నక్షత్రములు యుద్ధము చేసెను
"నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను" న్యాయాధి. 5:20.
న్యాయాధిపతుల గ్రంథములోని కథలో నక్షత్రములు యుద్ధము చేసెనని గలదు. దేవుని బిడ్డల పక్షముగా అవి యుద్ధము చేసెను. నీతిమంతుడు ఏ కష్టములో నుండియైనను పైకి రాగలడు. ఎందుకనగా దేవుడు, ఆయన కలుగజేసిన సృష్టి; నీతిమంతుని పక్షముగా నుండును. మన ఆత్మీయ జీవనమునకు కావలసిన పాఠములు ఇందులో నేర్చుకొనవలెను. యుద్ధములో పటాలములు భూమిమీద నుండును. గనుక నక్షత్రములు భూమికి రానిదే ఏలాగు యద్ధము చేయగలవు?
జవాబు: అవి తమ మార్గములలో నుండి యుద్ధము చేసెను. క్రైస్తవ జీవితములో యుద్ధము గలదు. పాపము, సైతాను శోధన, మరణము వీటన్నిటితో మనము యుద్ధము చేయవలెను. ఈ పోరాటములో మనము ఒక్కరమే లేము, గనుక మనకు సహాయము చేయువారు లేరని అనుకొనకూడదు. మనకు సహాయము చేయువారు ఇంకొకరు ఉన్నారు. ఇశ్రాయేలీయులకు నక్షత్రములు సహాయము చేసెను. వారికి ఆ నక్షత్రములు ఏలాగు సహాయపడెనో, మనకుకూడ ఆయన సహాయమిచ్చి యున్నాడు. గనుక మనము ఒంటరిగా యుద్ధము చేయనవసరము లేదు. శత్రువుల పటాలము ఎంత ఎక్కువ ఉన్నను, వారికన్న మన పటాలమే ఎక్కువ. ఇసుక రేణువులంత సైన్యము మనకు కలదు.
చాల చిత్రమైన సంగతి: ఓ క్రైస్తవుడా! నేనొక్కడనే పోరాడుచున్నానని నీవు అనుకొనవద్దు. నీకు విశ్వాసమున్న యెడల వారు నీకు సహాయము చేయుదురు. నీకు విశ్వాసము లేకపోయిన యెడల వారు సహాయపడరు. పడిపోయిన యెడల వారు నిన్ను లేవదీయుదురు. పరలోకపు తండ్రి ఏమనును? - "పడిపోయినాడు, చాల గొప్ప దెబ్బ తిన్నాడు, అయినను విశ్వాసమున్నది గనుక లేవదీయండి" అని పటాలమును పంపును. మన శత్రువులు వాయు మండలములో నున్నారు. మరియు వారితోపాటు కరవు, పాపము, వ్యాధి మొదలైనవి మనకు ఉన్నవి గనుక వీటిని మనము పరలోక పటాలపు సహాయము లేకుండ జయించలేము. ఇశ్రాయేలీయులకు సహాయకులు ఆకాశ నక్షత్రములు. మనకు సహాయకులు దూతలు. నక్షత్రములవలె తళుక్కు మనునంతలో వారు మన దగ్గర నుందురు. గాని విశ్వాసము పోయిన, (లేని) వారికి, సహాయము చేయవలెనను ఆర్డరు వారికి ఉండదు. విశ్వాసమున్న యెడల వారువచ్చి లేవదీయుదురు. వారు గొప్ప పటాలము. వారికి మరణభీతి లేదు. మనకుకూడ అట్టి భీతి ఉండకూడదు. అపజయము కలిగినను క్రైస్తవునికి భీతి ఉండకూడదు. అపజయము కలిగినను క్రైస్తవునికి భీతి ఉండరాదు. ఎన్ని శోధనలు వచ్చినను, నశించిపోదునను భయముండకూడదు. సైతాను మనకన్న బలము కలదైనను, భయముండకూడదు. ఎందుకనగా మన సహాయకులు గొప్పవారై యున్నారు. భూమిమీదనున్న విశ్వాసులకన్నను, దూతలు చాల ఎక్కువ మందియై ఉన్నారు. వారు గొప్ప ఆలోచనాపరులు. క్రైస్తవులు - "ఈ యుద్ధము చేయుటకును, జయించుటకును; ఈ శోధన, కీడు, శాపము తొలగించుటకును ఎట్లు?" అని ఆలోచించుచుండగా, ఆత్మ తండ్రి మనకు గొప్ప ఉపాయము అందించును. ఏమి చేయవలసినది మనకు తోచునట్లుగా చేయును. దూతలు, ఆలోచన లేకుండ శత్రువులమీద పడరు. ఆలోచించి మనకు సహాయ పడుదురు.
