ఆదివార ప్రమేయము - 2
ఆరాధన క్రమము: ఎవరి ఇష్ట ప్రకారము వారు ఆదివార ప్రోగ్రాము (కార్య క్రమమును) ఏర్పరచుకొన వచ్చును. అయితే వెయ్యేండ్ల పరిపాలనలో జరుగనైయున్న ఆరాధనను, ప్రతి ఆరాధనలోను జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను.
- 1) సంఘము కూడుకొనగానే కిన్నెరమీద (గిటారుమీద సంగీత వాయిద్యము) ఒక కీర్తన వాయించవలెను. ఇది సంఘమునకు ప్రారంభ ఉద్రేకము కలిగించును.
- 2) తర్వాత ఒక స్తుతి కీర్తన పాడవలెను లేదా పరిశుద్దాత్మను పిలుచునట్టి కీర్తనయైనను పాడవలెను.
- 3) "తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ఆరాధన ఆరంభించుదము" అని బోధకుడు చెప్పగా సంఘము "ఆమేన్" అనవలెను.
- 4) సంఘము రెండు మూడు నిమిషములు త్రియేక దేవుని తలంచుకొని నిశ్శబ్దముగా నుండవలెను.
- 5) అప్పుడు బోధకుడు పాపపు టొప్పుదల చేయించవలెను (సంఘము మోకాళ్ళూని ఒప్పుదల చేయవలెను).
- 6) పాపములు క్షమింపబడినవను విశ్వాసము కలిగించుకొనుచు, సంఘము రెండు మూడు నిమిషములు ఊరకుండవలెను. తర్వాత బోధకుడు, సంఘముచేత క్షమాపణార్థమైన స్తుతి చేయింపవలెను.
- 8) తరువాత సంఘమంతటిచేత తీర్మానము చేయింపవలెను. "మాకు తెలిసిన ఏ పొరపాటును చేయము; చేయకుండుటకు ప్రయత్నించెదమను" తీర్మానము చేయింపవలెను. తర్వాత తీర్మాన ప్రార్ధన చేయవలెను. తీర్మానము నెరవేర్చుకొనగల శక్తి దయచేయుమని వేడుకొనవలెను.
- 9) తరువాత సమర్పణ చేయవలెను. శరీరమును, ఆత్మను, ఇంకను కలిగియున్న సమస్తమును, ముఖ్యముగా మన చిత్తమును దేవునిచిత్తమునకు సమర్పణ చేయవలెను. దేవునికి మనలను మనలమే అప్పగించి వేసికొనవలెను. ఆయనకు పూర్తిగా లోబడిపోవలెను. (ఇట్టి ప్రార్ధనచేసి, సమర్పణ స్థిరపడుటకుగాను రెండు మూడు నిమిషములు నిశ్శబ్దముగా నుండవలెను). తరువాత "సమర్పణ నెరవేర్చుకొనగల శక్తిని దయచేయుము" అను ప్రార్ధన చేయవలెను. (స్తుతికీర్తన పాడవచ్చును)
- 10) తర్వాత విశ్వాస ప్రమాణము చెప్పించవలెను. ఇది సమర్పణకు సమీపముగానున్న అంశము. విశ్వాస ప్రమాణమనగా "నీవు నా తండ్రివి, నీవు నా పోషకుడవు, నీవు నా రక్షకుడవు, నీవు నా సమస్తమై యున్నావు" అను మాటలతో చేయబడవలెను.
- 11) బైబిలు పాఠమును, సంఘము నిలువబడి చదువవలెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ముగ్గురిని తలంచుకొని చదువవలెను (ఇక్కడ ఏ కీర్తననైనను పాడవచ్చును).
- 12) తరువాత ప్రసంగము చేయవలెను. ప్రసంగాంతమందు త్రియేక దేవుని స్తుతి పాడవలెను లేదా చెప్పవలెను.
- 13) తర్వాత కానుకలు అర్చించుట (కానుకలకు సంబంధించిన కీర్తన పాడవచ్చును). కానుకల విషయమైన ప్రార్ధన చేయవలెను.
- 14) ప్రకటనలు వినిపింపవలెను.
- 15) తరువాత నానా అంశముల మీద ప్రార్ధన, ప్రత్యేకాంశముల మీద ప్రార్ధన చేయవలెను.
- 16) కొన్ని నిమిషములు ఊరుకొనవలెను (కనిపెట్టుట). ముగింపులో ప్రభువు ప్రార్ధన, దీవెనతో ముగించవలెను.
- 1) షరా: సర్వాంశ ప్రార్ధనలో - అన్ని క్రైస్తవ శాఖలయొక్క ఐకమత్యత, బైబిలు సొసైటీ, ట్రాక్టు సొసైటీ, రోగులకొరకైన ప్రయత్నములను దీవించుమని, బీదలకొరకైన ప్రయత్నములను దీవించుమని, పాపుల కొరకైన ప్రార్ధనలు, సర్వ రాష్ట్రములకు సువార్త ప్రకటన కొరకు, యుద్ధములు రాకుండుటకు మొదలగు అంశములన్నియు ఉండవలెను.
- 2) షరా: గుడిలో మాట్లాడుట, గుడికి ఆలస్యముగా వచ్చుట, మధ్యన లేచిపోవుట, పాటలు అందరితో కలసి పాడకపోవుట, కునుకుపాట్లు పడుట, అరిగిపోయిన నాణములు, చెల్లని నోట్లు చందాలో వేయుట, పిల్లలు అల్లరిచేయుట, పరధ్యానముగా నుండుట ఈ మొదలైనవన్నియు మానివేయవలెను (ఆరాధన గంటన్నర కన్నను ఎక్కువ ఉండుట మంచిదికాదు).
- 3) షరా: కొన్ని సంఘములలో బోధకులు వంతు ప్రకారము, దావీదు కీర్తనలు చదువుదురు. ఇది మంచి వాడుక.
- 4) షరా: ప్రతి ఆరాధనకు "త్రియేక దేవుడు, దూతలు, పరిశుద్ధులు వస్తారు" అను సంగతి జ్ఞాపకముంచుకొనవలెను. బడికి వెళ్ళుట అనగా పిల్లలకు సంతోషము. అట్లే ఆటలు అనగా పిల్లలకు ఎంతో సంతోషము. ఆలాగే ఆరాధన అనగా విశ్వాసులకు మహా ఆనందము కలుగవలెను.
- 5) షరా: కొందరు ప్రసంగము ముగియగానే వెళ్ళిపోవుదురు. వారి దృష్టిలో ప్రసంగమే ఆరాధన. అయితే ప్రసంగము కంటే, ఆరాధనే ముఖ్యము.
- 6) షరా: పెండ్లికుమార్తె చేయు ఆరాధన మిక్కిలి ప్రశస్తమైనదై యుండవలెను. వజ్రమువలె ఉండవలెను.
- 7) షరా: ఆరాధనలో, మనలను మనము ప్రభువునకు సమర్పించుకొనవలెను. అప్పుడు ప్రభువు తాను మనకివ్వవలసినవి సమర్పిస్తారు.
- 8) షరా: ఆరాధనలో ముఖ్యమైనది స్తుతి. మరియు మన కీర్తనలు, ప్రార్ధనలు, స్తుతులు, కానుకలు ప్రభువు అంగీకరించినట్లు మన మనస్సునకు తట్టవలెను.