ఆది క్రైస్తవ సంఘము - హింసలు
క్రైస్తవ మతము వచ్చి దాదాపు రెండువేల సం॥లు అయినది. ఈ మతములోనున్న వారికి మేళ్ళు గలవు, కష్టములు కూడ గలవు. ఆది క్రైస్తవులకు బోధచేయవద్దని మత విరోధులు, గవర్నమెంటువారు చెప్పిరి. గాని వారు మానలేదు. అందువలన ఖైదు అనుభవించిరి. వారిని ఖైదులో నుంచినను మతము ఖైదులో లేదు.
మతము బయటికి వచ్చి, ఇప్పటివరకు నడిచివచ్చెను. అన్ని దేశములకు వ్యాపించెను. ఆది క్రైస్తవులకు ఎన్నో హింసలు కలిగెను. వారిని రకరకములైన బాధలు పెట్టిరి. నరుకుట, కొట్టుట, కాల్చుట మొదలగునవి. అప్పుడు వారు పొరుగు దేశములకు పారిపోయిరి. ఇతర దేశములకు బోధచేయుటకు వెళ్ళలేదు. గాని హింసల వలన వెళ్ళిపోయిరి. అయితే ఆ దేశములవారు - మీరు ఎందుకు ఈ దేశము వచ్చినారని అడిగినప్పుడు, బోధ చెప్పుచుండగా మమ్మును హింసపెట్టిరి. అందుకనే వచ్చివేసినామని చెప్పిరి. ఆలాగు అక్కడకూడ ఆ బోధ చెప్పిరి. వారు పారిపోయిరి గాని మతము పారిపోలేదు. ఎందుకు వచ్చివేసినారని అడిగినప్పుడు కారణము చెప్పిరి. అదే బోధ ఆయెను.
దయ్యము ఒకటి తలంచును. దేవుడు మరొకటి చేయును. దయ్యము వారిని హింసల కప్పగించుట వలన మతము ఆపుచేయ జూచెను గాని, వారు అన్ని దేశములకు చెదిరిపోయి, వాక్యము అంతటను ప్రకటించిరి. క్రైస్తవమత విరోధులు "బోధ వద్దు" అన్నారు, "ప్రార్ధనకూడ చేయకూడదు" అన్నారు. ప్రార్ధన ఎవరును వినరు. అయితే, ఎవరిగదిలో వారే చేసికొనినను, వద్దు అన్నారు. ఊరిలో "ప్రార్ధన చేయవద్దు" అన్నారు. అప్పుడు శ్మశానములోనికి వెళ్ళి ప్రార్ధనలు పెట్టుకొనిరి. అక్కడ కూడ చేయవద్దని వారిని కొట్టిరి. అప్పుడు వారు కొండలలోనికి, గుహలలోనికి వెళ్ళి, ప్రార్ధనలు చేసికొనిరి. పార్ధనపని, బోధపని వారు మానలేదు. రాజుగారు క్రైస్తవుల నందరిని చంపుటకు ఆజ్ఞాపింపగా వారు పాటలు పాడిరి. 'పాడవద్దు' అని చెప్పినను ఆపుచేయలేదు. ఆ కీర్తనలకు చక్రవర్తి ఇతరులు కలసి, క్రైస్తవులను కత్తితో నరుకుటకు వరుసగా నిలువబెట్టిరి. ప్రజలు చుట్టు ఉన్నారు. నరుకుచుండగా వారేమియు మాట్లాడుటలేదు. వారికేదో భాగ్యము కనబడుచున్నదని చూచుచున్నవారు అనుకొని, మేముకూడ క్రైస్తవులము అని చెప్పి చంపబడుటకు వరుసలో నిలువబడుచుండిరి. ఈలాగు క్రైస్తవులు ఎక్కువగుచుండగా ఇక చంపలేమని చక్రవర్తి చెప్పిరి.
చక్రవర్తియు, మంత్రులును నరికేవారిని పిలిపించి, "వీరు ఎక్కువగుచున్నారు" అని ఒక ఆలోచన చేసిరి: "ఊరి మధ్య ఒక విగ్రహము నిలువబెట్టి, అందరు ఆ దేవత పేరు చెప్పి సాంబ్రాణి పొడుము నిప్పులో వేయవలెను. మీరు క్రీస్తునే వూజించుకొండి, ప్రార్థించు కొనండి గాని పొడుము మాత్రము నిప్పులో వేయండి, చావు తప్పును" అని చాటించిరి. కొందరు క్రైస్తవులు పొడుములో ఏముంది? ప్రభువునే ప్రార్ధించుకొందుము గనుక పొడుము మాత్రము వేయుదమనిరి. పొడుము వేసినంత మాత్రమున పూజ చేస్తామా? దానికి నమస్కారము చేయుమని చెప్పలేదు కదా! మరలవచ్చి యేసు ప్రభువే ప్రార్ధన చేయవచ్చుననిరి. కొందరు - ఇదంతా మాయ! ఆలాగు పొడుము వేయకూడదు అనిరి. ఇట్లు వారిలో వారు రెండు భాగములైరి. గనుక ఏది వచ్చినను, ప్రభువు పక్షముగా కొందరు నిలిచిరి. కష్టములలో మానవునియొక్క స్థిరత తెలిసికొన వచ్చును. హింసలలోనే అసలు క్రైస్తవులెవరన్నది తెలియును.
