ప్రభువు ప్రార్ధన భాగములు
భాగములు:
I. పిలుపు - పరలోకమందున్న మా తండ్రీ!
II. మనవి లేక ప్రార్ధన:
-
1. దేవుని గురించిన మనవులు:
- a) నీ నామము పరిశుద్ధపరచబడును గాక!
- b) నీ రాజ్యము వచ్చునుగాక!
- c) నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక!
-
2. మన శరీర జీవనమును గురించిన మనవి:
- a) మా దినాహారము నేడు మాకు దయచేయుము.
-
3. మన ఆత్మీయ జీవనమును గురించిన మనవులు:
- a) మా బుణస్తులను మేము క్షమించియున్న ప్రకారము, మా బుణములను క్షమించుము.
- b) మమ్మును శోధనలోకి తేకుము.
- c) కీడు నుండి తప్పించుము.
III. స్తుతి: రాజ్యము, శక్తి మహిమయు నిరంతరము నీవియైయున్నవి.
మొత్తముమీది భాగములు:
- 1) పిలుపు
- 2) దేవుని గురించిన ప్రార్ధన.
- ౩) మన శరీర జీవనమును గూర్చిన ప్రార్ధన
- 4) మన ఆత్మీయ జీవనమును గూర్చిన ప్రార్ధన
- 5) స్తుతి.
I) పరలోకమందున్న మా తండ్రీ: 'మా' అని పిలుచుటలో ప్రభువు సంఘమును పరలోకమునకు తీసికొని వెళ్ళుచున్నట్లు కనబడుచున్నది. 'మా' అనగా విశ్వాసులందరు కలిసి, దేవుని తండ్రీ! అనుట, వారిలోని ఏకీభావమునకు గుర్తు. పిల్లలు మా నాయన అందురుగాని నా నాయన అని అనరు. తండ్రీ అనుటలో వరస కనబడుచున్నది. అనగా దేవుడు, విశ్వాసుల తండ్రి అని కనబడుచున్నది. సృష్టినిబట్టి ఆయన అందరికీ తండ్రి. అయితే ఆయనను అంగీకరించినవారు 'మా తండ్రీ! అని అనుటలో ఆయన విశ్వాసుల యొక్కతండ్రి అనికూడ కనబడుచున్నది. ఆ తండ్రి పరలోకములో నున్నాడు గనుక విశ్వాసి ప్రార్ధించునప్పుడు, తాను పరలోకమునకు వెళ్ళి తండ్రిని పిలుచుచున్నట్టు భావించు కొనవలెను. మత్తయి 23:9 లో భూమిమిద ఎవరిని 'తండ్రి' అని పిలువవద్దని ప్రభువు చెప్పెను. అనగా పరలోకపు తండ్రిని, భూలోకపు తండ్రులతో సమానము చేయవద్దని అర్ధము. భూలోకపు తండ్రులను కొట్టివేయవలసియుంటే, కన్న తండ్రిని కూడ కొట్టివేయ వలసి యుండును. పరలోకమందున్న తండ్రిని పిలుచునప్పుడు; పిల్లలు తమ తండ్రిని ఎంత చనువుగా ప్రేమతో పిలుతురో, అట్లు మనమును ఆయనను పిలువవలెను. మనము పాపాత్ములము గనుక న్యాయ ప్రకారము చూచిన అంత చనువుతో మనము ఆయనను పిలువకూడదు. గాని క్రీస్తు ప్రభువు మూలమున ఆయన మనకు తండ్రియైనాడు గనుక ఆ చనువు వచ్చినది.
II) ప్రార్ధన లేక మనవి: ఈ భాగములో
- 1. దేవుని గురించిన మూడు మనవులు గలవు.
