నమ్మకమైన సేవ - 3



"అతడు (అబ్రాహాము) నమ్మకమైన మనస్సుగలవాడని" (దేవుడు) ఎరిగి (నెహె. 9:7,8). అబ్రాహాము బహు నమ్మకస్థుడై యుండెను. మానవుని హృదయములోనున్న ఒక్కొక్క మంచి లక్షణము దేవుని దగ్గర బహుమానము సంపాదించును. మానవునిలోని ఒక్కొక్క మంచి శక్తికి, ఒక్కొక్క మంచి ఫలితము దొరుకును. ఒకనికి కాళ్ళలో ఎక్కువ సత్తువ గనుక ఎంత దూరమైనను నడువగలడు. ఒకరికి వృక్షములు పెంచుటయందు ఆశ, మరియొకరికి తోటను పెంచుటయందు ఆశ. వారి పనులనుబట్టి సమయము వచ్చినప్పుడు, వారిలోని లక్షణములు బయలుపడును. కొందరు, తమ అధికారి దూరములోనున్నను పని నమ్మకముగాచేసి అప్పగించుదురు. అబ్రాహాములోనున్న మంచి గుణము నమ్మకము. అందుచేత దేవుడతనికి భూదానము చేసెను. అబ్రాహాము తనలోనున్న స్వభావమును తన స్వజనులకు బోధించుటలన వారిని నమ్మకస్థులనుగా చేసెను. యేసుప్రభువు కొండమీద చేసిన ప్రసంగములో "సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును న్వతంత్రించుకొందురు" అని బోధించెను. అది అబ్రాహాము విషయములో చూచుచున్నాము గాని వెయ్యేండ్ల పరిపాలనలో పూర్తిగా చూచెదము. పిల్లలు నమ్మకముగా యుండునట్లు మనము తర్ఫీదు చేసిన యెడల వారికట్టి స్వభావము కలుగును. అప్పుడు వారు భూదానము పొందుదురు. ప్రభువు తన శిష్యులకు భూగోళమంతయు అప్పగించెను. (మార్కు 16:15) మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వనృష్టికి నువార్తను ప్రకటించుడి! సువార్తను నమ్మకముగా మనము ప్రకటించవలెను. లోకమంతయు మనది, అనగా వెయ్యేండ్ల పాలనలో పూర్తిగా మనదగును.


నమ్మకమనునది గొప్ప లక్షణము. దేవుడు మనలను నమ్మబట్టి, భూబంతిని మనచేతికి అప్పగించి వెళ్ళిపోయెను. పాడుచేసినను, బాగుచేసినను భూగోళమును దేవుడు సంఘమునకు అప్పగించెను. అది సంఘము యొక్కపని. దేవుడు మనలను నమ్ముచున్నాడు గనుక మనమును ఆయనకు నమ్మకముగా నుండవలెను. ఉపాధ్యాయుడు తనపనిని నమ్మకముగా చేసినయెడల పిల్లలు పరీక్షలో కృతార్థులగుదురు. సంఘకాపరి నమ్మకముగా పనిచేసి, సంఘమును సరిగా నడిపించిన యెడల దేవుడు బహుమానమిచ్చును. తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకముగా పెంచవలెను. నెహెమ్యా 9:8లో ఇశ్రాయేలీయులు తమ పితరుడైన అబ్రాహామును తలంచుకొని, ఆయన నమ్మకస్థుడు గనుక ఈ దేశము మాకు లభించినదని దేవునిని స్తుతించిరి.


ఉదా: మనము కమ్మర దుకాణమునకు వెళ్ళిన యెడల, ప్రతి ఇనుపముక్క అది వంకరదైనను వాటిని కమ్మరి సరిచేయును. ఆలాగే పిల్లలు తల్లిదండ్రులు చేతిలోని బాణములవంటివారు గనుక పిల్లలను వారు ఎటువంచిన అటు వంగుదురు. గనుక తల్లిదండ్రులు పిల్లలను బాల్యమునుండి సరిగా తయారు చేయవలెను. బిడ్డలను ఆరోగ్య పద్ధతిలోను, దైవభక్తిలోను పెంచు విషయములో వారు దేవునికి నమ్మకస్థులై యుండవలెను. ఒక సువార్తికుడు మిక్కిలి కఠినమైన ప్రదేశములో నమ్మకముగా సేవచేసి, చివరకు గొప్ప ఫలితము పొందెను (ఇది ఒకచోట జరిగెను). మోషేను దేవుడు ఫరో కుమార్తెకు అప్పగించెను. ఆ స్త్రీ, దేవునికి నమ్మకస్థురాలై ఆయనను పెంచి పెద్దవానిగా చేసెను. గనుకనే మోషే నమ్మకముగానే జీవించెను. ఐగుప్తుయొక్క సకల విద్యలు మోషే నేర్చుకొనెను. పిల్లలను నమ్మకముగా పెంచిన యెడల అందువలన కలిగిన బహుమానమును, మేలును తల్లిదండ్రులు పొందుదురు. అప్పుడు ప్రభువును స్తుతించెదరు.


ఇశ్రాయేలీయులు అబ్రాహామును తలంచుకొని దేవుని స్తుతించిరి. భూమిమీద ఒక పాపి మారుమనస్సు పొందిన యెడల, పరలోకములో సంతోషము కలుగును. ఈ లోకములోకూడ సంతోషము కలుగును. ప్రభువు మనలను ఏ స్థితిలోనికి తీసికొని వచ్చిన, ఆ స్థితిలో నమ్మకముగా నుండవలెను. మనలో ప్రతివారికి దేవుడు ఒక స్థితి ఇచ్చియున్నాడు. ఆ స్థితిలో మనము నమ్మకముగా నుండవలెను. దేవుడు మనకు సూది బెజ్జమంత చిన్నపని ఇచ్చినను, నమ్మకముగా చేసిన యెడల, దేవుడు అట్టివారికి ఇంకా గొప్పపని అప్పగించును. గనుక ప్రతిపనిలో, ప్రతి విషయములో, నమ్మకస్థులైయుండుట మహా గొప్ప విషయము.