విశ్వాస ప్రమాణము



  1. అనాదియు అనంతముగల దేవుడు, అనాది కాలమునందే నన్ను రక్షించవలెనని తలంచినాడని నేను నమ్ముచున్నాను.

  2. ఆయన ఎట్టివాడో నరుడుకూడా అట్టివాడై యుండవలెనని, తన దివ్య లక్షణములతో ఆయన నరులను పరిశుద్ధ వంతులనుగా కలుగజేసెనని నేను నమ్ముచున్నాను.

  3. మనుష్యులను కాపాడే సహాయకులు అవసరమని; ఆదిని దేవదూతలను ప్రకాశమాన వ్యక్తులుగాను, ఆత్మ స్వరూపులుగాను కలుగజేసెనని నేను నమ్ముచున్నాను.

  4. మనుష్యులు పుట్టకముందే వారికి కావలసిన గాలి, వెలుగు, నీరు, ఆహార వృక్షాదులు మొదలయినవి కలుగజేసి, తన ప్రేమను బైలుపర్చినాడని నేను నమ్ము చున్నాను.

  5. ఆది దంపతులు సృష్టింపబడిన పిమ్మట వారితో సహవాసము చేసెనని నేను నమ్ముచున్నాను.

  6. ఆది మనుష్యులు ఆజ్ఞ మిరగానే వారిని పలుకరించి, రక్షణయొక్క వాగ్దాన దీవెనలను, భూఫలముల యొక్క దీవెనలను, సంతానము యొక్క దీవెనలను వినిపించుటవల్ల, పాపులను తన దరికి చేరదీసినాడని నమ్ముచున్నాను.

  7. రక్షకుడు భూమిమీద జన్మించేవరకు చేయవలసిన సందర్భములన్నియు, మనుష్యులలో తన భక్తులద్వారా చేసినాడని నమ్ముచున్నాను.

  8. అవిశ్వాసులను, విశ్వాసులను కొన్ని యేండ్ల వరకు మందగా నడిపించినను; అవిశ్వాసులను బట్టి విశ్వాసుల శాఖ అంతరించిపోవునేమో అని వారిని విడదీసి, ఒక ప్రత్యేక జనాంగముగాను, రక్షకుడు జన్మించే జనాంగముగాను నియమించినాడని నేను నమ్ముచున్నాను.

  9. ఆదిని పరిశుద్ధ స్థితిలో యున్నట్లు, పాప పతనము తరువాత దేవుడు మనుష్యులలో నివసింప వీలులేక పోయినప్పటికిని, అప్పుడప్పుడు తన మాటలు వినిపించుచు, వదే పదే తన ప్రేమను బయలువర్చినాడని నేను నమ్ముచున్నాను.

  10. అన్యులెంత అవిశ్వాసులైనను వారినికూడ విడువక, వారితో వారి మనస్సాక్షి ద్వారా మాటలాడుచు, వారికి కూడ సృష్టిలోని భాగ్యములను అనుగ్రహించుచుండెనని నేను నమ్ముచున్నాను.

  11. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపి, వాగ్దానములను నెరవేర్చుకొనెనని నేను నమ్ముచున్నాను.

  12. యేసుప్రభువు లోక రక్షకునిగా మనుష్య రూపముతో వచ్చి, తన బోధవల్ల మనుష్యులను, పాపులను తన దరికి చేరదీసినాడని నమ్ముచున్నాను.

  13. మానవుడు నెరవేర్చవలసిన విదులన్నియు యేసుప్రభువు నెరవేర్చినాడని నమ్ముచున్నాను.

  14. ఈ లోక రక్షకుడు సిలువమీద నా పాపములు, వ్యాధులు, శిక్షలు తనపై వేసికొని, నాలోనున్న కీడంతయు తొలగించెనని నమ్ముచున్నాను.

  15. ఈ నా రక్షకుడు మరణమును జయించి పునరుత్థానమగుట వలన, ఆత్మీయ జయమును, ఆత్మీయ స్వేచ్చను, నేను సంపాదింపలేనివి గడించిపెట్టినాడని నేను నమ్ముచున్నాను.

