ప్రభువు ప్రార్ధన
పరలోకమందున్న మా తండ్రీ! నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక! అనగా ఆయన నామము ఏలాగు పరిశుద్ధ పరచబడును? మన హృదయములో కల్మషమంతయు పోయి మనకు పరిశుద్ధమైన హృదయము కలిగినప్పుడు, ఆయన నామము పరిశుద్ధ పరచబడుచున్నది. నీ రాజ్యము వచ్చునుగాక అని మనము ప్రార్ధించుచున్నాము. అయితే ఆయన రాజ్యము వచ్చునట్లు మనము చేయుచున్నామా? ఆయన వాక్యమును మనము ఇతరులకు చెప్పినప్పుడు, వారు విని, ఆ వాక్యమును అంగీకరించుట ద్వారా వారి ఆత్మ రక్షింపడినప్పుడు ఆయన రాజ్యము వచ్చుచున్నది.
ఆయన నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరును గాక! అని చెప్పుచున్నాము. పరలోకములో దూతలు అందరు ఆయన చిత్తము నెరవేర్చుచు రాగా దూతలలో ఒక దూత ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా నడచి శపింపబడి, ఈ లోకములోని ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి, వారిని పాపములో పడవేసి ఆయనను సిలువవేసినది. అయినప్పటికిని ఆయన సాతానును, మరణమును జయించివేసి, లేచి తన తండ్రి చిత్తమును ఈ భూలోకములో నెరవేర్చినారు. ఆయన చిత్తము భూమియందు ఏలాగు నెరవేరుచున్నది. మనము ఆయన చిత్తమును నెరవేర్చుటను బట్టియే కదా!
ఈ భూలోకములో అనేకులు ప్రభువు చిత్తమును నెరవేర్చవలెనని చూచుచున్నారు గాని ఏదో ఒక అసూయ వారిలో గలిగి ఆయనను సిలువ వేయుచున్నారు.
మా దినాహారము నేడు మాకు దయచేయుము అని అనుచున్నాము. అయితే అనుదిన ఆహారమనగా ఏమనుకొనుచున్నారు? దినాహారమనిన భూలోక సంబంధమైన భోజనమని మాత్రమే అనుకొనుచున్నారా? 'భూలోకపు తండ్రి రొట్టెనడిగిన రొట్టెకు బదులుగా పామునిచ్చునా? అట్లయిన పరలోకపు తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్దాత్మ (ఆహారము)ను అంతకంటె ఎక్కువగా ఇచ్చును అని వాక్యము చెప్పుచున్నది. అందుచేత ఈ భూలోక సంబంధమైన వాటికంటెను, పరిశుద్దాత్మను అనుదినాహారముగా మనము భుజించుచున్న యెడల, ఈ లోక సంబంధమైన దినాహారముకూడ కలిగియున్నట్టే.
"మా బుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా బుణములను క్షమించుమని అడుగుచున్నాము. ఈ భూలోక సంబంధమైన మనుష్యులు చిన్న సహాయము మనకు చేసినయెడల అది బుణమే కదా? మరొక పర్యాయము అతడు కనబడినప్పుడు సహాయము చేసినాడు, వీని బుణము మనకెందుకు?" అని చెప్పి ఏదో ఒక సహాయము చేయుదుము.
ఆయన మొదటే ప్రయాసపడి మనలను మట్టితోచేసి, అన్నియు అమర్చి ఆత్మను మనలోనికి ఊదుట బుణమే కదా! అదేగాక మరల మన పాపమును సిలువమీద మోసి మరణము పొంది తిరిగిలేచుట ప్రయాసమే కదా! నిజముగా దీనినిబట్టి చూచిన యెడల మనము ఆయనకు ఎంత బుణస్థులమైయున్నామో కదా! ఈ బుణమును మనము ఏలాగు తీర్చగలము? ఈ లోకసంబంధమైన మనుష్యులు మనకు సహాయము చేసినప్పుడు అది ఎట్లు తీర్చుదుమా! అని ఆలోచించగా, ఏదో ఒక వస్తువు నియ్యగా వారి బుణము తీరిపోవుచున్నది. నిజముగా మనము ప్రభువు బుణము తీర్చవలెననినా, ఎన్ని మారులు ఆయన సన్నిధిలోనికి వచ్చి, మోకాళ్ళమీద ఉండి ఎన్ని స్తుతులు స్తోత్రములు అర్పించినప్పటికిని ఆయన బుణమును తీర్చలేము. ఇంకను ఆయనకు బుణస్థులమై ఉందుము గనుక మమ్ములను క్షమించుమని ప్రార్ధించవలెను.
షరా: కొందరు క్రీస్తు ప్రభువు దేవుడైతే ఆయన ఎందుకు శ్రమలు పొందవలెను? అని అడుగుచున్నారు. ఈలాగు వారు తెలియక అడుగుచున్నారు.
లోక సంబంధమైన తల్లి ఒక బిడ్డను కనవలెనని 9 నెలలు ప్రయాసపడి, ఎంతో ప్రసవవేదన పడి కనును. పిమ్మట ఆ బిడ్డకు జబ్బు వచ్చిన యెడల బిడ్డకు బదులుగా, తల్లి పత్యముండవలెను. లేనియెడల ఆ బిడ్డయొక్కస్థితి ఏమైపోవునో తెలియదు గనుక ఆ బిడ్డ బాగుపడు పర్యంతము పత్యముండి, వానిని బాగు చేసికొనును.