- a) మనవి: "నీ నామము పరిశుద్ధ పరచబడును గాక!" దేవుడు, ఆదినుండి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కాలము వరకు దేవుడుగానే ఉండెను అనగా చాటుగానుండెను. అయితే మోషే కాలములో పొద దగ్గర ఆయన నామము బయలు పరచబడెను. నేను "ఉన్నవాడను" అనియు తర్వాత 'యెహోవా' అనియు బయలుపడెను గనుక ఆయన నామమునకు మహిమ కలుగవలెను. తరువాత "యేసు" అను నామము సువార్తలలో బయలు పడెను. అపోస్తలుల కాలములో, పత్రికలలో "క్రీస్తు" అను నామము బయలు పడినది గనుక ఆయన నామమునకు మహిమ కలుగవలెను. పరిశుద్ధ పరచబడును గాక అనగా నామమునకు ఘనత కలుగును గాక! ఆయన నామము పరిశుద్ధ పరచబడకుండుటకు అనేక చిక్కులు గలవు. కొందరు సృష్టిని పూజించుట వలన దేవుని నామము ఘనపరచబడుట లేదు. మరియు ఇతర మత గురువులును, ఇతర దేవుళ్ళని పిలువబడువారును, ఆయన నామము ఘనపరచబడుటకు అడ్డుగా నున్నారు. ఈ అడ్డులన్ని పోయినప్పుదడే ఆయన నామము పరిశుద్ధ పరచబడును. గనుక ఈ అడ్డులన్నిి చిక్కులన్ని పోయి, ఆయన నామము పరిశుద్ధ పరచబడును గాక అని మనము ప్రార్థించవలెను. మనము ప్రార్ధన చేయునప్పుడు ఇవన్ని తలంచుకొనవలెను.
- b) మనవి:- "నీ రాజ్యము వచ్చుగాక" అనగా ఆయన సంఘము వృద్ధిపొందును గాక, ఆయనను నమ్మిన వారి గుంపు వృద్ధి అగునుగాక అని అర్ధము. ప్రభువును గూర్చి అందరికిని తెలిసినప్పుడు, అనేకులు రక్షణను అంగీకరించి, సంఘములోనికి ప్రవేశింతురు. ఈ సంఘమే ప్రభువుయొక్క రాజ్యము. "నీ రాజ్యము వచ్చునుగాక" అన్నప్పుడు, అన్ని మిషనులు చేయు సువార్త పనిని దీవించుము అని జ్ఞాపకముంచుకొని ప్రార్ధించవలెను. ఆయన రాజ్యము వ్యాపించుటకున్న ఆటంకములను తొలగించుమని కూడ జ్ఞాపకము ఉంచుకొని ప్రార్థించవలెను.
- c) మనవి:- "నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక!" పది వేలమందిలో ఒక్కరుకూడ, పరిపూర్ణముగా ఆయన చిత్తమును నెరవేర్చుటలేదు. గాని వెయ్యేండ్ల పాలనలో ఆయన చిత్తము చాలమట్టుకు నెరవేరును. దేవుని చిత్తము నెరవేరకుండుటకు శరీరము, మనస్సు, స్వజనులు, వ్యాధులు, సాతాను, లోకము అన్ని ఆటంకములే. ఈ ప్రార్ధన చేయునప్పుడు ఈ ఆటంకములన్ని తొలగించుమని జ్ఞాపకముంచుకొని చేయవలయును.
-
2. మన శరీర జీవనమును గురించిన మనవి: "మా దినాహారము నేడుమాకు దయచేయుము". స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నము, వస్త్రము, గాలి, ఆరోగ్యము, విద్య, వృత్తి, గవర్నమెంటు, శరీరమునకు కావలసినవన్నియు దినాహారములోనివే. "దినము" అనగా ఈ రోజునకు కావలసినవన్నియు, ఈ రోజుననే అడుగవలెను. రేపటికి, ఎల్లుండికి కావలసినవి ప్రభువు ఇస్తే మనము పుచ్చుకొన వచ్చును. గాని మనకు కావలసినవి ఏ దినమునకు ఆ దినమే అడుగవలెను. ఏ రోజు కారోజే ప్రార్థించే విశ్వాసులమై మనము యుండవలెను. "దయచేయుము" అనగా ఇమ్ము అని అర్థము. ఇమ్ము అని అనగానే దేవుడిచ్చును గాని, అది మన చేతిలో లేక పోయినయెడల అది మనము పుచ్చుకొనలేదని అర్ధము. ఇమ్ము అను మాటకు గ్రీకు భాషలో అర్ధమేమనగా 'తండ్రీ! నీవు నాకు దాచి ఉంచినది ఇమ్ము' అని అర్ధము. జార్జిముల్లరు దొరగారు రొట్టెల కొరకు ప్రార్ధించినప్పుడు ప్రార్ధన ముగించునప్పటికి, బండ్లలో రొట్టెలు వచ్చెను. అనగా ఆయన ప్రార్ధన మొదలు పెట్టకముందే, రొట్టెల బండ్లు బయలుదేరినవి.
