ప్రార్ధనపట్టు
"దేవుడు, తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?" లూకా 18:7.
చదువరులారా! పట్టులేనిదే ఏపని అయినను నెరవేరునా? నెరవేరదు. గనుక మా కోరికలు దేవునికి చెప్పుకొని ప్రార్ధించటయందును; ప్రార్థించినవి నెరవేరునని నమ్ముట యందును, తీవ్రముగా నమ్మి పట్టుదల కలిగి యుండవలెను. అప్పుడు మీ మనవులు నెరవేరును. ఒక సింహము చీమగా మారవలసి వచ్చినప్పుడు ఎంత కష్టము! ఎంత అసాధ్యము! నిజముగా అట్లు జరిగిన యెడల అద్భుతమే. దేవుడు మనుష్యుడగుట ఎంత కష్టమైనపని! అది ఎంత అసాధ్యమైన పనియైనను మనతో నుండుటకును, మన విషయమై సమస్త కార్యములు చేయుటకును, ఈ విధముగా మనకు కనబడుటకును, మనతో మాట్లాడుటకును నిశ్చయించుకొని ఆయన మనుష్యుడైనాడు. మనము పేర్లు పెట్టుకొను రీతిగానే ఆయనను అందరు పిలుచుటకు వీలుగానుండునట్లు, 'యేసు' అను పేరు పెట్టుకొన్నాడు. ఆయన మన నిమిత్తమై బోధించి, శ్రమ అనుభవించి, ప్రాణము బలిచేసి, చెడుగును గెలిచి, మరణమునుకూడ గెలిచి, పరలోకమున కేగెను. ఇంత గొప్ప పనిచేసిన ఈ దేవమానవుడు మనకు ఏ పని చేసిపెట్టడు! ఏ మనవి విడువడు!! ఏ కోరిక నెరవేర్చడు!!!
మనుష్యుని కొరకు దేవుడు మనుష్యుడైన చరిత్ర ఒక్కటే, మీ మనసులో పెట్టుకొని సంతోషముతో మీ ఇష్టము వచ్చినది అడగండి. ఆయన మనుష్యుడు గనుక మన మనవి వినుటకు ఇష్టవడును. ఆయన మన దేవుడు కనుక మన మనవి నెరవేర్చుటకు శక్తిగలవాడై యుందును. ఇష్టమున్నను, శక్తిలేనివాడైన యెడల మన కోరిక నెరవేర్చలేడు. శక్తియున్నను, ఇష్టములేనియెడల మన కోరిక నెరవేర్చడు. యేసుక్రీస్తు ప్రభువునకు ఇష్టమును, శక్తియును ఉన్నందున ఆయన మన కోరికలన్నియు నెరవేర్చును. కనుక చదువరులారా! మీరు ఏ మతస్తులైనను, ఎంత గొప్ప పాపులైనను, వ్యాధిగ్రస్తులైనను, ఎంతగొప్ప పేదవారైనను, ఎంతగొప్ప అజ్ఞానులైనను, ఎన్నెన్ని చిక్కులుగలవారైనను, క్రీస్తు ప్రభువును ఆశ్రయించి, నిత్యము ఆయననే పూజించుచు, మీ మనవులు వివరించు కొనండి. నమ్మకము లేకపోయినను ప్రార్థించి చూడండి! మీరు క్రీస్తును ఆశ్రయించిన తరువాత, ఏ దైవమునైనను ఆశ్రయించినయెడల మీ కోరికలు నెరవేరవు. మీ కోరికలు ఏమై యుండవలెను? పాప పరిహారము, వ్యాధి పరిహారము, ఇబ్బంది పరిహారము, చిక్కుల పరిహారము మొదలైనవి. నమ్మిక, సంతోషము, ధైర్యము, నిశ్చింత, సుబుద్ధి, సత్యవర్తన, పాప విసర్జన, దైవసేవ అనగా దేవుని విషయమైన సంగతులు ఇతరులకు బోధింపగల సేవ, రక్షణ, నెమ్మదియైన మరణము మొదలైనవి. ఇవికాక ప్రతి దినము నీకు ఏవి అవసరమో, అవి అడిగి అందుకొనవచ్చును. ఆయన అందరి ప్రార్ధనలు, అన్ని ప్రార్ధనలు ఆలకించును. ఇది ఆయనలోనున్న సంతోషమని గ్రహించుకొనవలెను. ఆయన త్వరలో మీ కోరికలన్నియు నెరవేర్చక, ఆలస్యము చేయును. అప్పుడు చింత, అధైర్యము, దిగులు, భీతి, అనుమానము, విసుగుదల, నిరాశ, ప్రార్ధన మానివేయుట, "మాకోర్కె నెరవేర్చుట ఆయనకు ఇష్టములేదు కాబోలు" అని అనుకొనుట ఈ మొదలైనవన్ని దయ్యములతో సమానము. ఈ దయ్యములను మీలోనికి రానియకండి. తేళ్ళను, పాములను మీ ఇంటిలోనికి రానిత్తురా? రానీయరు. అట్లే వీటినిగూడ రానీయకండి. వచ్చుచున్నను త్రోసివేయుచుండండి. అట్లు త్రోసివేసిన యెడల, వాటిని విసర్జించుటలో మీ పట్టు గట్టివడును.
