క్రైస్తవుని స్థిరవిశ్వాసము



బైబిలులో దేవునియొక్క నిశ్శబ్ద లక్షణమున్నది. అందుచేత క్రైస్తవుని యొక్క విశ్వాసము, దేవుని ఈ నిశ్శబ్ద లక్షణములో కలసిపోవును. అనగా బండవంటి విశ్వాసము, దేవుని నిశ్శబ్ద లక్షణముతో ఏకీభవించును. ఇసుక వంటి క్రైస్తవ విశ్వాసము కదలిపోవును. సైతాను, అతని దూతలు, పాపములు, వడ్డీ పాపములు, పాప ఫలితములు, చావు ఈ మొదలైనవి జరుగుచుండగా, దేవుడు ఎరగనట్లు (అనగా ఏమియు తెలియనట్లు) ఊరుకుంటున్నారు. అదే దేవుని నిశ్శబ్ద లక్షణము. అదే అనేక మందికి ఆటంకము. అయితే "బండ" (రాయి) వంటి విశ్వాసికి మాత్రము ఈ లక్షణము ఆటంకము కాదు. "ఇసుక" వంటి విశ్వాసికి దేవునిమీద నేరము మోపుట చేతనవును. ఎందుకనగా ఆయన నిశ్శబ్ద లక్షణమును అర్ధము చేసికోలేదు గనుకను, ఇంకను ఆయన కనబడుట లేదు గనుకను. అయితే, రాతిమీద పునాది ఎంత గట్టిగా, స్థిరముగా ఉంటుందో, బండవంటి క్రైస్తవుని విశ్వాసములో కూడ దేవుని నిశ్శబ్ద లక్షణము వలన, ఏ కదలిక ఉండదు.


ఉదా: ఒక పంతులమ్మగారికి ఎప్పుడు జబ్బులేగాని, ఎన్నడూ విసుగు కొనలేదు. అది ఆశ్చర్యము. ఈ మనిషిది రాతి విశ్వాసము.


రాతి విశ్వాసము ఇసుక విశ్వాసము
1. రాతి విశ్వాసిది కూడ నిశ్శబ్ద లక్షణమే. దేవునిని ఏమి అనడు. 1. ఈ విశ్వాసి దేవునిమీద నేరము మోపుతాడు.
2. కష్టము వచ్చినది; దేవుడు ఊరుకొన్నను ఏమి అనడు. 2. కష్టమువస్తే, దేవుడు ఆపుచేయ కూడదా! అనును.
3. దేవునిది తప్పు అని ఏనాడు అనడు. ౩. దేవునిది తప్పు అని అంటాడు.
4. దేవునికి ఉన్న నిశ్శబ్ద లక్షణము ఉన్నది గనుక, ఏది వచ్చినా, దేవా! నీకే స్తోత్రం అంటాడు. 4. విసుగుకుంటాడు.

ఉదా: రామచంద్రాపురములో ఒక చాకలి, వర్షం వస్తే ఒక పాకలో నుండగా, పిడుగు పడి చనిపోయెను. అది అజ్ఞానము వలన సంభవించినది. ఇసుక క్రైస్తవుడైతే దేవుడు ఎందుకా తరుణము రానిచ్చినాడు? అని నిందించును. ఆకాశమునుండి వర్షము వచ్చి ఇసుకమీది ఇల్లు పడిపోయినది, నష్టము కలిగినది. ఆకాశములోని వర్షము వల్ల ఇసుక కరిగిపోవునట్లు, ఆలాగే దేవుని నిశ్శబ్దము వలన అవిశ్వాన క్రైస్తవుని యొక్క ఇసుక - క్రైస్తవుని యొక్క విశ్వాసము కరిగిపోవును.


వర్షము వచ్చినది, ఆ నీళ్ళు ఇసుక (పునాది) మీద ప్రవహించడము వల్ల ఇసుక కరిగిపోతుంది. అట్లే భూమిమీద నుండి వచ్చు అవమానములనే వర్షము వలన విశ్వాసము కరిగిపోతుంది. దేవుని నిశ్శబ్దము వలన, మనుష్యుల నిందల వలన విశ్వాసము చెడును. వర్షము మంచిదే, అలాగే దేవుని నిశ్శబ్దము మంచిదే. అయితే వరదలు, నిందలు చెడ్డవి. మంచిదైన వర్షము వరదల వలన చెడునట్లు, మంచిదైన దేవుని నిశ్శబ్దము ఈ నిందల వలన అపార్ధము చేయబడును. ఆ చెడ్డదైన వరదలనే ఆక్షేపణలవల్ల విశ్వాసము చెడును. భూమిమీది బురదగల వరద, మనుష్యులయొక్క ఆక్షేపణలకు సమానము. కనుక రాతి విశ్వాసము గలవారు వేటికీ ఉలకరు, పలకరు, స్థిరులై ఉంటారు.