ప్రార్ధనా పద్ధతి



యేసు ప్రభువు భూమిమీద నున్న 3½ సం॥ల కాలముయొక్క చివరలో ఒక ఆజ్ఞ ఇచ్చెను. ఆ ఆజ్ఞ "మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి" అనునది. ఆయన 3½ సం॥ల సేవ కాలమున కొన్ని సలహాలిచ్చెను. అందొకటి ప్రార్ధించండి అనునది; ఆజ్ఞ ప్రకారము చేయుట సుళువా, సలహా ప్రకారము చేయుట సుళువా? ముందు సలహా నెరవేర్చిన తర్వాత ఆజ్ఞ ప్రకారము చేయగలము. గనుక ముందు ప్రార్థించవలెను. ప్రార్ధనలో ఆజ్ఞలు నెరవేర్చు బలము వచ్చును. గనుక ముందు ప్రార్ధన పద్ధతి నేర్చుకొనవలెను. అప్పుడు ప్రార్ధనలో వచ్చిన బలమువల్ల సర్వలోక సంచారము చేయగలము. "సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి" అనునది అప్పుడు నెరవేరును. అనగా లోకమంతా తిరిగి అన్ని భాషలలో సువార్త ప్రకటించుము. అయితే మనము పద్ధతి లేకుండ ప్రార్ధన చేయుచున్నాము. అయినను, ఆయన దయగలవాడు గనుక అంగీకరించు చున్నాడు. మత్తయి 6:6 లో ప్రార్ధన పద్ధతి గలదు. నేను కొన్ని పద్ధతులు నేర్పించి అచ్చువేయించినాను.

ఉదా:- కలెక్టరుగారికి పిటిషను ఒక పద్ధతి ప్రకారము వ్రాయవలెను. ఆ పద్ధతి ప్రకారము ప్రార్థన చేసిన బలము వచ్చును. అప్పుడు ఆజ్ఞలను నెరవేర్చుటకు, వాక్యము ప్రకటించుటకు బలము వచ్చును. అప్పుడు యేసు క్రీస్తు నా రక్షకుడు అనునది స్థిరమగును. నేను తప్పకుండా మోక్షమునకు వెళ్ళుదును అనునది స్థిరమగును.