ధ్యానపరుని వృద్ధి - 1
"అతడు, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును" కీర్తన 2:2. మన మనో దృష్టిలో నీటికాలువను, దాని ఒడ్డున ఉన్న ఒక చెట్టును తలంచవలెను.
ఈ చెట్టులో రెండు భాగములున్నవి:
- 1) ఆకులు,
- 2) పండ్లు.
నీరు నేలమీద ప్రవహించును. భూమి లోపలికి పోవును. అయితే బైబిలులో నున్నది చిత్రమైన కాలువ. అది, మన కాలువ వంటి కాలువ కాదు. ఈ నీరు చెట్టుపైకి పోవును. ఈ కాలువ నీరు ఈ అడంగు (ఉత్పత్తి స్థానము) నుండి, ఆ పై అడంగునకు వెళ్ళును. అనగా ఈ కాలువ నీరు చెట్టు వ్రేళ్ళనుండి పై కొమ్మలకు, ఆకులకు, పండ్ల వరకు వెళ్ళును. నీటి కాలువ దగ్గరనున్న చెట్టులోని నీరు, చెట్టు క్రిందనుండి చెట్టుపైకి ప్రవహించును. సమస్త సృష్టిలో నీరు ఉన్నది. కాలువలో, నదిలో, సముద్రములో, చెరువులో, బావిలో, సరస్సులో, లోయలలో, మేఘములలో, కొండలలో, చెట్లలో, ముంజెలలో, మనిషిలో, సమస్త సృష్టిలో నీరు ఉన్నది. ఈ దావీదు కీర్తనలోని కాలువలోని నీరు, చెట్టు అన్నిభాగములకు వెళ్ళినది అని బైబిలులో లేదుగాని సృష్టిలోనున్నది.
- 1)బోధించువారు బైబిలులో నున్నవి చెప్పవచ్చును.
- 2) బైబిలులో లేకపోయినను, సృష్టిలోనున్నవి చెప్పవచ్చును.
- 3) అనుభవములో నున్నవి చెప్పవచ్చును.
ఎండలో నడిచిన తర్వాత నీరు త్రాగిన చల్లగానుండును. ఇది బైబిలులో లేదు గాని అనుభవములో గలదు. బోధించునప్పుడు
- 1) బైబిలులోనున్న వాటినిగాని
- 2) నృష్టిలోని వాటినిగాని,
- 3) అనుభవములో నున్నవాటిని గాని కొట్టివేయరాదు.
జామ పండు తియ్యగా నుండునని బైబిలులో, సృష్టిలో లేకపోయినను అనుభవములో నున్నది. బైబిలు మిషను బోధ, బైబిలులో నున్నద? అని అడిగినప్పుడు పై మూడింటిలో నున్నదని చెప్పవలెను. ఒకరు ప్రార్థించుచు ఊగెను, అది నీకు లేకపోవచ్చును. అంత మాత్రమున "అతని ప్రార్ధన వట్టిది" అనకూడదు. ప్రార్ధించినప్పుడు ఆనందము కలిగి స్తుతివచ్చును. అది నా అనుభవములో లేదు గాని వాని అనుభవములో నున్నది. అంత మాత్రమున 'అతని స్తుతి వట్టిది' అనకూడదు. మ్రాను, కొమ్మలు, వ్రేళ్ళు వాక్యములో (కీర్తన 1వ అధ్యాయములో) లేకపోయినను సృష్టిలో నున్నవి. గనుక సృష్టిలోనున్నవి, బైబిలులో లేకపోయినను వాక్యమునకు వ్యతిరేకము కాదు. ఆలాగే అనుభవములోనివి వాక్యములో లేకపోయినను, వాక్యమునకు విరుద్ధము కాదు. ఊట మ్రానులో నుండి పైకి వెళ్ళుచున్నది. చెట్టుయొక్క వ్రేళ్ళు భూమిలోపలి వరకు ఎదిగి వ్యాపించి యున్నవి. చెట్టు వాయు మండలము వరకు ఎదిగియున్నది. అతడు (విశ్వాసి), నీటి కాలువ యోరను నాటబడిన చెట్టువలె నుండును. చెట్టు విశ్వాసులకు పోలిక. ఇందు అవిశ్వాసులు, అన్యులు లేరు. విశ్వాసులే నీటి ఒడ్డున నున్న చెట్టు. ఆకు, పండ్లు అన్ని మంచివే, చెడుగేమియు లేదు. ఆలాగే విశ్వాసి మంచివాడే. గనుక విశ్వాసులకే ఈ బోధ అవిశ్వాసులకు ఇంకా అనేక వాక్యములున్నవి. అవిశ్వాసి, పాపి, దుష్టుల ఆలోచన ప్రకారము చేయువారు; వారికి మార్పు అవసరమా? లేక నీతిమంతుడు, విశ్వాసి, సజ్జనుడు, దేవేష్టుడు; వీరికి మార్పు అవసరమా? పై జాబితా వారికి అశుభ్రత పోయి శుభ్రత రావలెను. ఆలాగే, విశ్వాసులకు కూడ మార్పు అవసరము. అనగా వృద్ధి కావలెను. అవిశ్వాసికి శుద్ధి విశ్వాసికి వృద్ధి కావలెను అని బైబిలులో లేదుగాని సృష్టిలో నున్నది. విశ్వాసి, ఈ భూమిమీద పండ్లు కాచేవరకు అనగా బహిరంగ భక్తి వచ్చేవరకు ఎదగవలెను. పండ్లు బయటికి కనబడును అనగా విశ్వాసియొక్క క్రియలు అందరూ చూతురు గాని వ్రేళ్ళ పైకి కనబడవు. అనగా ప్రభువునకును, విశ్వాసికిని ఉన్న సంబంధము అంతరంగ సహవాసము. పైకి కనబడదు. పండ్లు కనబడినట్లు విశ్వాసి యొక్క క్రియలు కనబడవలెను.