"యెహోవా సహాయము చేసినాడు. ఆయనను కీర్తించుడి" అనికూడ వాక్యములో గలదు. దూతలు గొప్ప ధైర్యము గలవారు. కోటానుకోట్ల దయ్యములున్నను, దూతలకు ధైర్యము గొప్ప వరముగా ఇయ్యబడెను. శత్రువుల పటాలము ఎంత పెద్దదైనను, దూతల ముందు వారు నిలువలేరు. మనకు విశ్వాస మున్నపుడు గొప్ప ధైర్యము కలుగును. మనలోనున్న విశ్వాసమును చూచి మన శత్రువులు భయపడుదురు. ధైర్యము లేకపోయిన యెడల శరీర బలమున్నను లాభములేదు. మనలో విశ్వాసమున్న యెడల అవి ఏమియు చేయలేవు. ప్రకటనలో - "పరలోక పటాలమును చూచి భూలోక పటాలము గజగజ వణకిపోవును" అని గలదు. ఆ పరలోక పటాలము ఇప్పుడు మనకు కనబడదుగాని దాని కళ మాత్రము కనబడును. పరలోక వటాలము ఒక నిమిషములో మన సహాయమునకు రాగలదు. ఇదే విశ్వాసులకు గల గొప్ప ఆదరణ. మన శత్రువులు ఎటువంటి వారనగా, ఇది వరకు ఓడిపోయినవారే. ఎలాగనగా మనకు బదులుగా యేసు ప్రభువు వాటన్నిటిని జయించెను. ఆయన కొరకు కాదుగాని మనకొరకే వాటిని జయించెను. గనుక 'ధెర్యముతో వెళ్ళండి, జయించగలరు' అని ఆయన చెప్పుచుండెను. జయము రాకముందే మనకు జయము వ్రకటింపబడెను. గనుక పుట్టబోయే వారికికూడ ఈ జయమే గలదు.
నక్షత్రములనగానేమి? మొక్కలువేసి వాటి కాపుదలకు కంచెకూడ వేయుదురు. దేవుడు ఆకాశమును, భూమిని సృజించి, సృష్టికంతటికి దూతలను కావలిగానుంచెను. శత్రువు రాకముందే దేవదూతలను కావలిగా నుంచెను. ఈ దూతలు నక్షత్రములను, నదులను, మనలను, చెట్లను, పశువులను కాపాడుచుందురు. సృష్టి అంతటిని కాయుటకు దేవుడు కోటానుకోట్ల దూతలను కావలియుంచెను. ఈ కావలి దూతలే, ఈ భూమిమీద నున్నవారే ఇశ్రాయేలీయులకు యుద్ధములో సహాయము చేసెను. వీరికి రంగు, కాంతి గలదు. శత్రువుల రంగు చీకటి. మన సహాయకుల రంగు వెలుగు. వెలుగే జయించును గాని చీకటి గెలువదు. రోమా 13వ అధ్యాయములో వెలుగు, చీకటిని గురించి గలదు. మరియు నక్షత్రముల సహాయము అనగా సాధారణముగా ఇలా అందురు: "నెల పొడిచినది గాని లేకపోతే మా వని అయిపోయి ఉండును" అని అంటారు. చంద్రుడు వీరికేలాగు సహాయపడెనో, నక్షత్రములు ఇశ్రాయేలీయుల కట్లు సహాయపడెను. నక్షత్ర కాంతికి శత్రువులు స్పష్టముగా కనబడిరి. మరియు సృష్టిని కాపాడు దూతకు, (నక్షత్రములు) సహాయము చేసిరి. మనకు యేసు ప్రభువు, దూతలు, పరిశుద్ధులు సహాయము చేతురు. ఇన్ని సహాయములు మనకున్నవి గనుక విశ్వాసులకు మరణభీతి లేదు. పెండ్లి కుమార్తెకు మరణభీతి లేదు. అసలు మరణమే లేదు. విశ్వాసులు చనిపోయిన తర్వాత పరలోకములో జ్యోతులవలె ప్రకాశింతురు. నక్షత్రములు ఎక్కడనుండి సహాయపడెను? ఆకాశమునుండి. ఆలాగే విశ్వాసులును, వారెక్కడ నియమింపబడిరో, అక్కడనుండి సహాయము చేయగలరు. అక్కడనుంచి దగ్గరకు వచ్చి కూడ సహాయము చేయగలరు.