అదే ప్రకారము మొదట దేవుడు ఎంతో ప్రయాసముతో మనుష్యులను కలుగజేసినప్పటికినీ వారు పాపములో పడి పోయినప్పుడు, వారి పాప దోషమును పోగొట్టుటకు ఈ భూలోకమునకు వచ్చి, ఇన్ని కష్టములు, శ్రమలుపొంది, సిలువమీద ఆయన రక్తమును చిందించి, మన పాపములను దోషములను కడిగివేయుచున్నాడు. అందుకొరకే ఆయన ఇన్ని కష్టములు, భ్రమలు పడవలసి వచ్చెను. ఆయన శ్రమలు, కష్టములు పడకుండిన యెడల మనకు రక్షణలేదు. ఆయనను అనేక విధములుగా పాపకారకుడగు అపవాది కష్టపెట్టినను ఆయన మౌనముగా నుండెను గనుక ఆయన అపవాదిని జయించెను.
మేము మనుష్యుల తప్పులు క్షమించిన ప్రకారము మా తప్పులు క్షమించుము అని చెప్పుచున్నాము గాని మనము నిజముగా మనుష్యుల తప్పులు క్షమించుచున్నామా? మనుష్యుల తప్పులు క్షమించుటలేదు. మనకు ఎవరిమిదనైనను కోపము, అసూయ ఉన్న యెడల ఎన్నో దినములు ఆ కోపము ఉంచుకొందుము. ఆయన ప్రేమ మనలో ఉన్నయెడల ఎందుకు ఒక బిడ్డను క్షమింపలేము? ఆయన ప్రేమ మనలో లేదు గనుక క్షమింహేక పోవుచున్నాము. ఇప్టుడైనను, అనగా ఆయన రాకడ సమిపముగా ఉన్నది గనుక ఆయన ప్రేమను మనలోనికి రానిచ్చి, ఇతర బిడ్డలమాోద ఉన్న అసూయ, కోపము, క్రోధము సరిచేసికొనవలెను. ఎందుకనగా, తనను ద్వేషించి, సిలువ వేసినవారని క్షమించుమని ప్రార్ధించునపుడు, ఆయన అంతరింద్రయములలో ఏ అసూయయుు లేదు. కేవలము నిర్మలమైన మనస్సుతోను, పరిశుద్దాత్మ జీవముతోను ఆయన వారిని క్షమించిరి.
మమ్మును శోధనలోనికి రానీయక కీడునుండి తప్పించుము అని శోధనలో పడకుండునట్లు ప్రార్ధన చేయుచున్నాము. గనుక ఇక్కడ గెత్సేమనే తోటలో శిష్యులకు ప్రభువు చెప్పినమాట "మీరు శోధనలో పడక మెళకువగా నుండుడి" జ్ఞాపకము తెచ్చుకొనవలెను. మనము శోధనలో పడకుండ ఉండవలెననిన యెడల పరిశుద్దాత్మ తండ్రి మనమిద కుమ్మరింపబడవలెను. అప్పుడు మనము మెళుకువగా నుండి శోధనలో పడకుండ, రాకడకు ముందువచ్చు శోధనకాలమునుకూడ తప్పించుకొని ఎత్తబడి, ప్రభువును ఎదుర్కొనగలము. గనుక ఆ విధమైన శోధనను తప్పించుకొనునట్లుగా ప్రార్ధనమెట్ల ప్రకారము ప్రార్థించవలెను.
రాజ్యము, బలము, మహిమ నీవైయున్నవనగా ఆయన వాక్యమును బోధించుటనుబట్టి ఆయన రాజ్యమును వ్యాపింప చేయుచున్నాము. ఆయన వాక్యమే ఆత్మలకు బలము. ఆయన వాక్యము వినగా ఆస్తి కలిగి, మోకాళ్ళమీద ఉండి ప్రార్ధించినప్పుడు ఆత్మబలము పొందగలము. ఆ ప్రకారము మనము, ఇతర బిడ్డలు ఆయన మాటలను ఆత్మీయ సంబంధమైన మాటలని గ్రహించి, వాటి ప్రకారము జీవించుటయే బలము, రాజ్యము, మహిమ నిరంతరము నీవైయున్నవని చెప్పుటకు అర్ధము. ఆ విధముగ నడచుకొనినయెడల రాజ్యము బలము, మహిమ నిరంతరము ఆయనవైయున్నట్టే. ఆమేన్.
మనము మన శత్రువులను క్షమించుటలేదు గనుక ప్రభువు ప్రార్ధన చేయకూడదు. అని కొందరు వాదించుచున్నారు. అట్టివారికి నేను చెప్పునదేమనగా క్షమింపనివారు బైబిలు చదువకూడదు, గుడికి వెళ్ళుకూడదు, చందా వేయకూడదు, ఒక ప్రభువు ప్రార్ధన చేయటయే మానుట ఎందుకు? అన్నియు మానవలెను.