గ్రంథకర్త యం. దేవదాసు అయ్యగారు


పరిచయము



'ఆత్మీయ స్వస్థత' అను ఈ పుస్తకము ప్రతి ఒక్కరి అంతరంగ పరివర్తన మరియు పరిపూర్ణత కొరకు ఉద్దేశించబడినది.


యోహాను సువార్తలో ప్రభువు - “ఆత్మయే జీవింప జేయుచున్నది.... నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు, జీవమునై యున్నవి (యోహాను 6:63) అని చెప్పుట ద్వారా ఆత్మీయ జీవనము యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిరి. యేసు ప్రభువు మాటలు మనుష్యులకు శరీరాత్మీయ స్వస్థతను కలిగించినవి. ఆలాగే రెండవ రాకడకు సమీపముగా ఉన్న మన ఆత్మలకును స్వస్థత కావలెను అనగా పాప, శాప దుస్థితుల నుండి మేల్కొని, సదాచారములను పాటించి, ధ్యానవృద్ధి చేసికొని, సంపూర్ణ ప్రేమ పతకము ధరించి, పాప నైజమును నిర్మూలము చేసికొను స్వస్థత కావలెను. అపోస్తలుడైన పౌలు, మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచుండవలెననియు; ఆత్మను అనుసరించి మనము క్రమముగా నడుచు కొనవలెననియు వ్రాయుచున్నారు. గనుక శరీర సంబంధమైన స్థితిని జయించుటకును, ఆత్మలో క్రమముగా జీవించుటకును మనకు ఆత్మీయ స్వస్థత అవసరము. ఏ స్థితిలో ఉన్న మానవుడైనను, పరిపూర్ణమైన ఆత్మీయ జీవనమును చేరుకొనుటకు ఎక్కవలసిన వివిధ అంతస్టులను దైవజనులైన యం. దేవదాసు అయ్యగారు ఈ క్రింది సూచికలో తెలియజేసిరి.


athmeeya swasthata

నామకార్థ జీవియైన మానవునకు, ఆ నామకార్ధ స్థితిని విసర్జించే స్వస్థత కావలెను. దుస్థితినుండి బయటకు వచ్చిన మానవుడు క్రైస్త సంఘజీవియై, సంఘ క్రమములను ఆచరించు స్వస్థత పొందవలెను. ఆ పిదప ఉజ్జీవ జీవనములో ప్రవేశించి, ఆత్మోద్రేకమును అందుకొని ధ్యానపరునిగా మారుటకు కావల్సిన స్వస్థతను పొందవలెను. ఈలాగు ధ్యానపరునిగా మారిన విశ్వాసి ప్రభుని సహవాసమువలన కలిగే దైవ ప్రత్యక్షత సంపాదించుకొని ప్రత్యక్షజీవిగా మారవలెను. ప్రత్యక్షతలలో పరిపూర్ణుడైన విశ్వాసి, తన శరీరాత్మలను క్రీస్తు సారూప్యములోనికి మార్చుకొనుటకు అనగా నైజ పాపమును సంపూర్ణముగా జయించుటకు కావల్సిన స్వస్థతను పొంది, మహిమనుండి అధిక మహిమకు వెళ్ళును. అప్పుడు పరలోక మహిమలో స్థిరపడు పరిపూర్ణమైన ఆత్మీయ స్వస్థత దొరుకును.


బైబిలు మిషను 7వ అధ్యక్షులైన రెవ. డా॥ జె. జాన్ సెల్వరాజు అయ్యగారు దైవజనుని వ్రాతలను సేకరించి, వాటిని వెల్లడిలోనికి తెచ్చి ఈ గొప్ప కార్యక్రమమునకు పునాది వేసిరి గనుక వారికి మా నిండు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దైవజనుని అనుంగు శిష్యులైన రెవ. యస్ . సమూయేలు అయ్యగారు దైవజనుని దగ్గర వ్రాసుకొనిన నోట్సులను వారి కుమారులైన రెవ. యస్ . అహరోను కుమార్ గారు బైబిలు మిషను ఆఫీసుకు అందజేయుట ద్వారా మరుగైయున్న దైవజనుని బోధలను అచ్చువేయుటకు వీలు కలిగినది. వారికి మా నిండు కృతజ్ఞతలు. దైవజనుని శిష్యులలో ఒకరైన శ్రీ బోగిరి భూషణం అయ్యగారు వ్రాయించుకొనిన నోట్సులను భద్రపరచి, సమయమునకు అందజేసిన శ్రీ బులిరెడ్డి దంపతులకును మా కృతజ్ఞతలు. ఆలాగుననే దైవజనుని చివరి దినములలో ఆయనకు పరిచర్యచేసి, వారి ఉపదేశములను వ్రాసికొని, వాటిని మాకు అందజేసిన శ్రీమతి మెట్టి అన్నమ్మగారికిని మా నిండు వందనములు. ప్రభువు వీరిని బహుగా దీవించును గాక! ఆమేన్ .


దైవజనులైన యం. దేవదాసు అయ్యగారు ఉపదేశించిన బోధలను, ప్రచురించిన కరపత్రములను, ఈ పుస్తకములో మీకు అందించుచున్నాము. అంతరంగ దృష్టితో ఈ గ్రంథమును పఠించువారు, ఈ క్రమములో తెలియజేయబడిన అన్నీ అనుభవములను సంపాదించుకొని, రాకడ మేఘమెక్కగలరు, మహిమ జీవనములో వర్ధిల్లగలరు. చదువరులందరూ అట్టిస్థితిని అందుకొనుటకు పెండ్లికుమారుడైన యేసుప్రభువు తన ప్రత్యేక కృపను చూపించును గాక! ఆమేన్ .


ఇట్లు త్వరగా రానైయున్న ప్రభువునందు
రెవ. డా॥ ఎ. జాన్,
ప్రసిడెంట్, బైబిలు మిషను.