ఆదికాల క్రైస్తవులు హింసలకు వెరవని వారు గనుక ఇంతవరకు ఆ మతము వచ్చెను. మరియు "రంగ స్థలములలో" అందరు కూర్చొని, మధ్యను క్రైస్తవులనుంచి క్రూరమృగములను వారిపైకి విడిచిరి. అవి వారిని చీల్చి చంపెను. ఒక భక్తుడు అట్లు చంపబడుచుండగా ఇట్లు పలికెను: "నేను గోధుమగింజను, సింహపునోరు తిరుగలి. దాని నోటిలో వడి నేను పిండి అగుదును. ఆ పిండి పరలోకము వెళ్ళును. అక్కడ ప్రభువు రొట్టె కాల్చుకొని తినును" అని సంతోషించెను. క్రీస్తు ప్రభువు మా కొరకు అన్ని కష్టములు అనుభవించెను. మేము ఆయన కొరకు కష్టపడవద్దా! అని వారు సంతోషముతో శ్రమలు అనుభవించిరి. "అప్పుడు వ్రభువు వంతు; ఇప్పుడు మా వంతు" అని వారు శ్రమలకు ఎదురు వెళ్ళిరి.
ఆది క్రైస్తవులు పొందిన రకరకములైన శ్రమలు:
- 1. కొందరికి తారుపూసి నిప్పు అంటించిరి.
- 2. కొందరిని ఇరుకు సంచులలో దూర్చి వేసి దొర్లించిరి.
- 3. అగ్నిలోవేసి కాల్చిరి.
- 4 కర్రలకు కట్టి, కట్టెలుపేర్చి నిప్పు అంటించిరి.
- 5. తల్లి దండ్రుల ఎదుట బిడ్డలను కాల్చిరి.
- 6. చర్మము ఒలిచి, కాల్చిన రేకులపై పరుండబెట్టిరి.
- 7. రంగ స్థలములలో క్రూరమృగములకు వేసిరి.
- 8. కొండమీద నుండి క్రిందికి పడద్రోసిరి.
- 9. బళ్లెములతో పొడిచిరి. ఇంకా అనేక రకములైన శ్రమలు అనుభవించిరి.
- 10. వాదము. పైవన్ని లెక్కచేయక పోయినను వాదము పెట్టి ఓడింతురు. గనుక ఇదే ముఖ్యమైనది.
ఎందుకనగా సైతాను, యేసు ప్రభువును శోధించుటకు వాదమునే వాడెను. ఇది కత్తివాతవలె భయపెట్టదుగాని కత్తి శోధనకంటే ఇదే గొప్పది. హెబ్రీ 11అధ్యాయము చివరి వచనము. "వీరందరు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను...... వీరు వాగ్ధాన ఫలము అనుభవింపలేదు". ఎందుకు ఈ తిప్పలు అని అడుగగా, "ఈ తివ్పులు పడుట వలన పరలోకములో పవ్పులు పెడతారు" అని వారు చెప్పిరి. ఈ శ్రమలు పడిన వారందరు ప్రార్ధనచేసి అన్ని కష్టములు అనుభవించిరి. వారు తమ ప్రార్ధనయొక్క ఫలితము పొందలేదు. వారు ఈ లోకములోని బహుమానము కొరకు, ఫలితము కొరకు ఆశింపలేదు. ఈ ప్రార్ధనలు భూలోకములో నెరవేరిన యెడల ఫలితము తక్కువ గనుక మాకక్కరలేదు అని వారు భావించిరి. పైన పరలోకములో బహుశ్రేష్టమైన ఫలితము గలదు. గనుక దానినే వారు ఆశించిరి. వారు శ్రమలద్వారా బహు శ్రేష్టమైన పరలోక బహుమానము సంపాదించిరి.
గనుక జబ్బు పోకపోయినను, దయ్యముమీద ఉన్నను, కత్తి, శ్రమ ఏది ఉన్నను - ఇవన్నియు నన్ను మోక్షము చేరకుండ చేయలేవు అను గట్టి విశ్వాసము అవసరము.
ప్రార్ధన: "ఓ ప్రభువా! ఏమి పోయినను, నీ యందు భక్తి వదలము" అను వ్రతము దయచేయుము. ఆదిక్రైస్తవులలో 'పొడుము పార్టీకి' ఆ వ్రతము లేదు, మిగత వారికి ఉన్నది. ఈ వ్రతము, ఈ మతము, సమ్మతముగా బోధించు కృప బోధకులకు దయచేయుము. ఆమేన్.