ఆదివార ప్రమేయము - 4
వెయ్యేండ్ల పరిపాలనలోని ఆరాధన: అప్పుడు ఆరాధన, లోక సంబంధమైన యెరూషలేములో జరుగదు గాని నూతన పరుపబడిన యెరూషలేములో జరుగును. గనుక ఆరాధన మహామహిమతో నిండియుండును. నేటి సంఘమును ఎంత దిద్దినను, ఒక ప్రక్కను లోక సంబంధముగానే యుంటున్నది. గనుక మహిమతో కూడిన ఆరాధన సుళువు కాదు. సంఘములు ఒకవేళ నూతన పరచబడుచున్నను, సంపూర్ణముగా నూతన పరచబడలేదు గనుక మహిమారాధన కష్టతరము. ఇప్పుడు మనము ఎంత భక్తిగా నుండవలెనని ప్రయత్నము చేసినను, మన నివాసము పాపలోకము గనుక దాని పొగరు (గాఢమైన వాయువు) ఏ విధము చేతనైనను తగులక మానదు. ఏ సంఘము యొక్కమెంబరైనను, విశ్వాసియైనను పాపశరీరముతో నున్నాడు గనుక మహిమారాధన చేయుట దుర్లభము. మరియు సైతానును, అతని సైన్యమును ఇంకా ఉన్నారు గనుక మహిమారాధన నడుపుట కష్టము. మరియు పాప ఫలితములు కూడ మన కంటబడుచున్నవి గనుక మపిమారాధన చేయట కష్టము. అయితే వెయ్యేండ్ల పాలనయందు
- a) లోక సంబంధము,
- b) శరీర సంబంధము,
- c) పాప ఫలిత సంబంధము,
- d) అపవాది సంబంధము మొదలగునవి ఉండవు
గనుక మహిమారాధన చేయుటకు వీలుపడును. అయినను కొంతవరకైనను, మహిమారాధన ఇప్పుడే జరుగవలెను. అనగా ఆదివారమునాడే అనగా ఎప్పుడుబడితే అప్పుడే జరుగవలెను. నూతన పరచబడిన యెరూషలేములో ఆరాధించువారు, పరలోకమునుండి వచ్చిన భక్తులు గనుక ఆ ఆరాధన మహా మహిమగ నుండును. ఆ భక్తులయొక్క మనసు లోపల రెండు చిట్టాలు (జాబితాలు) ఉండును. ఒకటి విమోచన చిట్టా రెండు దానముల చిట్టా. ఈ రెండిటిలోనుండి స్తుతి బయలుదేరును, ఆ న్తుతి మతాబువలె వెలుగును, అదే ఆరాధన. విమోచనపు చిట్టా అనగా పై నాలుగు ఆటంకముల నుండి విమోచింపబడిన చిట్టా. లోక సంబంధమునుండి, శరీర సంబంధమునుండి, పాప సంబంధమునుండి, అపవాది సంబంధమునుండి విమోచింపబడిన జాబితాల యొక్క కథ ఉండును. దాన చిట్టా అనగా ప్రభువు అనుగ్రహించిన వరముల కథ. అప్పుడు ఎన్ని వరములుండును? ఎన్నైనా ఉండును. పరిశుద్ధత అనే వరము, సర్వభాషా వరము, నిరాటంకముగా ప్రపంచ సంచారము చేయు వరము, అద్భుతము చేయు వరము, మహిమగా సువార్త ప్రకటించు వరము, ప్రభువును చూచు వరము, ప్రభువు మాటలు విను వరము, దేవదూతలతో మిళితమయ్యే వరము, ఎక్కడబడితే అక్కడకు నిమిషములో వెళ్ళు వరము: ఇవన్నియు ఉండును. ఈ వరములన్నిటిలో "పరిశుద్ధత వరము" గొప్పది. ఆరాధనకు ఎప్పుడు తెల్లబట్టలు ఉండవలెను.
ధవళ సమాజము: పూర్వము క్రైస్తవులు ధవళాదివారమున, అందరూ తెల్ల బట్టలు ధరించుకొని గుడికివెళ్ళు వాడుక గలిగియుండిరి. మనముకూడ ధవళాదివారము వంటి ఒకరోజున, ధవళ వస్త్ర ధారులమై కూటములు జరుపుకొనుట మంచిదిగదా! ఆ దినమున దైవసన్నిధిలో సంఘమంతయు, మోకాళ్ళమీద ఒక గంట ఆరాధించి ముగించవలెను. దీనిలో ఒక కీర్తన పాడవలెను, బైబిలు చదువవలెను, రెండు మాటలు చెప్పవలెను, తర్వాత అంతము వరకు నిళ్ళబ్దముగా నుండవలెను. ఆ తర్వాత ముగింవు. (White Sunday - ధవళాదివారము), ఇది సంఘముయొక్క ఇష్టము ననుసరించి యుండును. బూట్లు వేసికొని రాకూడదు, బెంచీలమీద, కుర్చీలమీద కూర్చుండ రాదు, పాదములు కడుగుకొనకుండ రాకూడదు. (ఈ ఆరాధనయందు పిల్లలు ఉండరు).
అనుదిన కూట శేషము: ఈ కూటములకు జబ్బుగా నున్నవారు, అవసరమైన పని యున్నవారు, వీలులేని వారు, ఏదైన ఆటంకములు గలవారు, వస్త్రములు లేనివారు ఈ మొదలైనవారు రాకపోయినను ఫరవాలేదు. ఇష్టముగలవారందరు రావలెను. ఇష్టము లేనివారు కూడ వచ్చిన మంచిది. ఎండగాని, వానగాని, చలిగాని మహా అధికముగా నున్నప్పటికిని, రాగలిగిన కొద్దిమందితో (ఇద్దరు, ముగ్గురు) కూటము నడుపుకొనవలెను. నడిపించువారు లేనియెడల, కనిపెట్టుటలో గడిపి ముగించుకొనవచ్చును.