ఈ ప్రార్ధనలోని మనవి లోకములో ఎవరైనా చెప్పగలరా? ప్రభువు ప్రార్ధనతో సమానమైన ప్రార్ధన ఎవరైన అల్లగలరా? ఈ రెండు ప్రశ్నలు, క్రైస్తవులు ఒకప్పుడు ఇతరులపై పందెము వేసిరి. 1893 సం॥లో చికాగో పట్టణములో, అన్ని మతములవారు కలిసికొని స్నేహము కలిగియుండుటకు ఒక సభను పెట్టుకొనిరి. ఒకరిమతమును ఒకరు దూషింప కూడదనియు, ఎవరికి నచ్చినవి వారు బోధింప వచ్చునని తీర్మానించుకొనిరి. వారు నభను ముగించబోవునప్పుడు ప్రార్ధనచేసి, ముగించవలెను. ఎవరిని ప్రార్ధన చేయుమనినా తక్మినవారికి అభ్యంతరము గనుక ప్రభువు ప్రార్ధన ఎవరికిని అభ్యంతరముగా నుండదని అందరు కలిసి ఆ ప్రార్ధన చేసిరి. ప్రపంచమంతటనున్న ప్రతినిధులందరు మొదటగా ఇచ్చట కలిసికొనిరి. సృష్టి ఆదినుండి ఈ ప్రార్ధనను మొదటిసారిగా, అందరు కలిసి ప్రార్ధించిరి. -
3. మన ఆత్మీయ జీవనమును గురించిన మనవులు:
- a) "మా బుణస్టులను మేము క్షమించియున్న ప్రకారము మా బుణములను క్షమించుము". క్రైస్తవులలో ఎవరు ఇతరుల తప్పులు క్షమించరో, వారు నిజముగా క్షమాపణ పొందలేదన్నమాట. ఇది ప్రభువు ప్రార్ధనలో మహా భయంకరమైన పాఠము. తాను క్షమాపణపొంది, ఇతరులను క్షమించనివారికి, బైబిలు గొంతుక పట్టుకొనునటువంటిది. ఇది గొప్ప ఆపదగల మనవి.
- 1) మనము దేవునిని క్షమించుమని కోరినప్పుడు 10 పాళ్ళు క్షమించుమని కోరుదుము గాని 8 లేక 9 పాళ్ళు క్షమించుమని కోరము. అట్లే మనము ఇతరులను సంపూర్తిగా క్షమించవలెను.
- 2) ఇతరులకు వారుచేసిన కీడునుగూర్చి చెప్పరాదు.
- 3) మనలో ఇతరులు చేసిన కీడునకు ఆయాసముంచుకొనరాదు.
- 4) వారు కనబడినప్పుడు వారుచేసిన కీడు జ్ఞప్తికి తెచ్చుకొనకూడదు.
- 5) మిరు ప్రార్ధనచేయునప్పుడెల్ల పగవానిని క్షమించవలెను.
- 6) మనము క్షమాపణ కోరకపోయినను ప్రభువు క్షమించెను. ఇది చిత్రమైన సంగతి, శత్రువులను క్షమించెను. మనము ఇతరులను క్షమించలేని యెడల "పరలోకపు తండ్రీ!" అని ఆయనను పిలువనే కూడదు, నీ రాజ్యము వచ్చుగాక అని అనకూడదు. అప్పుడాయన నన్ను ఎందుకు పిలువవలెను? రాజ్యము జోలి నీకెందుకు? అని ఆయన అడుగును.
- 7) దేవుడు మనలను క్షమించినాడు గనుక మనము ఆయనకు బుణస్థులము, గనుక మనము ఇతరులను క్షమించవలెను.
