు, తగినంత తర్ఫీదు వారిలో లేకపోవచ్చును. ఒకరి చేతిలో బైబిలు యున్నది. అనగా అతనిలో భక్తియున్నది గనుకనే అతను బైబిలు సంపాదించుకొనెను. కాని దానిని ఎక్కడబడితే అక్కడ వేస్తే, కవరు వేయకుండా మాపివేస్తే దీని యర్ధమేమి? భక్తికి తోడు శిక్షణలేదు అనగా తర్ఫీదు లేదు. బైబిలును వట్టి కాగితములే అనియు, దానిలోని సంగతిని గౌరవించు చున్నాను కదా అనియు నిర్లక్ష్యముగా వాడేవారు అజ్ఞానమువల్ల, అజాగ్రత్త స్వభావము వల్ల అట్లు చేయుదురు. గనుక అట్టి అజ్ఞానమును తొలగించు కొనుట క్షేమము. ఎందుకంటే బైబిలును కండ్లకు అద్దుకొనేవారికి అది ఎంతో అభ్యంతరము. వారి భక్తికి భంగము గనుక ఇట్టి చేష్టలు మానవలెను.

  3. మూడవ అనుభవ దృష్టాంతము:- 'రేపు గుడిలో నా ప్రసంగము, ఇంకొక వారము అయితే బాగుండును, తప్పదు గనుక సిద్ధపడెదను' అని చెప్పి, ఒక బోధకుడు వ్యాఖ్యానములు చదివి, నోట్సు వ్రాసికొని మంచి ప్రసంగమే చేసి, గుడిలో చెప్పివేసి మొక్కుబడి తీర్చుకొన్నాడు. ఇది నామకార్ధ ప్రసంగము. దీనిలో దైవాత్మ సహాయములేదు, కేవలము మనుష్య ప్రయత్నమే యున్నది. ఇది కూడదు. ఇది కూడ ఒక గొప్ప శోధనయై యున్నది. ఓ బోధకుడా! ఈ శోధన తప్పంచుకొనుటకై కొన్ని నిమిషములు మోకాళ్ళమీద నుండుము. అప్పుడు నీ నోట్సు వెలిగించబడును. నీ వ్యాఖ్యాన సంగతులు ఉపయోగము లోనికి వచ్చును. మరియు నీవు ప్రసంగించునప్పుడు, నీవు సిద్ధపరచుకొని యుండని క్రొత్త తలంపులు, నీకు ఆశ్చర్యము కలిగించునట్లు వచ్చును. ఇతరులు మెచ్చు కొందురనియు, ఖండిస్తే మంచిపేరు పోవుననియు, తలంచు బోధకుడు కూడా నామకార్ధ బోధకుడై యున్నాడు. నామకార్థ జీవులపేర్లు జీవగ్రంథమందు యుండవు.

  4. నాలుగవ అనుభవ దృష్టాంతము:- నేను చందా వేయకపోతే ఎవరైనా ఏమైనా అనుకొందురు అనియు, ఎక్కువ చందావేయుట చూచి అధికారులు మెచ్చుకొందురని చందా వేయువాడు కూడ నామకార్ధ శోధన కలవాడే. అతడు ఎంతగొప్ప చందా వేసినను పేరు లేదు.

    షరా: పరిసయ్యుడు ఉపవాసము చేసెను, చందా ఇచ్చెను, ప్రార్ధన చేసెను గాని మెప్పు రాలేదు. ఆచారమును బట్టి చేసినందువల్ల అతడు నీతిమంతుడని తీర్చబడలేదు. అయితే ఏమియు చేయక పోయినను లేక చేయలేక పోయినను, 'దేవా! పాపినైన నన్ను కరుణించుము' అనే ప్రార్ధన చేసినందువల్ల, సుంకరి నీతిమంతుడుగా తీర్చబడెను (లూకా 18:10-14). పరిసయ్యులందరిలో, శాస్తులందరిలో ఈ నామకార్ధమైన ఆచార భక్తి ఉండి, యదార్ధమైన భక్తిలేనందువల్ల ప్రభువు వారిని గద్దించెనని మత్తయి 23వ అధ్యాయములో యున్నది. అన్ని అంశములలోను నేను ఉన్నాను” అని అనిపించు కొనుటకై, అపవాది ప్రవేశించును గనుక మెళుకువగా నుండవలెను.

ప్రతి మంచి కార్యమును చెడగొట్టుట అతనియొక్క ఉద్యోగము. అతని ఉద్యోగము చెదగొట్టుట మన ఉద్యోగమై యున్నది.