"మనుష్యులు మా సత్ క్రియలను చూచి పరలోకమందున్న మా తండ్రిని మహిమ పరచునట్లు, వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి" (మత్తయి 5:16). చెట్టు చివరి వరకు నీరు వెళ్ళును. ఆలాగే, విశ్వాసికి ప్రతి దినము ఊట (అనగా దేవుని వాక్యము) ఎక్కవలెను. దేవుని వాక్యము చదువునప్పుడు సంతోషము, ఉద్రేకము వచ్చును. ఊటవేరు, వాగువేరు. వాక్యము వేరు, వర్తమానము వేరు. వాక్యము కథ మాత్రమే. పక్షవాత రోగికి ప్రజలు, ఇల్లు, పెంకులు, కప్పు ఆటంకముగా నున్నను ప్రభువు నొద్దకు వెళ్ళెను. ఇది వాక్యములో నున్న కథ. వర్తమానమనగా ఆటంకములున్నను, ప్రభువు సన్నిధికి తప్పక వెళ్ళవలెను. ఉదయముననే బైబిలు చదువుటకు ఆటంకములున్నను చదువవలెను. వాక్యములోని సారము గైకొనవలెను. ప్రభువు సముద్రము మీద నడచెను. ఆలాగే ఆటంకములున్నను, మనమును లోకములో నడువవలెను. చెట్టు ఊటను లాగినట్లు, మనమును వాక్యములో నుండి వర్తమానము అందుకొనవలెను. విశ్వాసి ఇట్లు చేయుచు తన సత్ క్రియలు కనబడు వరకు, మోక్షమునకు వెళ్ళు వరకు ఎదగవలెను.
పెండ్లికుమార్తె సంఘము: "ప్రభువు రెండవసారి వస్తారు" అని ఎదురుచూచు విశ్వాసులు తమ క్రియలు కనబడువరకు ఎదగవలెను. అక్కడ నుంచి మేఘము వరకు, అక్కడ నుండి నూతన యెరూషలేము చేరువరకు ఎదగవలెను. వీరిలో సజీవుల గుంపు గొప్పది. ఈ దినము ప్రభువు వచ్చిన యెడల, వారు సమాధిలోకి వెళ్ళరు. వారు రాకడ వరకు, మేఘము వరకు, నూతన యెరూషలేము వరకు ఎదుగవలెను. మరణించిన విశ్వాసులు సమాధిలోనికి వెళ్ళి, రాకడలో పాలు పొందుదురు. సజీవులు ఒక్కసారే మేఘము లోనికి, నూతన యెరూషలేమునకు పోవుదురు. వాగు దగ్గరనున్న చెట్టు మరణము పొందే విశ్వాసికిని ఊట దగ్గరనున్న చెట్టు మరణము లేని విశ్వాసికిని మాదిరిగా నున్నది. ప్రభువు రాకడకు ముందు కొందరు విశ్వాసులు చనిపోవుదురు. ఎందుకనగా వారి ఆయుష్కాలము పూర్తి అయిపోయినది. మరియు విచారము, జబ్బు, ఇబ్బంది వలన కొందరు చనిపోవుదురు.
కసింద చెట్టు (తగరచెట్టు) ఎదుగదు. చింత, తాడిచెట్టు ఎదుగును. వాక్యము చదువునప్పుడెల్ల ఊట లాగుకొనవలెను. విశ్వాసి యొక్క వాగు, విశ్వాసియొక్క మ్రాను, కొమ్మలు, ఆకులు, పండ్లు, వేరు ఇవన్నీ ఏమిటి? విశ్వాసి అవి కలిగియున్నాడా? సాయంకాలము పరుండక ముందు ఈ ప్రశ్న వేసికొనవలెను: ఈ దినము ఎంత వరకు ఎదిగినాను? నిన్న ఉన్నంత ఉన్నానా? ఇంకా ఏమైన ఎదిగినానా? అని పరీక్షించుకొనవలెను. గతించిన సంవత్సరములో ఉన్నంతే ఉన్నానా? లేక ఏమైన ఎదిగినానా? అని ప్రశ్నించుకొనవలెను.
ప్రార్ధన : "మేము వృద్ధి పొందవలెను" అనే పాఠము. చెట్టును బట్టి మాకు నేర్పిన ప్రభువా! వందనములు. మేము నీ సంఘములో, ఆత్మీయ వృద్ధిలో ఎంతవరకు ఎదగవలెనో, బయట సువార్తపని చేయుటలో మేమెంత వరకు పని చేయవలెనో, అంతవరకు చేయించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.