నైజపాప నిర్మూలము



ధ్యానపరులారా! సిలువధ్యాన పరులారా! పాలస్తీనా దేశములోని యెరూషలేము పట్టణ సమాపమున ఉన్న కలువరి గిరిపై మూడు సిలువలు మనకు కనబడుచున్నవి. ఈ చరిత్ర పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 23వ అ॥లో కనబడుచున్నది. ఈ దినమున ఆ మూడు సిలువల చరిత్ర, మా అందరి తలంపులలో యున్నది. ఈ ఉదయమున నేను రెండు సిలువలను గూర్చి మాట్లాడుచున్నాను. ఇద్దరు మనుష్యులను గూర్చి మాట్లాడు చున్నాను. అనగా ఒకే మనిషి రెండు స్థితులలో ఉన్నాడు గనుక ఇద్దరనుచున్నాను; గాని ఒకే మనిషి, ఒకే సిలువను గూర్చి మాట్లాడుచున్నాను. ఒకే వ్యక్తిలో ఏకకాలమందు రెండు స్థితులుండును. అందుకే మరి రెండు సిలువలని సంబోధించుచున్నాను. మీ దృష్టిలో ఇక్కడ ఒక మనిషి ఉన్నట్లును, ఆ ప్రక్క ప్రభువు ఉన్నట్లును భావించుకొనండి. ఇప్పుడు ఈ ఇద్దరి విషయము, ఈ రెండు సంగతులు మరువకున్న యెడల, మీరు ఈ దిన వర్తమానము గ్రహింపగలరు.

మానవుని దగ్గర ఒకగది ఉన్నది. ఆ గదే గాక దానిక్రింద మరియొక గదికూడ ఉన్నది. అనగా రెండు గదులు కలవు. అక్కడ యేసు ప్రభువు దగ్గరను యొక గది, దానిక్రింద మరియొక గది కలవు. కాబట్టి ఇక్కడ రెండు గదులు, అక్కడ రెండు గదులు; ఇక్కడ మనిషి, అక్కడ యేసు ప్రభువు ఉన్నారు. ఈ గదుల తలుపులు ఏమనగా సంఘమును, మనిషిని. యేసు ప్రభువును అందులో కనబడతారు. అనగా ఒకవైపున రెండు గదులున్నవి. మరియొక వైపునకూడ రెండు గదులు కలవు.

ఈ నాలుగు గదులు మనిషి జీవితము నుండి ఏరుకొన్నవి. ఆ రెండు గదులకు, ఈ రెండు గదులకు మధ్య కొన్ని ప్రశ్నలున్నవి.


1వ ప్రశ్న: ఓ విశ్వాసీ! నీవెక్కడ ఉన్నావు? పైగదిలో ఉన్న సింహాసనము పైనా లేక క్రింది గదిలో ఉన్న సిలువపైనా?


2వ ప్రశ్న: ఓ విశ్వాసీ! యేసు ప్రభువును సిలువ ఎక్కించినావా? లేక సిలువపై నుండి దించినావా? ఆయనను సిలువపైనుండి దించి, సింహాసన మెక్కించినావా?


సిలువపైనుండి ప్రభువును దించినయెడల, ఆయనను సంతోషపరచి గంభీర ఆరాధన చేయుదువు లేదా ఆయనను సిలువనెక్కించి, ఆయనను తృణీకరించెదవు. లూకా సువార్తలో, హేరోదు ప్రభువును తృణీకరించి అపహసించెనని వ్రాయబడి యున్నది. ఈ దినములలో మనము కూడ ప్రభువును అట్లే చేస్తూ ఉన్నామని; ఆలాగు చేయువారికిని, మనకును తెలియక పోవచ్చును. మనకు తెలిసినా తెలియకపోయినా, ఏదో యొక గదిలో మనముండి తీరవలయును గనుక పరీక్షించుకొనవలెను. "నేను ఏదో ఒక పొరభాటువలన సింహాసనము పైనుంటే ప్రభువు సిలువపై నుండును" అని గ్రహించుకొనవలెను. అప్పుడు నాలో కాదుగాని, సిలువపైనే ప్రభువుకు చోటు. మన హృదయము సిలువపైనున్న యెడల, ఆయన సింహాసనముపై యుండును. యేను ప్రభువు నీ హృదయ సింహాసనముపై యుంటే, నీవు ఆయన పాదములయొద్ధ కూర్చుండి నమస్కారము చేయుదువు. పాపాత్మురాలు యేసు ప్రభువు పాదములయొద్ద కూర్చున్నది. ఇప్పుడు ఆమె ఆయన పాదములయొద్ద పరిశుద్దురాలుగా ఉన్నది గాని పాపాత్మురాలుగా మాత్రము కాదు. పాపాత్మురాలు పరిశుద్దురాలైనది. అపరంజిని పోలిన పాదములు గల ప్రభువు నా హృదయ సింహాసనముపై యుంటే నేను ఎంత ధన్యుడను! ఎంత ధన్యురాలను? అని సంతోషింప వలయును. ఈ వర్తమానము చాలా గొప్పది. ఒక ప్రశ్న ఓ విశ్వాసీ! నీవు నీ పాపములను బట్టి యేసు ప్రభువును సిలువ మీద ఉంచినావా? లేక నీ మారుమనస్సును బట్టి సింహాసనము మీద ఉంచినావా? ఈ దినము మనమందరము ప్రభువుతో, "ప్రభువా! నీవు నా హృదయములో సింహాసనముపై కూర్చుండుము" అని చెప్పవలెను.


