నమ్మకమైన సేవ - 4



ప్రార్ధన: ఓ దేవా! నీ వాక్యము ఇచ్చినందుకును, నేర్పించినందుకును, నెరవేర్చు చున్నందుకును, నీ వాక్యములోనుండి మాట్లాడుచున్నందుకును నీకనేకమైన వందనములు. ఓ తండ్రీ, నీవు ప్రతి ఆదివారమును నీ వాక్యము వినిపించుచున్నావు గనుక స్తోత్రము. నీ వాక్యము అకాశముకంటెను, భూమికంటెను, దేవదూతలకంటెను, మానవులకంటెను గొప్పది. ఇంత గొప్ప వాక్యమును మేము చదువుటకును, నేర్చుకొనుటకును, అనుసరించుటకును మాకిచ్చినావు గాన నీకనేక స్తోత్రములు. నీ వాక్యము వలన పాపస్థితిలో నున్నవారు, పరిశుద్ధ స్థితికి రాగల వర్తమానము దయచేయుము. వ్యాధిగ్రస్థులకు స్వస్థత కలిగించు వర్తమానము; సువార్త చేయలేనివారికి సువార్తచేయు శక్తిగల వర్తమానము; ఇదివరలో ఈ సంగతి విన్నవారికి, వారి అనుభవములోనికి రాగల వర్తమానము; క్రొత్త వారికి క్రొత్త వర్తమానము; ప్రార్ధన వాలులేని వారికి ప్రార్ధన వాలు కలిగించు వర్తమానము ఇచ్చి దీవించుము. ఇది త్వరగా రానైయున్న శ్రీ యేసు ద్వారా అంగీకరించుము. ఆమేన్.


మనము నమ్మకస్థులమై యుండవలెను. ఎందుకనగా దేవుడు మనలను నమ్మి ఒకపని అప్పగించినాడు. ఇది మిషను పనివారికి మాత్రమేకాదు. అందరకు, అనగా ప్రతివారికిని. ప్రతివారికి దేవుడు ఒకపని అవ్పగించినాడు. దేవుడు ఒకరికి ఒక ఉపకారము చేసిన యెడల, ఆ ఉపకారము పొందినవారికి ఒక పనియున్నది.


మనము ఎందుకు పని చేయవలెననగా,

  1. ఉపకారము పొందియున్నాము,
  2. రక్షణ పొందియున్నాము,
  3. వాక్యము నేర్చుకొనుచున్నాము.

గనుక దేవుడు మనకందరికిని పని అప్పగించియున్నాడు. సువార్తపనివారికి మాత్రమేకాదు, సంఘములోనున్న అందరకును దేవుడు పని అప్పగించినాడు. ఆయన మనలను నమ్మి ఆ పని అప్పగించినాడు. గనుక మనము నమ్మకముగా నుండవలెను. ఇది బుజువు పర్పుటకు బైబిలులోనున్న వాక్యములు ఎత్తి చెప్పుచున్నాను.

  1. నెహెమ్యా 9:8లో దేవుడు ఆరు జనాంగములను యూదులకు అప్పగించియున్నాడు.
  2. యేసుప్రభువు సంఘమునకు ఒక పని అప్పగించియున్నాడు. "మీరు వెళ్ళి సమస్త రాష్ట్రములకు సువార్త చెప్పవలెననే" పని అప్పగించెను. ముందు 11మందికి సువార్త అప్పగించెను. వారు అంత్య దినమువరకు ఉన్న నంఘమునకు పెద్దలై యున్నారు.
  3. కార్యములు 2:9-11. పెంతెకొస్తునాడు దేవుడు 16 జనాంగముల వారిని, యెరూషలేము తీసికొని వచ్చియున్నాడు.

