సన్నిధి సూర్యకిరణముల గుంపు



నీతి సూర్యుని కిరణముల రాశి. అనగా కుమారునిలో నుండి వచ్చిన వరముల రాశి. నిధి = సమూహము = గుంపు. సర్వ కోరికలు నెరవేర్చు ఒక సూత్రము, దైవసన్నిధి.


దేవుని సన్నిధి: మనము ఉదయమునే లేచి నీళ్ళతో ముఖము కడుగుకొని, కొన్ని వాక్యములు చదువుకొని, వీలైన యెడల ఒక కీర్తన పాడుకొని, ఈలాగు ప్రార్థించిన తరువాత కనిపెట్టుట మంచిది.


"ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా! నాయొద్దకు రండి అని సెలవిచ్చిన ప్రభువా! నీకు స్తోత్రము. నీవు రమ్మన్న ప్రకారముగా నేను నీయొద్దకు వచ్చినాను. నేను నీ సన్నిధిలో కూర్చుని యున్నాను. నీ కిరణములు నామీద పడనిమ్ము నా శరీరాత్మలమీద నీ కిరణములు పడనిమ్ము. నీ గుణములు నాకురానిమ్ము. నాకు నేటి దినమున నీ ప్రత్యేకమైన వర్తమానమేమైన చెప్పుటకు యున్న యెడల సెలవిమ్ము. ఆమేన్", అని ప్రార్ధించిన తరువాత లోకమును, శరీరమును, సాతానును, పాపమును మరువవలెను. "సదాకాలము నేను మీ దగ్గరనున్నానని" సెలవిచ్చిన యేసు ప్రభువు "నాతో ఉన్నారు, నా ప్రార్ధన విన్నారు" అని విశ్వసించవలెను. ఇట్టి విశ్వాసముతో కనిపెట్టవలెను. దేవుడు నా దగ్గర ఉన్నాడు నేను దేవుని దగ్గర యున్నాను అనే ఈ రెండు తలంపులు మాత్రమే కలిగియుండవలెను. ఇట్టి తలంపులతో కనిపెట్టిన యెడల, ఆ సమయమందు ప్రభువు యొక్క కిరణములు శరీరము మీదను, ఆత్మయందును పడును. ఆ కిరణముల వలన ఆత్మలోని చీకటి అవిశ్వాసము, నిరాశ, చింత, దుఃఖము, భయము, పిరికితనము అనునవియు, ఇంకా చెడుగునకు సంబంధించినవన్నియు గతించిపోవును. హృదయమునకు శాంతి, సంతోషము, ఆదరణ వచ్చును. మోషే నలుబది దినములు దేవుని దగ్గర కనిపెట్టినందున, ఆయన ముఖమునకు దైవకళ వచ్చెను. మనుష్యులకు కనబడకుండా ఆ కళను బట్టతో కప్పుకొన్నను, బట్టలోనుండి బైటికి వెళ్ళి, మనుష్యులమీద పడెను. మోషే నలుబది దినములు దేవుడు చెప్పినది చేసెను. దేవుడు చెప్పిన మాటలు వ్రాసుకొనెను. ఆయన ముఖకాంతి, కళ సౌందర్యములను మోషే సంపాదించుకొనెను. ఆలాగుననే మనమును దేవని సన్నిధిలో కనిపెట్టుకొనిన యెడల, దేవుని కిరణములు మనమీద పడును. మోషే నలుబది దినములు కనిపెట్టుకొని అంత మహిమను సంపాదించుకొంటే, మన జీవిత కాలమంతటిలో ప్రతి దినమును కనిపెట్టగలిగిన యెడల, మనమెంత సంపాదించుకోగలము. కనిపెట్టుట వలన సాతానుకు ఇష్టము లేదుగానీ, దానికి చాలా కష్టము. కనిపెట్టు వారనగా దేవునికి చాలా ఇష్టము.


ఉదా: యాకోబు తనకు కలిగిన కుమారులందరిలో, తన దగ్గర కూర్చుండిన కుమారుని ఎక్కువగా ప్రేమించెను. తక్కిన కుమారులు తండ్రియొక్క పొలములో కష్టపడి పనిచేయువారు. వారిని తండ్రి ప్రేమించెను గాని తన దగ్గర కూర్చుండిన కుమారునిని మిక్కిలిగా ప్రేమించెను. ఆలాగుననే మన పరలోకపు తండ్రి, తన వాళ్ళు వినగోరువారిని మిక్కిలిగా ప్రేమించుచున్నాడు. ఈ కాలంలో సువార్త ప్రకటించువారు అనేకులున్నారు. పత్రికలు పంచువారు ఉన్నారు, ప్రసంగీకులున్నారు, ప్రార్ధించువారు ఉన్నారు, సంగీతములు పాడువారు ఉన్నారు గాని కనిపెట్టువారు లేరు. కనిపెట్టుట ఎంతో మంచిది. కనిపెట్టుట మనకు చిన్నప్పటి నుంచి లేదు. యోహాను ప్రకటన గ్రంథములో నున్న విషయములన్నిటిని కనిపెట్టు సమయములో చూచెను. దర్శనములు చూచుట, వాగ్దానములు పొందుట, మాటలు వినుట, బోధలు, పాటలు దేవుని దగ్గర నేర్చుకొనుట; అనునవి కనిపెట్టు సమయములో జరుగు విషయములై యున్నవి. ఒక వేళ ఇవి వెంటనే జరుగకున్నను, కిరణములు పడుట అనుదినము తప్పక జరిగి తీరును. నీకు ప్రారంభమందు, కనిపెట్టుట ద్వారా లాభమనిపించనట్టు కనబడవచ్చును. గాని ఆయన కనబడని సమయములోనే కని పెట్టుటనునది (మానవుల కొరకు కనిపెట్టుట కంటె) ఎక్కువగా కొనసాగించవలెను. అప్పుడు అన్ని విధములైన లాభములు పొందగలము. కనిపెట్టు వారికి విశ్వాసమును, శ్రద్ధయు, ఓపికయు ఉండవలెను. సోమరితనమును, బద్ధకమును, జయించవలెను. ఈ రెండును జయించి కనిపెట్టువారు , కనిపెట్టుటలో ఎంత మహిమ యున్నదో అనుభవించి, అంతవరకు సాక్షమియ్యగలరు. దినమునకు అధమ పక్షము ఒక గంట కనిపెట్టుట చాలును. ఆ తరువాత మీ ఇష్టము.