-
b) "మమ్ము శోధనలోనికి తేకుము". శోధనలోనికి తేవద్దు అనగా అర్థమేమి? ప్రభువుకూడ కొన్ని మారులు మనలను శోధనలోనికి తీసికొని వచ్చునన్నమాట. ఆదాము, హవ్వలతో దేవుడు- "మేలు కీడు తెల్పు వృక్షఫలములు తినవద్దు" అని చెప్పెను. గాని హవ్వ తన హద్దు (circle) దాటి ముట్టినది, చూచి ఊరకుండిన బాగుండును కాని ముట్టినందున తినవలసి వచ్చెను. శోధనలు రెండు రకములు
- 1. పాప శోధన
- 2. విశ్వాసపరీక్ష శోధన.
- c) మన ఆత్మీయ జీవనమును గురించి చేయు మనవులలో మూడవది: "కీడు నుండి తప్పించుము", పై చిక్కులన్ని కలిపి కీడు. దేవుని నామము పరిశుద్ధ పరచబడకుండుటకు గల ఆటంకములు, ఆయన రాజ్యము వృద్ధికాకుండుటకు గల అద్దులు, ఆయన చిత్తము భూలోకములో నెరవేరకుండ చేయునవన్ని మన బుణస్థులను క్షమింపలేక పోవుట, శోధనలో పడుట మొదలగున వన్నియు కీడు అనబడును. మరణమా! నీ ముల్లెక్కడా? మరణమా! నీ విజయమెక్కడా? అని గలదు గాని మరణమా! నీ వెక్కడ! అని అనలేదు. గనుక మరణము ఉన్నది. కాబట్టి, మరణము యొక్క అధికారము నుండి, శక్తినుండి తప్పించుమని వాక్యములోనే గలదు. మరణము కూడ ఒక కీడు గనుక లోకములోనున్న ఈ కీడులన్నిటి నుండి మమ్ములను తప్పించి, పరలోకములో చేర్చుకొనుమని ఈ మనవియొక్క అర్ధము.
- a) "మా బుణస్టులను మేము క్షమించియున్న ప్రకారము మా బుణములను క్షమించుము". క్రైస్తవులలో ఎవరు ఇతరుల తప్పులు క్షమించరో, వారు నిజముగా క్షమాపణ పొందలేదన్నమాట. ఇది ప్రభువు ప్రార్ధనలో మహా భయంకరమైన పాఠము. తాను క్షమాపణపొంది, ఇతరులను క్షమించనివారికి, బైబిలు గొంతుక పట్టుకొనునటువంటిది. ఇది గొప్ప ఆపదగల మనవి.
III. స్తుతి: "రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవియైయున్నవి. ఆమేన్". ప్రభువు సంఘమునకు, తమ కిష్టమైన మంచి పనులు చేసికొనుటకు అధికారము నిచ్చెను. సంఘము యేసు ప్రభువు వలన పొందిన స్వతంత్రతనుబట్టి, తన దృష్టికి ఏది యోగ్యమో అది చేయవచ్చును. గనుక సంఘము ఈ స్తుతిని ప్రభువు నేర్చిన ప్రార్ధనకు చేర్చినది. ఈలాగు సంఘము కలుపకూడదని కొందరు అనుచున్నారు. మరికొందరు సంఘమునకు ఆ మాత్రము స్వతంత్రత ఉండకూడదా! అనుచున్నారు. ఈ స్తుతి చేర్చుటలో తప్పులేదు.
రాజ్యము - సర్వత్ర వ్యాపించుట, శక్తి - ఆయనలో నున్నదంతయు బయలుపర్చుట. ప్రభావము, తేజస్సు - ఇవన్ని ఆయనకే చెందును. "ఆమేన్" చేసినచో, ప్రార్ధన నెరవేరునుగాక అని కోరుదుము. ప్రభువుకూడ "ఆమెన్" అనును. 'గాక' అనగా, కోరిక బయలుపర్చుట. నా క్రియలవల్ల, నా జీవితమువల్ల దేవుని రాజ్యము వచ్చును గాక. ఆయన నామము పరిశుద్ధ పరచబడును గాక! అనే అర్ధముతో మనము ప్రభువు ప్రార్థన చెప్పవలెను.