మొదటిది ప్రార్ధనవలన కలుగునట్టి పట్టు. అనగా మంచివాటిని అందుకొనుటకు ఏర్చడగల పట్టు. రెండవది అక్కరలేని వాటిని విసర్జించుటకు అవసరమైన పట్టు, ఈ రెండును మీరు కలిగి యుండవలెను. ప్రార్థింపగా, ప్రార్థింపగా నెరవేరనియెడల, అవలంభింప వలసిన ఉపాయము గలదు. ఒక రోజంతా ఏకాంత స్థలమందు ఉపవాస ప్రార్ధనచేసి చూడండి. అప్పుడు మీకు పట్టు కుదురును. "ప్రార్ధించుటకు సమయము, స్థలము, వీలు దొరకదు. ఏమిచేయవలెనని" కొందరడుగుచున్నారు. నీళ్ళు త్రాగుటకు, అన్నము తినుటకు, తీరికగా కూర్చుండుటకు, నిద్రపోవుటకు అన్నిటికి సమయమున్నది. ప్రార్ధనకు సమయములేదను వారికి ఏమి సమాధానము చెవ్పవలెను! మిషలు, మీ బ్రతుకునకు అద్ధముగా నుండును గనుక తొలగించుకొనండి. మీ కష్టములన్నియు ప్రార్ధనా పూర్వకముగా క్రీస్తు ప్రభువు యెదుట విదల్చి వేసికొనండి. అప్పుడు మీ మనోభారము అంతరించును. ఆయన మీ ప్రార్ధన వినును అని అనుకొనుటయే మీ సంతోషమై యుండును. అప్పుడు కార్యసిద్ధి కలుగును.
యేసు ప్రభువు చెప్పిన ఒక ఉపమానము వినండి: భర్త పోయిన ఒక స్త్రీ, న్యాయాధిపతి యొద్దకు మిగుల తరచుగా వెళ్ళి, "నా కష్టము తీర్చండి" అని ఎంత బ్రతిమాలినను ఆయన గైచేయలేదు (వినలేదు). అయినను ఆమె నిరాశపడక, పట్టినపట్టు విడువక, మరల వెళ్ళి బ్రతిమాలుకున్నందున, ఆ న్యాయాధిపతి ఆమె కష్టము నివారణ చేసెను. చదువరులారా! విన్నారా! చూచినారా! ఆమెలో ఎంత పట్టు ఉన్నదో! మీలో అంతపట్టు ఉన్నయెడల, క్రీస్తు ప్రభువు మా కష్టములను పరిహరించును. "ప్రార్ధించండి" అని ఆయనే చెప్పినాడు గనుక మీరు ప్రార్ధించిన యెడల ఎందుకు వినడు!!! "వినడు" అని ఎవరు చెప్పినను నమ్మకుము, నీ మనస్సాక్షి చెప్పినను నమ్మకుము. ఆయన చెప్పినదే నమ్మండి. అప్పుడు మీరు ధన్యులగుదురు. మోచేత వట్టుదల ! చేయించుటకే ఆయన పై ఉపమానము చెప్పెను. దేవుడు మీకు తోడై నిత్యము దీవించుచుండును గాక!