నామకార్ధమనే దానిమీద 4 ప్రశ్నలు:

  1. ప్రశ్న: ఉదయమున లేచుటతోనే, వాడుకచొప్పున బైబిలు చదువుట తప్పా?

    జవాబు: తీర్చు చేయుట నా పనికాదు. అయినను ఒక మాట చెప్పవలెను. భక్తి ఉన్నా లేకపోయినా, పాపివైనా, ఇష్టమున్నా లేకపోయినా, అర్ధము తెలిసినా తెలియక పోయినా; నేను మంచి ఉద్దేశముతో చదవమన్నాను గనుక నీవు ఆలాగు చదివిన యెడల అది నామకార్ధమై యుండదు. ఎందుకనిన నేను మంచి ఉద్దేశముతో చెప్పితిని గనుకను, ఆ ఉద్దేశ ప్రకారముగా నీవు చదువుచున్నావు గనుకను, ఈ రెంటిని బట్టి (Ray of Hope for Repentance) మారుమనస్సు పొందు నిరీక్షణ నీకు గలదు గనుక దీనిని నామకార్ధములో చేర్చకూడదు. నామకార్ధమనేది ఒకవేళ నిరీక్షణ చుట్టూ (Ray of Hope) యుండవచ్చునేమో గాని నీవు బైబిలు చదువగా చదువగా, ఆ కిరణము వెనుక ఒకటి, రెండు, వెయ్యి కిరణములు వచ్చును. తరువాత నామకార్ధ మేఘము పూర్తిగా అంతరించి పోవును. ఏలీయా కర్మెలు కొండ మీద ప్రార్ధన చేసినప్పుడు, అరచేయి అంత మేఘము మాత్రమే కనబడెను. అప్పుడతడు రాజును పంపివేయగా వారు పారిపోయిరి. ఎందుకంటే గొప్ప వర్షము వచ్చునని గ్రహించుకొన్నారు. వారు పారిపోవుచుండగా ఆకాశమంతయును మేఘములు కమ్మివేసెను. మేఘములు వర్షమును కుమ్మరించెను. నేల తడియున్నట్లు దిమ్మరించెను. అరచేయి అంత మేఘము (Ray of Hope) నిరీక్షణ కిరణము వంటిది గనుక కొంచెము మంచి అభిప్రాయముంటే చాలును. ఆరంభించుము, రాగారాగా అదే వృద్ధి యగును. నిరాశ పడకుండా యుంటే వృద్ధికాక మానదు. పూర్ణమైన నిరీక్షణ లేకపోయినను పరవాలేదు. రవ్వంత నిరీక్షణే చాలును. చిన్న అగ్గినెరుసు (నిప్పురవ్వ) ఒక గ్రామమును తగులబెట్ట గలదు, అరణ్యమును కాల్చి వేయగలదు. చెత్తగాను, బూడిదగాను చేయగలదు గనుక నీలోయున్న (Ray of Hope) నిరీక్షణ కిరణముతో పని ఆరంభించుము. ప్రభువు నీకు తోడుగా నుండును.

  2. ప్రశ్న: నామకార్ధమనేది చివరి వరకును ఉండునా?

    జవాబు: ఉండును. ప్రార్ధన ఆరంభించునప్పుడు ఉండును, తరువాత పోవును, మరల తొంగిచూచును. నీ మంచి ప్రార్ధనవిని పారిపోవును. తరువాత ప్రవేశించును. నీ మంచి ప్రార్ధన ఆలకించలేక, చివరకు సహించలేక అంతర్థానమై పోవును.

  3. ప్రశ్న: జీవిత కాలమంతయు ఉండునా?

    జవాబు: ఉండును, అయినను భయపడనక్కర లేదు. జీవితకాల మంతయు మనలో యదార్ధత అనేదియుంటే నామకము అనేది శక్తిలేనిదై పడియుండునే గాని హానిచేయ వీలులేదు. ప్రభువునందు విశ్వాసము నీకు కలిగియున్నంత కాలము అపవాదికైనను, అతని శక్తికైనను శక్తి యుండదు.

  4. ప్రశ్న: ఈ విషయములో విశ్వాసమనగా ఏమి?

    జవాబు: యేసు ప్రభువు నామకార్ధమనే దానిని జయించినాడు గనుక నేను కూడ జయించుటకు శక్తి ఇస్తాడు అనేదే విశ్వాసము. ఇట్టి విశ్వాసముతో, చదువరులు నామకార్ధ పాపముపై జయము పొందుదురు గాక!