ఈ 16 జనాంగములవారు క్రొత్తగా బాప్తిస్మము పొందినవారు. వీరిని అపోస్తలులకు అప్పగించియున్నాడు. ఆ పది దినములకు ముందు, యేసుప్రభువు శిష్యులతో, మీరు వెళ్ళి సమస్త రాష్ట్రములకు సువార్త చెప్పండి అని చెప్పెను. ఇప్పుడు సమస్త రాష్ట్రములను తీసికొనివచ్చి, ప్రభువే వారికి అప్పగించియున్నాడు. ఇప్పుడును అంతే. దేవుడు మనకు పని అప్పగించి, ముందుగా ఆయనే పనిచేయును. ఈ 16 రాష్ట్రములవారే ఈ లోకములోనున్న వారందరి ప్రతినిధులు. వీరిని యేసుప్రభువు తీసికొనివచ్చి అపోస్తలులకు అప్పగించినాడు. అందరు భాషలతో మాట్లాడినారు. అయితే, వీరిలో ముఖ్యుడు పేతురు. పేతురు యేసు ప్రభువు విషయమై అంతా వరుసగా చెప్పినాడు. విన్నవారి హృదయములు గ్రుచ్చుకొనేటట్లు వాక్యము ఉపదేశించెను. సువార్తికులుకూడ ఆదరణకరమైన వర్తమానము, జ్ఞానోదయ వర్తమానము, హృదయములకు గ్రుచ్చుకొనే వర్తమానము దయచేయుమని ప్రార్ధించవలెను. శిష్యులు - యేసు ప్రభువే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు అని నమ్మినారు. గనుక ఆయా దేశములవారిని ప్రభువే తీసికొనివచ్చి శిష్యులకు అప్పగించెను. వారిని పేతురు సంఘములోనికి తీసికొనివచ్చినట్లుగా కార్యముల గ్రంథములోనున్నది. గాని ప్రభువే వారిని సంఘములోనికి తీసికొని వచ్చెను. దేవుడే పేతురునకు, సర్వరాష్ట్రముల వారికి సువార్త చెప్పగల శక్తి ఇచ్చినాడు. ఆ శక్తిని పేతురు నమ్మకముగా వాడెను. కొందరు పనివారు గ్రామాదులలో పనిచేయుచున్నారు. గాని ఎవ్వరును మారడములేదు. పేతురువలె నమ్మకముగా వనిచేసిన యెడలను, వర్తమానము చెప్పిన యెడలను ప్రభువే వారికి నహాయము చేయును. అప్పుడు ప్రజలు మారుమనస్సు పొందుదురు. ఎప్పుడు మారుమనస్సు పొందుదురు? ఇప్పుడు కొందరు; రాకడప్పుడు కొందరు; ఏడేండ్ల పరిపాలన కాలములో కొందరు; వెయ్యేండ్ల కాలములో కొందరు; సజీవుల తీర్పు సమయమున కొందరు; అంత్యతీర్పు సమయమున కొందరును మారుమనస్సు పొందుదురు. నంఘకాల ప్రారంభమునుండి, అంత్యతీర్పు సమయమునకు సర్వరాష్ట్రములకు నువార్త వినబడితీరును.

  1. "సర్వ రాష్ట్రములకు" అను ప్రవచనము యేసు ప్రభువు కాలములో ఇవ్వబడెను.
  2. "సర్వరాష్ట్రములకు సువార్త" పేతురుద్వారా పెంతెకొస్తునాడు అందెను.
  3. "సర్వరాష్ట్రములకు సూచన" 7ఏండ్ల పరిపాలన.
  4. "సర్వరాష్ట్రములకు వృత్తాంతము" వెయ్యేండ్లకాలములో.

ఆది సంఘము మొదలు, ఈ మనకాలము నుండి, అక్కడనుండి వెయ్యేండ్ల కాలము వరకు, దేవుడు సంఘమునకు పని అప్పగించినాడు.

  1. ప్రవచనము
  2. సిద్ధపర్చుట
  3. సూచన
  4. వృత్తాంతము.

సర్వలోక రక్షణార్థమ్ ఈ వార్త-చాటించుట ప్రధానమ్ = సర్వలోక రక్షణార్థమ్ - చాటించుట ప్రధానమ్ - సర్వదేవ సన్నిధానమ్ - సర్వలోక కాలమానమ్ - క్రిస్మస్ జయజయ్ . ॥దేవలోక॥