ఉదా: యేసు ప్రభువు తన 12మంది శిష్యులతో మాటలాడుచు, "మీలో ఒకడు నన్ను అప్పగింపనైయున్నాడని చెప్పెను. అంతట ఆ శిష్యుల హృదయము గలిబిలియై, ప్రభువా! నేనా?నేనా? అని ఆయనను అడిగిరి. గనుక ఈ దిన ధ్యాన కూటములో, ప్రభువా! నిన్ను సిలువ ఎక్కించేవారు అనేకులు ఈ లోకములో ఉన్నారు, అయితే నేను నిన్ను సిలువ నెక్కించుచున్నానా! అని ప్ర శ్నించుకొన వలయును. అప్పుడు ప్రభువు ఇచ్చు జవాబు బైబిలులో ఉన్నది. ప్రభువు 11 మంది శిష్యుల వైపుచూచి, మీరందరు పవిత్రులేగాని మీలో ఒకడు పవిత్రుడు కాడనెను. ఆలాగే సిలువ ధ్యాన సమయమందు ప్రభువు - మీరందరు పవిత్రులే, మంచివారేగాని ఒక్కడే ఇక్కడ అపవిత్రుడై ఉన్నాడంటే ఎంత సంతోషము! ఒక్కడైయున్న ఆ యూదావంటి వారమై మనమున్న యెడల, అందరి ముందు ప్రభువునకును, తక్కిన వారికిని విచారమే.


యేసు ప్రభువు యెదుట మనిషి తన చెడ్డ నైజము దాచుకొని, దాచుకొని తనంతట తానే బైటపెట్టుకొనును. యూదా తన చెడ్డనైజమును 3 1/2 సం॥లు దాచిపెట్టి, తనంతట తానే బైటపెట్టెను, ఎవరును బయటపెట్టలేదు. యూదాలో నుండి చెడ్డనైజము బైటికి వచ్చినట్ట్లు, ప్రభువులో నుండి మంచి నైజము బయటికి వచ్చెను. యేను ప్రభువులో గొప్ప ప్రేమ ఉన్నదిగాన దాచుకొనలేక పోయెను. అనేక వందల పర్యాయములు ఆ ప్రేమ చూపించి, చూపించి చివరకు సిలువపై ఆ ప్రేమను సంపూర్ణముగ చూపించెను. అప్పుడు పాపి ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా! నీవు ఎంత ప్రేమగలవాడవో ఇప్పుడు తెలిసినది. పాత నిబంధనలో నీ ప్రేమ తెలిసినది గాని ఇంత ప్రేమయని అప్పుడు తెలియలేదు, ఇప్పుడు బాగా తెలిసినది. నీ ప్రేమ అంతా, నీ రక్తమంతా నీ శరీరమంతా "నాకొరకే ధారపోసినావు" అని అనును. ఈ ప్రకారముగా నీ ప్రేమ అంతా, దాచుకొనక బయటపెట్టి, అందరికిని చూపించినావని స్తుతించును. ప్రభువు సిలువ నేలకు తాపడము చేయబడక, పైకెత్తి చూపించబడెను. యేసు ప్రభువు యొక్కసిలువ ఏ రీతిగా పైకెత్తి చూపించబడినదో, ఆలాగే ఇప్పుడును ఆయన ప్రేమ, శరీరము, రక్తము పైకెత్తబడి చూపింపబడుచున్నవి. ఆయన మన నిమిత్తము తన జీవనమంతా ధారపోసినాడు. ఈ దినము 3 గం॥ల వరకు ధ్యానంలో ఉండండి. అట్టి ప్రభువు విషయము ధ్యానించండి. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమేన్.