లేని రాని పాట
ప్రశ్న :- పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళదగిన వారెవరు?
జవాబు: ఈ ప్రశ్నకు ఇదివరకు ఎన్నియో సమాధానములు చెప్పబడియున్నవి. అయినను దీనికి కొన్ని క్రొత్త సమాధానములు తెలిసికొనవలెను.
అవి ఏవనగా: ప్రస్తుతము మీకు కలిగియున్న చిక్కులు, శ్రమలు, నిందలు, ఇబ్బందులు, భీతులు మున్నగు ప్రశ్నల జాబితాలన్నియు నొక పత్రముపై వ్రాసికొనండి. ఒక్కొక్క దానిని గురించి తండ్రిని స్తుతించండి.
న్తుతించునవుడు మీ మనస్సులలో గమనించ వలసిన విషయములివి.
- తండ్రీ! నా లోపములను బట్టియే ఇవి అన్నియు నాకు కలిగినవి.
- దేవా! కేవలము నీవు నాయందు మహిమ పరచబడుటకై, నీ మహిమ వలననే శ్రమలు వచ్చినవి. కాబట్టి నీకు స్తోత్రములు.
- ఏ విధముగా శ్రమలు వచ్చినను, అవి నీ సెలవుపైననే వచ్చును. వీటన్నిటికి ఒక మిష యున్నది. అనగా నొక్కొక్కశ్రమకు, ఒక్కొక్కపని యున్నది. ఆ పని పూర్తికాక పూర్వము లేక ఆ శ్రమ తొలగక పూర్వము అది మమ్మును విడనాడి పోదని మాకు తెలియును. కాబట్టి నీకు నమస్కారములు.
- ప్రతి దానివలన మాకు మేలు కలుగవలెనని నీవు ఆజ్ఞాపించుచున్నావని మేము గ్రహించుకొనుచున్నాము. గనుక నీకు ప్రణుతులు.
- ప్రతి శ్రమవలన నీకు (దానివలన కాదుగాని), అనగా వాని మిషమీద మా ద్వారా నీకు మహిమ రావలెనని, నీ యుద్దేశ్యమై యున్నదని మేము గ్రహించు కొనుచున్నాము. కాబట్టి నీకు స్తుతులు.
- ఈ శ్రమవలన మేము విసుగుచెందక ఆనందించుటవలనను, నిన్ను స్తుతించుట వలనను, ఇతరులు మమ్మును చూచి, మా వలన మంచి పాఠములను నేర్చుకొందురని మాకిట్టి శ్రమలను కల్పించుచున్నావు. గనుక నీకు వినుతులు.
- మాకు కలిగిన శ్రమలలో మేము నిన్ను స్తుతించుచుండగా, పిశాచి మరియు దాని అనుచరులు చూచి, సిగ్గుపడి ముఖములను వాల్చుకొని, హడలిపోయి పారిపోవలెనని, ఈ భ్రమలను కల్పించుచున్నావు. గనుక నీకు స్తోత్రములు.
- ఈ శ్రమవలన మేము నూతనానుభవమును, విశ్వాసాభివృద్ధిని పొంది, నీ ప్రేమయొక్క ప్రత్యక్షతను చూడవలెనని నీవిట్టి శ్రమలను కల్పించుచున్నావు (లూకా 22:28-30) గనుక నీకు నమస్కారములు.
- ఇన్ని విధములైన శ్రమల ననుభవించు చున్నందువలన, ఇహలోకములో నొక అమూల్యమైన అనుభవమును, బహుమానమును పొందుట మాత్రమేకాక, పరలోకములో నీవనుగ్రహించు బహుమానమును బొందుటకే, నీవు మాకు శ్రమలను కల్పించుచుంటివి (1పేతురు. 4:12-18) గనుక నీకు ప్రణుతులు.
- ఇట్టి శ్రమలను సహించువారము మేమొక్కరమే కాదు. మాతో చాలామంది జత కలిసియున్నారు. పూర్వకాలమున శ్రమల ననుభవించిన వారును, ప్రస్తుత కాలములో శ్రమల ననుభవించుచున్న వారును, ఇంకను అనుభవింప వలసియున్న వారును మాకు జతగాయున్నారు. మేమొక్కరమేయని అనుకొనక, దిగులుపడక, మహాధైర్యముతో నుండుటకే, ఇంతమందిని శ్రమల లోనికి రప్పించుచున్నావు (1 పేతురు 5:9, 10). గనుక నీకు మంగళ స్తోత్రములు. మా యొడల నీవు చూపుచున్న కృపలలో నిది యొకటి.
- మాకన్న ముందుగా పరలోకమునకు వెళ్ళిన యొక జనసమూహ మున్నది. వారు గడిచి గట్టెక్కినవారు. గనుక వారిని ఈ శ్రమలేమియు చేయజాలవు. కాబట్టివారు నిత్యము నిన్ను స్తుతించుచున్నారు. మేమో! శ్రమల లోపలజ ఉండి నిన్ను స్తుతించుచున్నాము. వారి స్తుతికిని, మా స్తుతికిని చాల బేధమున్నది. ఒక గదిలో నున్నవారు (పాటలో) పల్లవి పాడినచో, రెండవ గదిలోని వారు అందుకొందురుగదా! అట్లే శ్రమలలోనున్న మనము స్తుతి గానము చేయుచున్న యెడల, శ్రమల సరిహద్దునకు అవతలనున్న వారందుకొని పాడుదురు. శ్రమలో ఉన్న స్తుతులను మనము అందుకొని పాడుచుండగా, వారు అనగా శ్రమల సరిహద్దున కవతల నున్నవారు, మన స్తుతుల నందుకొని పాడుదురు. తండ్రీ! మాకిట్టి భాగ్యము కలుగు నిమిత్తమై నీవు మాకు శ్రమలను కల్పన చేయుచున్నావు. కాబట్టి నీకు స్తోత్రములు. "శోధన నహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై, ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానముచేసిన జీవకిరీటము పొందును" (యాకోబు 1:12).
- దేవా! నిన్నాశ్రయించెడి వారిలో కొందరిని శ్రమలలో ఉంచి రక్షించెదవు. మరికొందరిని శ్రమలలోనుండి రక్షించెదవు. మరికొందరిని శ్రమలు లేకుండజేసి రక్షించెదవు. కాబట్టి నీకు స్తోత్రములు.
ప్రభువునందు ప్రియులారా! రేపు కలుగనైయున్న గొప్ప శ్రమారంభమునకు ముందు, ప్రభువు మేఘముమీద వచ్చి, పెండ్లికుమార్తెను తీసికొని వెళ్ళును.
షరా:
1. పై నుదహరించిన వాటినిబట్టి ఎవరు మోకరించి స్తుతి చేసెదరో, వారి ఆత్మలకు ఆనందకరమైన పాట పరలోక వాస్తవ్యులచే అందింపబడును. ఇది మిక్కిలి గొప్ప అనుభవము. అందరును పొందవలసినది.
2. ఒకప్పుడు శ్రమలను తీసివేయుమని ఎంత మొరపెట్టినను, అవి తీసివేయబడవు. ఇది యొక రకమైన కృప. నా కృప నీకు చాలును (కొరింథీ. 12:9).
ఈ పాట మన మెరుగని రాగము గలది. మన మెరుగని సంగతి కలది.