  16. ఈ సర్వలోక రక్షకుని యొక్క శుభ చరిత్ర, అన్ని రాష్ట్రములలో యొక దరినుండి ప్రకటన యగుచుండగా, మరియొక దరినుండి సంఘమనే "పెండ్లికుమార్తె" సిద్ధమగు చున్నదనియు, ఆయన వచ్చి సంఘమును కొంచు పోవుననియు నమ్ముచున్నాను.

  17. ఆయన నన్నుకూడ సిద్ధము చేయునని నేను నమ్ముచున్నాను.

  18. అటుతరువాత మిగిలిపోయిన విశ్వాసులకు 7సం॥లు శ్రమలు ఉన్నప్పటికిని, శ్రమద్వారా అనేకమందిని మోక్షమునకు సిద్ధపర్చుననియు నమ్ముచున్నాను.

  19. మానవులు బోధలు వినక, శ్రమలలో కూడ మారుమనస్సు పొందక యున్నారు. గనుక చనిపోయిన తరువాత కూడా, హేడెస్ లో మారుమనస్సు పొందుటకు అట్టివారికి గడువు ఇచ్చుచున్నాడని నమ్ముచున్నాను.

  20. పెండ్లి కుమార్తెకు విందైన వెనుక (తరువాత), ప్రభువు భూలోకమునకు వచ్చి, అంతెక్రీస్తును, అబద్ధ ప్రవక్తను నరకములో వేయుననియు; ఆ సమయమందే, ఒక్కసాతానును మాత్రము చెరలో బంధించుననియు నమ్ముచున్నాను.

  21. అటుతరువాత ప్రభువు భూమిమీదికి వచ్చి, నూతన పర్చబడిన ఈ భూమిమీద తన సింహాసన మేర్చరచుకొని, తానును, తన భక్తులును భూమిమీద నీతి పరిపాలన చేయుదురనియు, అప్పుడే సర్వలోకమునకును సువార్త పూర్తిగా ప్రకటింపబడుననియు, అప్పుడుకూడా చాలామంది మారుమనస్సు పొందుదురనియు నేను నమ్ముచున్నాను.

  22. తుదకు సైతాను గతి ఏదనగా, ప్రభువు వాడిని నరకములో వేయుననియు; ఆ పిమ్మట ఆదాము మొదలుకొని ఆ నిమిష పర్యంతము, సమాధులలో యున్న అవిశ్వాసులయొక్క సమూహమును పోగుచేసి, అంత్యతీర్పు చేయుననియు నేను నమ్ముచున్నాను.

  23. అటు తరువాత భూమికూడా పరలోకములో ఒక భాగము అయిపోవుననియు, అందరకును మోక్షానందము కలుగుననియు నేను నమ్ముచున్నాను.

  24. ఇది కేవలము మంచి క్రియవల్లనే కాక వృదయ విశ్వాసమువల్లకూడ లభించుననియు నేను నమ్ముచున్నాను.

  25. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసులకు, వారి విశ్వాస జీవనముయొక్క అభివృద్ధి నిమిత్తమై, పరిశుద్ధాత్మతో బాప్తిస్మము ఇచ్చుననియు నమ్ముచున్నాను.

  26. పరిశుద్ధాత్మ వల్లనే వెలిగింపు కలుగుననియు, ముఖ్యముగా వాక్యము యొక్క సత్య భావములు తెలియుననియు; ఆయన వలననే నానావిధములైన వరములు దొరుకుననియు నమ్ముచున్నాను.

  27. బైబిలు గ్రంథములో దేవుడు ఆయా కాలములయందు, ఆయా కాలవు ప్రజల విషయమై చేసిన అద్భుతములు, లోకాంతము వరకు అవసరమును బట్టి చేయుననియు, విశ్వాసులు అందుకొను శక్తినిబట్టి చేయుననియు నేను నమ్ముచున్నాను. ఆమేన్.